ఆంధ్రప్రదేశ్‌

అరాచకాలకు పరాకాష్టగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, అక్టోబర్ 15: రాష్ట్రంలో పరిపాలన అరాచకాలకు పరాకాష్టగా మారిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, వీరితోపాటు సామాన్యులకు, పాత్రికేయులకు కూడా రక్షణ కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో ఓ దళిత కార్యకర్త చేత వైసీపీ ఎమ్మెల్యే కాళ్లు పట్టించుకున్నారని దీన్నిబట్టి వైసీపీ నేతల రౌడీయిజం ఏ స్థాయికి చేరిందో అర్ధమవుతుందని అన్నారు. గతంలో తమ ఇసుక పాలసీని విమర్శించిన వైసీపీ నేత నేడు ఎవరికీ ఇసుక దక్కకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే మాఫియాకు ప్రోత్సాహం అందిస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మట్టిని ఇంటి నిర్మాణానికి తరలించేందుకు స్థానిక వైసీపీ నేతల అనుమతి అవసరమా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్‌పై తమకు ఎటువంటి సమాచారం లేదని స్వయాన కేంద్ర మంత్రులే చెపుతున్నారని, అసలు కేంద్ర ప్రాజెక్టు అయిన పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారు లేకుండాపోయారని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అవి నవరత్నాలు కాదు నవగ్రహాలు అని దుమ్మెత్తిపోశారు. రైతులకు సున్నా వడ్డీ పథకం జగన్మోహన్‌రెడ్డి కొత్తగా తెచ్చింది ఏమీ కాదని, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ పథకానికి సంబంధించి రైతులకు అందాల్సిన బకాయిలను తాము అధికారంలోకి వచ్చిన తరువాత చెల్లించామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్‌స్టాల్‌మెంట్ గవర్నమెంట్ నడుస్తోందని ప్రతి పథకం ద్వారా లబ్ధిదారులకు అందే సహాయాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నిటికి తోడు రాష్ట్రంలో జగన్ టాక్స్, స్థానిక నేతల లోకల్ టాక్స్‌లు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ఐదు నెలల కాలంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, వారే స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే పుట్టిందని వారి కోసం పోరాడుతుందని ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ, మాజీ రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... నెల్లూరులో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు