ఆంధ్రప్రదేశ్‌

తూర్పు గోదావరిలో ‘డ్రాగన్ ఫ్రూట్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 8: కొండ కోనల్లో సహజ సిద్ధ వ్యవసాయాన్ని సాగిస్తున్న ఆదివాసీ రైతుల సాగులోకి వచ్చే ఏడాది నుంచి విదేశీ ఫలం రానుంది. పోషకాల గనిగా పేరొందిన డ్రాగన్ ఫ్రూట్‌ను తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో సాగు చేయించడానికి అధికారులు రంగం సిద్ధంచేస్తున్నారు. వియత్నాం, ఇజ్రాయిల్ వంటి దేశాల్లో విస్తారంగా సాగుచేసే డ్రాగన్ ఫ్రూట్ సాగును జిల్లాలోని రంపచోడవరం సమీపంలోని పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి జిల్లా ఉద్యాన శాఖ ద్వారా చింతూరు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో సాగులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇక్కడి నేలలకు పూర్తిగా కొత్తదైన ఈ పంట ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఈ పండ్లలో విటమిన్లు, మినరల్స్, మాంసకృత్తులు (ప్రొటీన్స్), యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిస్, కొలెస్ట్రాల్, బరువుతగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత, కేన్సర్‌వంటి వ్యాధులకు సైతం మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఇన్ని పోషకాలు ఉండటం చేత ఈ పండ్లకి మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో మూడు రకాలు ఈ ప్రాంతంలో సాగులోవున్నాయి. పింకు రంగులో రెండు రకాలు, పసుపు రంగులో ఒక రకం ఉన్నప్పటికీ పింకు రంగు రకాలు మాత్రమే మన రాష్ట్రంలో సాగులో వున్నాయి. ఈ పంట సాగుకు 25-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, తేలిక పాటి నేలలు, ఎర్ర మట్టి నేలలు, నీటి నిలువవుండని నేలలు, వర్షపాతం తక్కువగా వుండే ప్రాంతాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఈ పంటను విత్తనం, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. కొమ్మ కత్తిరింపు పద్ధతి ద్వారా తల్లి మొక్క పూర్తి లక్షణాలు రావడమే కాక, ఈ పద్ధతి సులువైనది. ఒక సంవత్సరం దాటిన తల్లి మొక్కలను ఎంచుకుని 20 సెంటీమీటర్ల పొడవువున్న కొమ్మలను కత్తిరించి, ప్రవర్ధనానికి వాడుకోవచ్చు.
డ్రాగన్ ఫ్రూట్ సాగులో ముఖ్యమైనది ట్రానింగ్ పద్ధతి. అంటే సిమెంటు, ఇనుప స్తంభాలు ఉపయోగించి ఈ పంటను సాగు చేయాల్సివుంటుంది. ఈ స్తంభాలు 5-6 అడుగుల దూరంలో ఉండేట్లు చూసుకోవాలి. ఒక్కో స్తంభానికి ఒక్కో వైపున ఒక మొక్క చొప్పున నాలుగు వైపులా నాలుగు మొక్కలు నాటుకోవాలి. ఇలా ఎకరానికి 1600 నుంచి 1700 మొక్కలు వేసుకోవచ్చు. ఈ మొక్కలను ఐదు అడుగుల ఎత్తు వరకు పక్కకొమ్మలు రాకుండా పైకి పాకించి, చిగురు కత్తిరించినట్టయితే మూడు కొమ్మలు వచ్చి అధిక దిగుబడులు వస్తాయి.
మొక్క నాటిన 9-12 నెలల్లో డ్రాగన్ ప్రూట్లు కోతకు వస్తాయి. పూత జూన్-జూలై మాసాల్లో మొదలై సెప్టెంబర్-డిసెంబర్ నెల వరకు పండ్లు వస్తాయి. కనీసం 5-6 సార్లు కోత తీసుకోవచ్చు. ఒక్కో పండు 200 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు బరువు వుంటాయి. ఎకరానికి 5-6 టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది. మార్కెట్‌లో కిలో ధర రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోది. ఈ పంటను ఒకసారి నాటినట్లయితే ఏటా ఒకసారి ( జూలై నుంచి డిసెంబర్) వంతున 20-25 సంవత్సరాల వరకు దిగుబడి పొందవచ్చు.
అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడం, తక్కువ నీటి అవసరం, తెగుళ్లు, పురుగులు తక్కువగా ఆశించే ఈ డ్రాగన్ ఫ్రూట్ రకాలను కృషి విజ్ఞాన్ కేంద్రం, డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. మంచి దిగుబడులు వచ్చినట్టయితే చింతూరు తదితర ప్రాంతాల్లో సాగును ప్రోత్సహించడానికి తూర్పు గోదావరి జిల్లా ఉద్యానవన శాఖ సుముఖంగా ఉందని ఈ పంట సాగుపై పరిశోధన చేస్తున్న పందిరిమామిడి కృషివిజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్తవ్రేత్త కేసీ భానుమూర్తి తెలిపారు.