ఆంధ్రప్రదేశ్‌

త్వరలో రుణభారం నుంచి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలోని స్వయం సహాయ సంఘాల మహిళలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాన్ని నాలుగు దఫాలుగా నేరుగా మహిళా సంఘాలకు అందజేసి రుణభారం నుంచి విముక్తి కలిగిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్‌డీఏ పీడీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సెర్ఫ్ సీఈఓ రాజబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సోమవారం సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత ఏప్రిల్ 11 నాటికి పొదుపుసంఘాల బ్యాంకు రుణాల మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికి అందించడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుని నవరత్నాలలో చేర్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న 9 లక్షల 11వేల సంఘాల బ్యాంకు రుణాల మొత్తం 27,168 కోట్ల రూపాయలను నాలుగు దఫాలుగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించి 2023-24 నాటికి నేరుగా మహిళా సంఘాల చేతికి ఇస్తామన్నారు. రుణానికి సంబంధించిన వడ్డీ సుమారు 1,823 కోట్లను ప్రభుత్వమే బ్యాంకులకు ఈ సంవత్సరం చెల్లిస్తుందన్నారు. 5 లక్షల రూపాయల రుణం వరకు అయ్యే వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లిస్తోందన్నారు. వడ్డీగా చెల్లించాల్సిన 1823 కోట్లలో మొదటి ఐదు నెలల వడ్డీ 760 కోట్లను డిసెంబర్ నెలలో నేరుగా సంఘాల రుణఖాతాలకు జమచేస్తామన్నారు. దీనివల్ల సంఘాల చిన్నతరహా వ్యాపారాలు మరింత లాభదాయకంగా వడ్డీ భారం లేకుండా నడవడానికి, మెరుగైన జీవనం సాగించడానికి దోహదపడుతుందన్నారు. స్ర్తినిధి క్రింద మహిళలకు రెట్టింపు లబ్ధి చేకూరాలనే లక్ష్యంతో సంవత్సరానికి రూ. 900 కోట్ల టార్గెట్‌కు రూ. 1800 కోట్లకు పెంచామన్నారు. దీనిద్వారా ఆర్థిక తోడ్పాటు 50వేల నుండి లక్ష రూపాయలకు పెరుగుతుందన్నారు. డీఆర్‌డీఏ పీడీలు నెలలో పదిహేను రోజులు పాటు క్షేత్రస్థాయిలో పని చేయాలని, గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించిన పథకాల అమలును స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలను, ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే జనవరి నుంచి అర్హులైన లబ్ధిదారులందరికీ కొత్త పింఛన్లు అందిస్తామన్నారు. అందుకుగాను వలంటీర్లతో గ్రామ సచివాలయ సిబ్బంది సమన్వయం చేసుకుని పారదర్శకపాలన ఇవ్వాలన్నారు. గ్రామ వలంటీర్లు రాకతో భవిష్యత్తులో ఒక రోజులోనే పెన్షన్ అందించేందుకు వీలవుతుందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ నవరత్నాల పథకంపై డీఆర్‌డీఏ పీడీలు ప్రత్యేక దృష్టి సారించి అర్హులకు పథకాలు అందేలా పని చేయాలన్నారు. అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. పెన్షన్లు ప్రతినెల 1 నుండి 5వ తేదీలోపు 100 శాతం లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు. సెర్ప్ ద్వారా చేపడుతున్న పలు కార్యక్రమాలను సంస్థ సీఈవో రాజబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్‌డీఏ పీడీలు, ఏపీడీలు సెర్ప్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
*చిత్రం... 13 జిల్లాల డీఆర్‌డీఏ పీడీలతో సమీక్షిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి