ఆంధ్రప్రదేశ్‌

దుర్గమ్మ జలవిహారం నయనానందకరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా చివరిరోజైన మంగళవారం రాత్రి పవిత్ర కృష్ణానదిలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్లు గంగా సమేతంగా విహరించారు. ఇటీవలకాలంలో నదుల్లో జరుగుతున్న పడవ ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా వివిధ శాఖల అనుమతులతో అందునా హంస వాహనంపై కేవలం 32 మందిని మాత్రమే అనుమతించడం కాకుండా, ప్రతి ఒక్కరూ నిబంధనల మేర లైఫ్‌జాకెట్లు ధరించేలా నగర పోలీస్ కమిషనర్ ద్వారక తిరుమలరావు గట్టి చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం ఈవో ఎంవి సురేష్‌బాబు ఆధ్వర్యంలో హోమ్‌గుండంలో శాస్త్రోక్తంగా జరిగిన పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు ముగిసినట్లయింది. ఆశ్చర్యకరమేమిటంటే ఈ ముగింపు కార్యక్రమానికి ఉత్సవ కమిటీ సభ్యులు 42 మందిలో ఒక్కరు కూడా హాజరుకాలేదు. ఇక సాయంత్రం వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు మధ్య ఉత్సవమూర్తులను మల్లేశ్వరాలయం నుంచి పల్లకీలో మోసుకుంటూ ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. అప్పటికీ ప్రకాశం బ్యారేజీ నుంచి దుర్గాఘాట్ నుంచి పున్నమిఘాట్ వరకు భారీసంఖ్యలో భక్తులు బారులుదీరి వున్నారు. అసాధరణ బందోబస్తు మధ్య వేదపండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ఉత్సవమూర్తులను హంస వాహనంపై ఉంచారు. సుందరంగా విద్యుద్దీపాలతో అలంకరించిన హంస వాహనంపై స్వామివార్లు ముచ్చటగా మూడుసార్లు కృష్ణానదిలో జలవిహారం చేశారు. ఈ సందర్భంగా జయజయవో... మహిషాసురమర్దనీ... అంటూ భక్తులు చేసిన జయజయధ్వానులు కృష్ణాతరంగాల్లో మార్మోగాయి.
వైభవంగా పారువేట ఉత్సవం
జలవిహారం అనంతరం పోలీసుల ఆధ్వర్యంలో పారువేటోత్సవం ఘనంగా ప్రారంభమైంది. విజయదశమినాడు విజయవాడ వన్‌టౌన్ పోలీసులు దుర్గమ్మను పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. తెల్లదొరల పాలనలోనే అప్పటి పోల్‌ఠాన్‌దార్‌గా వ్యవహరించే అధికారి ఈ పూజలు నిర్వహించే వారు. ప్రస్తుత వన్‌టౌన్ సీఐ కాశీవిశ్వనాథం, ఆయన సతిమణి సహేరబేగం దంపతులకు మూడేళ్లు పాట్లు వరుసగా ఈ అదృష్టం వరించింది. తెప్పోత్సవం అనంతరం సింహవాహనంపై ఊరేగింపుగా శమీపూజ జరిగే బ్రాహ్మణవీధిలో మల్లిఖార్జునస్వామి మెట్ల మార్గంలోని జమ్మిదొడ్డి ప్రాంతానికి అమ్మవారిని తీసుకువచ్చారు. పోలీసులు జమ్మికొమ్మకొట్టిన తర్వాత పోలీస్‌స్టేషన్ మీదుగా ఊరేగింపుతో తెల్లవారుజామున తిరిగి ఇంద్రకీలాద్రిపైకి తీసుకెళ్లారు. దీంతో దసరా మహోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.