ఆంధ్రప్రదేశ్‌

వైభవంగా సిరిమాను సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: వేద మంత్రాలు.. మంగళవాద్యాలు.. సంప్రదాయాల నడుమ శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల హృదయాలు భక్తి పారవశ్యంలో ఉప్పొంగాయి. మధ్యాహ్నం 3 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం కావాల్సి ఉండగా 3.55 గంటలకు ప్రారంభించారు. సిరిమాను రథానికి విశేష పూజలు జరిపిన అనంతరం అమ్మవారి ప్రతి రూపంగా ఉన్న పూజారి బంటుపల్లి వెంకట్రావు సిరిమాను రథాన్ని అధిరోహించారు. భక్తుల జేజేల నడుమ ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. జాలరి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం సంప్రదాయబద్ధంగా కదలగా ఆపై అమ్మవారి ప్రతి రూపంగా సిరిమాను రథం కదిలింది. పూర్వం పట్ట్భాషిక్తుడైన ఆనందగజపతిరాజు పతివాడ అప్పలనాయుడుకిచ్చిన తలపాగా, తురాయిని ప్రధాన పూజారి బంటుపల్లి వెంకట్రావు ధరించి మధ్యాహ్నం 12 గంటలకు ఆలయానికి వచ్చారు. హుకుంపేటలోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఆలయ పూజారికి
దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. ముత్తయిదువులు పసుపు, కుంకుమలతో ఆయన పాదాలను అభిషేకించి, కుంకుమార్చనలు చేశారు. ఆలయానికి వచ్చిన పూజారి వెంకట్రావు అమ్మవారికి అర్చన చేసి 50 అడుగుల నిడివి గల సిరిమాను శిఖరాన్ని అధిరోహించారు. లక్షలాది మంది భక్తుల ‘జై పైడిమాంబ’ అంటూ నినాదాలు చేయగా సిరిమాను రథం నెమ్మదిగా ముందుకు కదిలింది. అమ్మవారి సిరిమాను రథం తన పుట్టినిల్లయిన కోటను మూడుసార్లు దర్శించి ప్రధాన ఆలయానికి చేరింది. పూజారి భక్తులపై అక్షింతలు జల్లి ఆశీర్వదించారు.
జాలరి వల, పాలధార, అంజలి రథం
సిరిమాను ఉత్సవంలో బెస్తవాలకు తొలి ప్రాధాన్యం దక్కింది. అలనాడు పెద్ద చెరువులో అమ్మవారి విగ్రహాన్ని వెలికితీయడంలో సహకరించిన జాలరులకు అమ్మవారి సిరిమాను ఉత్సవంలో అగ్రభాగాన నిలిచారు. అలాగే ఒకప్పుడు చరిత్రాత్మక కోట వెనుక ఉన్న ఆటవికులకు అమ్మవారి పట్ల వారి భక్తి భావాలను ప్రతిబింబించే రీతిలో పాలధారలో ఆటవిక వేషధారులు జై అంటూ ముందుకు కదిలారు. పూసపాటి వంశీయులు గజారోహణతో పాల్గొన్న ఘట్టాన్ని చాటుతూ తెల్ల ఏనుగు ప్రతి రూపం, ఐదుగురు ముత్తయిదువులు అమ్మవారికి అంజలి ఘటించగా అంజలి రథం ఉత్సవం ముందుకు కదిలాయి. దారి పొడవునా లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాలు నింగిని తాకుతుంటే సిరిమాను మూడుసార్లు కోటను దర్శించి ఆలయానికి చేరింది. కన్నుల పండువగా సాగిన సంబరం సాయంత్రం 5.15 గంటలకు విజయవంతంగా ముగిసింది. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఎటువైపు చూసినా కిక్కిరిసిన జనం కన్పించారు.
పోటెత్తిన భక్తజనం
సిరిమానోత్సవాన్ని పూసపాటి వంశీయులు, మాన్సాస్ చైర్మన్, అశోక్‌గజపతిరాజు కుటుంబీకులు అదితి విజయలక్ష్మి కోట బురుజు నుంచి తిలకించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ ఝాన్సీలక్ష్మి, దేవాదాయశాఖ మంత్రి వి.శ్రీనివాస్, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డీసీసీబీ కార్యాలయం నుంచి ఉత్సవాన్ని తిలకించారు. వారితోపాటు టీడీపీ ప్రముఖులు, ఇతర ఉన్నతాధికారులు అమ్మవారిని కోట నుంచి దర్శించుకున్నారు. ఈ ఏడాది కూడా ఆంధ్ర, తెలంగాణా, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ఉత్సవం ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

*చిత్రాలు.. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని వీక్షిస్తున్న అశేష భక్తజనం
*అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వెళ్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ. చిత్రంలో కలెక్టర్ హరి జవహర్‌లాల్, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ