ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు పంచాయతీపై సీఎం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 9: నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిపై వెంకటాచలం ఎంపీడీఒ సరళ పోలీసులకు ఫిర్యాదు చేయటం, కేసు నమోదు సీఎంకు తలనొప్పిగా మారాయి. అదే సమయంలో అధికారులపై దాడికి పాల్పడిన ఏ పార్టీ నేతయినా చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించటం, ఆ వెనువెంటనే కోటంరెడ్డి అరెస్ట్‌తో నెల్లూరు వైసీపీ అంతర్గత పోరు రచ్చకెక్కింది. అరెస్ట్‌పై స్పందించిన కోటంరెడ్డి అంతటితో ఆగకుండా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థనరెడ్డిపై ఆరోపణలు చేయటం, కేసులపై అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో విబేధాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి పది మంది ఎమ్మెల్యేలు, ఎంపీతో క్లీన్ స్వీప్ చేశామని ఇందులో భాగంగానే రెండు మంత్రి పదవులు కట్టబెట్టామని ఈ పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డట్టు వినికిడి. ఇరువురు ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలియవచ్చింది. ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కాకాని బంధువులై ఉండి కూడా పార్టీ పరువు తీస్తున్నారని ఆగ్రహించినట్లు తెలిసింది. కోటంరెడ్డిపై ఎంపీడీఒ సరళ కేసు పెట్టటాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా తీసుకున్నాయని ఇప్పటికైనా సమన్వయంతో వ్యవహరించకపోతే ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌లను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలో వైవీ ఇంట నేతలు సమావేశమయ్యారు. అప్పటి వరకు కత్తులు దూసుకున్న కోటంరెడ్డి, గోవర్థనరెడ్డి తమ మధ్య విభేదాల్లేవని, తామిద్దరం బావా, బావమరుదులుగా చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ప్రభుత్వ మీడియా సలహాదారు సజ్జల మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన నెల్లూరు జిల్లాలో రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మాత్రమే సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. నెల్లూరు రాజకీయ వివాదాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమం కనుక ఎమ్మెల్యేలతో సమావేశమైనట్లు వివరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలని సమావేశంలో నేతలు కోరారన్నారు. అధికారి పెట్టిన కేసు అవాస్తవమని గతంలోనే తాను చెప్పానని ప్రభుత్వ అధికారి కనుక ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకున్నారని పునరుద్ఘాటించారు. అంతేకాదు కాకాని తనకు స్వయాన మేనత్తకొడుకని, రొట్టెల పండుగకు కూడా ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. మధ్యలో కొందరు తమమధ్య అగాధం సృష్టించేందుకు ప్రయత్నించారని, మండల నాయకుడు ప్రదీప్ రెడ్డి ఉన్నాడనే అనుమానాలను వ్యక్తం చేశామన్నారు. టీడీపీ నాయకుడు, మాజీమంత్రి నారాయణకు ఈ వ్యవహారంతో ప్రమేయం ఉందని కూడా ఆరోజే వివరించానని గుర్తుచేశారు. తాను తప్పు చేసినట్లు తేలితే చట్టం శిక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి ఇక అమరావతిలో ఉంటానని, నెలకు 25 రోజులు రాజధానిలో గడుపుతానని స్పష్టం చేశారు. మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీలో రాజకీయ అంతర్గత స్పర్థలేవీ లేవన్నారు. కాకాని గోవర్థనరెడ్డి మాట్లాడుతూ తనకు, కోటంరెడ్డికి ఎలాంటి గొడవలులేవని, తమ మధ్య విబేధాలు తామే పరిష్కరించుకోగలిగే సాన్నిహిత్యం ఉందన్నారు. కొందరు వివాదాలు రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో పార్టీకోసం అంతా కలిసి పని చేస్తామన్నారు. కోటంరెడ్డి స్వయాన తన బావమరిదని, చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులమని వివరణ ఇచ్చారు.