ఆంధ్రప్రదేశ్‌

ఆశలు ఆవిరై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 17: ‘నిన్నటి దాకా ఎక్కడో ఒకచోట తమవారు క్షేమంగా ఉంటారనే చిన్ని ఆశ... రోజులు గడిచేకొద్దీ ఆ ఆశ ఆవిరై, కనీసం తమ వారి మృతదేహం దొరికితే చాలు, కడసారి చూపు దక్కుతుందనే ఆక్రోశం’ ఇదీ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద ఆదివారం గోదావరిలో బోల్తాపడిన టూరిజం బోటు ప్రయాణీకుల రక్తసంబంధీకుల మానసిక స్థితి. తమవారి ఆచూకీ కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు పడిగాపులు పడుతున్నారు. ఏ నేత వచ్చినా, మరే అధికారి వచ్చినా తమ వారి ఆచూకీ తెలపాలంటూ కన్నీటితో వేడుకుంటున్నారు. ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలు ఎక్కడ గుర్తించినా, అంబులెన్సుల్లో పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. దీనితో ప్రభుత్వాసుపత్రికి ఏ అంబులెన్సు వచ్చినా గల్లంతైన వారి బంధువులంతా ఒక్కసారిగా తమ వారేమోనని గుండెలు చిక్కపట్టుకుని ఆతృతగా వాహనం వద్దకు చేరుకుంటున్నారు. ఆస్పత్రి వద్దకు అంబులెన్స్‌లో వచ్చిన మృతదేహాల ఆనవాళ్లు మైకులో చెబుతుంటే గుర్తుపట్టిన బంధువులు ఒక్కసారిగా గొల్లుమంటుండటంతో పరిస్థితి హృదయ విదారకంగా వుంది. ఒకపక్క తమ వారిని కోల్పోయిన బాధ, మరోపక్క మృతదేహాన్ని గుర్తుపట్టడానికి తేరిపారచూడాల్సి రావడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. మొత్తంగా మంగళవారం ఒక్క రోజే 19 మృతదేహాలను గుర్తించి, వెలికితీశారు. ఆదివారం నుండి నీటిలోనే నానుతున్న
నేపథ్యంలో లభించిన మృతదేహాలన్నీ ఉబ్బిపోయి, గుర్తుపట్టలేనంతగా పాడయ్యాయి. దుర్గంధభూయిష్టమైన మృతదేహాలను సొంతవారే గుర్తించలేకపోతున్నారు. మృతుల జేబుల్లో లభ్యమవుతున్న ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపుకార్డు తదితరాల ఆధారంగా గుర్తిస్తున్నారు. కొంత మంది బంధువులు మృతదేహాలపై ఉన్న దుస్తుల ఆధారంగా గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో శవపంచనామా పూర్తయ్యి, పోస్టుమార్టం చేయడానికి చాలా సమయం పడుతోంది. దీనికితోడు కాకినాడ నుండి ప్రత్యేక వైద్యులు రాకపోవడంతో స్థానిక వైద్యులే మొత్తం ప్రక్రియ పూర్తిచేయాల్సివచ్చింది. మరోవైపు ఫోరెన్సిక్ నిపుణులు సరిపడా అందుబాటులో లేకపోవడం కూడా జాప్యానికి కారణమయ్యింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన ఆలయ కార్యనిర్వహణాధికారి వలవల రఘురామ్ మృతదేహం ఆదివారమే లభించినప్పటికీ, ఎవరూ గుర్తించకపోవడంతో మంగళవారం వరకూ పోస్టుమార్టం పూర్తి కాలేదు. ఎట్టకేలకు మంగళవారం గుర్తించి, పంచనామా పూర్తిచేసి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. రఘురామ్‌తో పాటు మరో ముగ్గురు బోటులో ప్రయాణించగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరిలో గన్నాబత్తుల ఫణికుమార్ మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద లభించింది. మరొకరి ఆచూకీ తెలియాల్సివుంది. తెలంగాణలోని శేరిలింగంపల్లికి చెందిన సాయికుమార్ అనే యువకుడిని ఆధార్ కార్డు ద్వారా గుర్తుపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొత్తపట్టిసం వద్ద సాయికుమార్ మృతదేహం లభించింది.
*చిత్రం... ప్రమాద స్థలంలో గాలింపు జరుపుతున్న హెలికాఫ్టర్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది