ఆంధ్రప్రదేశ్‌

నాబార్డ్ రుణాలు సద్వినియోగం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో నాబార్డ్ సహకారంతో ప్రతిపాదించిన పథకాలు, ప్రాజెక్ట్‌లు డిసెంబర్‌లోగా పనులు ప్రారంభించి రుణాలను సద్వినియోగం చేసుకునేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు చొరవ చూపాలని బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ సెల్వరాజ్ సూచించారు. బుధవారం సచివాలయం 5వ భవనంలో నాబార్డ్ రాష్ట్ర ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఆర్‌ఐడీఎఫ్ (రూరల్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఫండ్)కు సంబంధించి సెన్సిటైజేషన్, ప్లానింగ్‌పై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సెల్వరాజ్ మాట్లాడుతూ నాబార్డ్ సాయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో నాబార్డ్ ద్వారా రూ. 10,250 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. కేవలం 4.15 శాతం వడ్డీకే తమ బ్యాంక్ రుణాలను అందిస్తోందన్నారు. ఇప్పటి వరకు 69వేల కోట్ల ప్రాజెక్ట్‌లను మంజూరు చేశామని వివరించారు. ఆర్థిక సాయం కింద ప్రతిపాదించిన ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనలను సకాలంలో నాబార్డ్‌కు సమర్పించి డిసెంబర్‌లోగా వాటిని గ్రౌండింగ్ చేయాలని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రూ. 2వేల కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో గత ఆరు నెలల్లో నాబార్డ్ రుణ సహాయంతో మంజూరు చేసిన వివిధ ప్రాజెక్ట్‌లు, పథకాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మరో రూ. 4వేల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావచ్చని అంచనా వేస్తున్నామని వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. దీర్ఘకాలిక జలవనరుల నిధి కింద పోలవరం ప్రాజెక్ట్‌కు రూ. 6,381 కోట్ల రుణం మంజూరు చేయగా ఇప్పటికే రూ. 5,813 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. గోదాముల వౌలిక సదుపాయాల నిధి కింద ఏపీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కూడిన 45 గ్రామీణ గిడ్డంగుల నిర్మాణానికి ప్రతిపాదించగా రూ.228 కోట్ల రుణానికి గాను ఇప్పటికే 87 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు.
నాబార్డ్ జనరల్ మేనేజర్ బెహ్రా మాట్లాడుతూ 2017-18 కేంద్ర బడ్జెట్‌లో డెయిరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (డీఐడీఈ) పథకాన్ని ప్రకటించిందని దీని ద్వారా పాల ఉత్పత్తికి సంబంధించిన వౌలిక సదుపాయాల అభివృద్ధికి సహాయం అందిస్తామన్నారు. ఇందు కోసం నాబార్డ్ వద్ద రూ. 10,881 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని ఇప్పటికే రూ. 2,485 కోట్లు మంజూరు చేశామన్నారు. 2018-19 బడ్జెట్‌లో మత్స్యరంగానికి సంబంధించి వౌలిక సదుపాయాల ఆధునీకరణకు ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్‌ఐడీఈ), ప్రవేశపెట్టారని దీని ద్వారా మెరైన్ ఆక్వాకల్చర్ వౌలిక సదుపాయాలను కల్పించటం, పోస్ట్ హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించడం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తోడ్పాటునిస్తామని ప్రకటించారు. దీనికి నాబార్డ్ వద్ద రూ. 7,522 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర సహకారశాఖ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ నాబార్డ్ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు సకాలంలో పంపాలన్నారు. ఆయా ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో జాప్యం లేకుండా ఉండేందుకు ముందుగా భూమి గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదాముల నిర్మాణానికి త్వరితగతిన నిర్మాణం అందించాలని కోరారు.
స్ర్తి, శిశు సంక్షేమశాఖ కమిషనర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఆర్‌ఐడీఎఫ్-24 కింద 723 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు మంజూరయ్యాయని వాటికి సకాలంలో నిధులు మంజూరు చేయాలన్నారు. అంతకు ముందు నాబార్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కళ్యాణ సుందరం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఏయే ప్రాజెక్ట్‌లు, పథకాలకు రుణాలు అందిస్తున్నదీ వివరించారు. నాబార్డ్ ద్వారా 37 రకాల సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, సాగునీటి ప్రాజెక్ట్‌లు, తాగునీరు, విద్య, వైద్యం, కనెక్టివిటీ, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, ఇతర వౌలిక సదుపాయాల రంగాల్లో పెద్దఎత్తున సహాయం అందిస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక అంశాలకు సంబంధించి 10 ప్రామాణికాలను నాబార్డ్ ప్రకటించిందన్నారు. బ్యాంక్ సహాయంతో మంజూరైన ప్రాజెక్ట్‌లను 12 నెలల్లోగా గ్రౌండింగ్ చేసే విధంగా నిరంతరం సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యశాలలో మరో సీజీఎం కెఎస్ రఘుపతి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.