ఆంధ్రప్రదేశ్‌

నిలకడగా గోదావరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12: గత కొద్ది రోజులుగా వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కిన గోదావరి నది ప్రస్తుతం నిలకడగావుంది. గోదావరి నదికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఆగస్టు, సెప్టెంబర్‌లో నాలుగు సార్లు రెండవ ప్రమాద హెచ్చరిక జారీఅయింది. దీంతో ఆగస్టు 3, 4, 7 తేదీల్లో ప్రమాద హెచ్చరికలు జారీకాగా, సెప్టెంబర్‌లో ఒకసారి రెండో ప్రమాద హెచ్చరిక జారీఅయ్యింది. ఆగస్టులో ధవళేశ్వరం బ్యారేజి వద్ద అత్యధికంగా 165.6 అడుగులు నమోదు కాగా 15.61 లక్షల 404 క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి మళ్ళాయి. సెప్టెంబర్‌లో అత్యధికంగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద 15.20 అడుగుల స్థాయికి రావడంతో ఆ సమయంలో 15.23 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి మళ్ళాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి పరిశీలిస్తే జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 2461 టీఎంసీల జలాలు సముద్రంలోకి పోయాయి. 94.184 టీఎంసీలు డెల్టా పంటలకు వినియోగించారు. పట్టిసీమ నుండి 31.21 టీఎంసీల నీటిని తోడారు.
ప్రస్తుతం గోదావరి వరద ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు భద్రాచలం వద్ద 35.20 అడుగుల మట్టంలో ప్రవహిస్తుంటే, దిగువ ధవళేశ్వరం వద్ద మట్టం 8 అడుగుల స్థాయిలో నిలకడగా ప్రవహిస్తోంది. బ్యారేజి గేట్లను పూర్తిగా ఎత్తడంతో 5.91 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి మళ్ళాయి. బ్యారేజి దిగువ ప్రాంతంలోని నదీ పాయల మధ్య కోనసీమ ప్రాంతంలో ప్రవాహ వేగం తగ్గుముఖం పట్టింది. దీంతో గ్రామాలు ఇపుడిపుడే తెప్పరిల్లుతున్నాయి. గ్రామాల మధ్య దారులు కన్పిస్తున్నాయి. ఉద్యాన పంటలు, కోతకు గురైన కొబ్బరి తోటల నష్టాలు ఇపుడిపుడే భయట పడుతున్నాయి. గత వారం రోజులుగా ఇళ్ళన్నీ నాని ఉండటంతో పాక్షికంగా నష్టం వాటిల్లవచ్చని అంచనావేశారు. పొలాల నుంచి నీరు వేగంగా తొలగిపోతుండటంతో ముంపునకు గురైన పొలాలు కన్పిస్తున్నాయి. రోడ్లన్నీ చిధ్రమయ్యాయి. మంచినీటి పధకాలకు నష్టం వాటిల్లింది. లంక ప్రాంతాల్లో ఇళ్ళు మట్టికొట్టుకుపోయాయి. ఇంకా శివారు ప్రాంతాలు జల దిగ్భంధంలోనే వున్నాయి.
అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతాల్లోని కూనవరం, వర రామచంద్రపురం, ఎటపాక, దేవీపట్నం, చింతూరు మండలాల్లో గ్రామాల మధ్య రహదారులు ఇపుడిపుడే కన్పిస్తున్నాయి. దేవీపట్నం మండలంలోనూ, వర రామచంద్రపురంలోనూ ఇళ్ళు మట్టికొట్టుకు పోయాయి. నష్టం అంచనాలను విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాథమికంగా అంచనావేసింది.
వరద ప్రభావిత గ్రామాల్లో పూర్తి స్థాయి నష్టం అంచనాలు రూపొందించాల్సివుంది. ముంపు ప్రాంతాల్లో ముందుగానే ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఇదిలా వుండగా ఎగువ ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కాళేశ్వరం వద్ద 8.94 మీటర్లు, పేరూరు వద్ద 10.73, దుమ్ముగూడెం వద్ద 10.33, కూనవరం వద్ద 13.88, కుంట వద్ద 8.14, కొయిదా వద్ద 18.67, పోలవరం వద్ద 11.38, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.21 మీటర్ల మట్టంలో ప్రవహిస్తోంది.