ఆంధ్రప్రదేశ్‌

శివప్రసాద్‌కు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 22: చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అగరాలలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా అగరాల గ్రామం కన్నీటిపర్యంతమైంది. ముందుగా తిరుపతి నుంచి శవయాత్ర అగరాల వరకు కొనసాగింది. అనంతరం సాంప్రదాయబద్ధంగా ఆయన అల్లుడు వాసు ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్ర అగరాలకు రాగానే కార్యకర్తలు, అభిమానులు, నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. ఒక్కసారిగా శివప్రసాద్ అమర్‌హై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు శివప్రసాద్ పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. అగరాలలో జరిగిన అంత్యక్రియ ఏర్పాట్లను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా భారీసంఖ్యలో అభిమానులు, పార్టీనేతలు తరలివచ్చి శివప్రసాద్‌కు నివాళులర్పించారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని స్వయంగా పాడె మోసి మాజీ ఎంపీతో ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటుకున్నారు. మాజీమంత్రులు అమరనాథరెడ్డి, పరసా రత్నం, ఎమ్మెల్సీ దొరబాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు, శివప్రసాద్ అభిమానులు హాజరయ్యారు. మాజీ ఎంపీ శివప్రసాద్ మరణంతో తాము ఒక పోరాటయోధుడిని కోల్పోయామని మాజీమంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలనే డిమాండ్‌తో పార్లమెంట్‌లో వినూత్నరీతిలో కార్యక్రమాలు నిర్వహించి తెలుగుగళాన్ని పార్లమెంటులో వినిపించిన ఖ్యాతి ఆయనకే దక్కిందన్నారు.
అజాత శత్రువు శివప్రసాద్: చంద్రబాబు
తిరుపతి: మాజీ ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్ అజాత శత్రువు అని, రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్లాఘించారు. చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ శివప్రసాద్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆదివారం తన కుమారుడు లోకేష్‌తో కలిసి చంద్రబాబు నాయుడు విమానంలో మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన డాక్టర్ శివప్రసాద్ పార్థివ దేహాన్ని ఉంచిన తిరుపతి ఎన్జీఓ కాలనీలోని ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ భౌతికకాయానికి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ తదితరులు ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాను అన్నివిధాలా అండగా వుంటానని వారిని ఓదార్చారు. అనంతరం శివస్రాద్ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి చంద్రగిరి మండలంలోని ఐతేపల్లి గ్రామంలోని అగరాలకు ప్రత్యేక వాహనంలో తరలించారు. వాహనానికి ముందు చంద్రబాబు కేటీ రోడ్డు వరకు నడుచుకుంటూ వచ్చారు. అక్కడి నుండి ఆయన శివప్రసాద్ పార్థివ దేహం వున్న వాహనంతో కలిసి అగారాలకు చేరుకున్నారు. అంతకుమునుపు డాక్టర్ శివప్రసాద్ నివాసం వద్ద చంద్రబాబు నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ‘చిన్నప్పుడు నుంచి మంచి మిత్రుడు. కలిసి చదువుకున్నాం. ఆయన డాక్టర్ అయ్యాడు. నేను ఎకనామిక్స్‌లో పీజీ చేశాను. శివప్రసాద్ సినిమా ఇండస్ట్రీపైన ఎనలేని ప్రేమను పెంచుకుని యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, నటుడిగా, రచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి రావాలని నేను ఆయన్ను ఆహ్వానించాను. నాతో ఉన్న స్నేహం, నమ్మకంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారన్నారు. శివప్రసాద్ మంచి రచయిత కావడంతో పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి, కార్యకర్తలను ఉత్తేజితులను చేయడానికి అనేక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారన్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా దేశం యావత్తు గుర్తించేలా రాష్ట్రం కోసం ఎనలేని పోరాటం చేశారన్నారు. ఆయన ఒక నటుడు, రచయిత కాబట్టి అనేక విధాలా ప్రజల సమస్యలను పార్లమెంటు దృష్టికి, దేశం దృష్టికి తీసుకువెళ్లడానికి తనవంతు కర్తవ్యం నిర్వర్తించారన్నారు.
*చిత్రం...శివప్రసాద్ భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు