ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీకి జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 10 లక్షల కిలోమీటర్లు తిరిగిన 3800 బస్సులను పక్కనపెట్టి కొత్తవి కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ప్రభుత్వ హామీతో రూ. 1000 కోట్ల రుణ పరపతికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. చేనేత, మత్స్య కార కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని తీర్మానించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం వివరాలను సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చేనేత కుటుంబాలకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద కుటుంబానికి రూ. ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయం అందించాలని, ఈ ఏడాది డిసెంబర్ 21న ఈ పథకాన్ని ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. ప్రతి ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపలవేట నిషేధం అమలులో ఉండే సమయంలో మోటారైజ్డ్, మెకనైజ్డ్, తెప్ప పడవలు, నాన్ మోటారైజ్డ్ పడవలు నడిపే మత్స్యకార కుటుంబాలకు ‘వైఎస్సార్ మత్స్యకారుల వేట నిషేధ సహకారం’ కింద రూ. 10వేల ఆర్థిక సహాయం అందించేందుకు మంత్రి వర్గం ఆమోదం లభించింది. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. మత్స్యకారులకు అందించే డీజిల్ సబ్సిడీని 50 శాతం పెంపుతో లీటర్‌కు రూ. 9 చొప్పున కోస్తాంధ్రలోని 9 జిల్లాల్లో 81 సంస్థల్లో అమలు చేసేందుకు మంత్రివర్గం అంగీకరించింది. దీని వల్ల ప్రభుత్వంపై రూ. 96.06 కోట్ల అదనపు భారం పడనుంది. మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 21న ఈ పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో జీఎస్సీసీ (గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్) తవ్వకాల కారణంగా ఉపాధి కోల్పోయిన 16,654 మంది మత్స్యకారులకు చెల్లించాల్సిన రూ. 80 కోట్ల బకాయిలను ఓఎన్‌జీసీ చెల్లించేందుకు ముందుకురాని పక్షంలో ప్రభుత్వమే నవంబర్ 21 నుంచి బాధితులకు చెల్లించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 4 కోట్ల 80 లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు
అందించేందుకు ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేసి, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు సైతం మంచినీరందించాలని నిర్ణయించింది. మధ్యాహ్న భోజన ఏజన్సీ నిర్వాహకులు 88వేల 296 మందికి రూ. 211.91 కోట్ల కేటాయింపుతో గౌరవ వేతనాన్ని రూ. 1000 నుంచి 3వేలకు పెంచుతూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హోంగార్డులకు అందించే దినవరి వేతన బత్యం కూడా రూ. 600 నుంచి 710కు పెంచేందుకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిబంధనల మేరకు వారికి చెల్లించాల్సిన మొత్తం పైకాన్ని వారి ఖాతాల్లో జమచేసే విధంగా చర్యలు తీసుకోవటంతో పాటు దళారీ వ్యవస్థను రూపుమాపాలని మంత్రివర్గ సమావేశం తీర్మానించింది. శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ. 50 కోట్లతో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ ఆస్పత్రిలో 5 రెగ్యులర్, 100 కాంట్రాక్ట్, 60 ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బార్ అసోసియేషన్‌లో నమోదైన 3 ఏళ్ల లోపు జూనియర్ న్యాయవాదులకు రూ. 5వేల చొప్పున స్ట్ఫైండ్ చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 3న జాతీయ న్యాయ వాదుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ప్రతి శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బోర్‌వెల్స్ ఏర్పాటు చేసేందుకు 200 డ్రిల్లింగ్ మిషన్‌ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వైఎస్సార్ ఆదర్శం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా ట్రక్కులు, రవాణా వాహనాల కొనుగోలుకు రుణ మంజూరుతో పాటు ఇసుక రవాణా, పౌరసరఫరాలశాఖతో సహా ప్రభుత్వం వినియోగించే ప్రతి రవాణా ప్రక్రియలో స్వయం ఉపాధి కల్పించటమే లక్ష్యంగా కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ట్రక్కుల కొనుగోలుకు బ్యాంక్‌ల పూచీకత్తుతోను, ప్రభుత్వమే ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 20 వేల ఆదాయం లభించేలా విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. పౌరసరఫరాల సంస్థ రుణ పరిమితిని రూ. 2వేల కోట్లకు పెంచాలని, ఆర్థిక సంక్షోభంలో ఉన్న డిస్కంలకు ఊరట కల్పించేందుకు రూ. 4741 కోట్ల మేర బాండ్లు విడుదల చేసేందుకు ఆమోదముద్ర పడింది. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను అధిక ధరలకు కుదుర్చుకున్నందున డిస్కంల మనుగడ ప్రశ్నార్థకమైందని, ఈ పరిస్థితుల్లో బాండ్లను జారీ చేయటం ద్వారా కొంత వెసులుబాటు కల్పించాలనే విషయమై సమావేశంలో చర్చించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా బాండ్లు జారీ చేయాలని నిర్ణయించారు. కృష్ణాజిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తుల నివారణ సంస్థకు 39.23 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో నడికుడి- శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ నిర్మాణానికి అవసరమైన 250 ఎకరాలు, రేణిగుంట విమానాశ్రయ విస్తరణకు 17 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రిమండలి సుముఖత వ్యక్తం చేసింది. విశాఖపట్నం పరదేశీపాలెంలో చౌక ధరకు 1.5 ఎకరం భూమిని 50 లక్షల 5వేలకు ఒక సంస్థకు కేటాయిస్తూ 2017లో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ప్రస్తుత మార్కెట్ ధర రూ. 25 కోట్లు ఉన్నందున, ఆ స్థలం వినియోగంలో లేనందున రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దినపత్రికలకు ఇచ్చే పబ్లిసిటీ యాడ్స్ టారిఫ్ పెంచటంతో పాటు పాఠశాల విద్య మానిటరింగ్ కమిటీ చట్టంపై ఆర్డినెన్స్, విశ్వ విద్యాలయాల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నత విద్య కౌన్సిల్ సభ్యుల ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం లభించింది. ఇంకా మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని సమావేశం తీర్మానించింది. చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటుతో పాటు మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతాంగాన్ని జాగృతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ మంత్రి మండలి తీర్మానించింది. పౌరసరఫరాల కార్పొరేషన్‌కు రూ 24వేల కోట్ల రుణ పరపతి ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వం రూ. 11వేల 500 కోట్లు దారిమళ్లించిందని, దీనివల్ల ప్రస్తుతం ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు రూ. 2వేల కోట్ల రుణ పరపతి పెంచుతూ మంత్రి మండలి తీర్మానించింది.

*చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి