ఆంధ్రప్రదేశ్‌

రాజధానికి సింగపూర్ దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సింగపూర్ కన్సార్టియంలు దూరం కానున్నాయి. గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకునే విషయమై ఏపీ ప్రభుత్వానికి సంకేతాలు అందుతున్నాయి. రాజధానికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పన చేసినప్పటి నుంచి సింగపూర్ సంస్థలు 1691 ఎకరాల స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వంతో అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఆ ప్రాంతంలో వౌలిక సదుపాయాల కల్పనకు రూ. 5 వేల కోట్లు కేటాయించింది. అయితే ప్రస్తుత ఏపీ ప్రభుత్వం రాజధాని పనులు నిలిపి వేయడంతో గత మూడు నెలలుగా సింగపూర్ కన్సార్టియంలు.. ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరాన్ని నిర్మించేందుకు సింగపూర్ సంస్థలు మాస్టర్‌ప్లాన్‌ను ఉచితంగా రూపొందించాయి. రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఎ) పరిధిని నిర్దేశించి ముసాయిదా ప్రణాళికను కూడా రూపొందించాయి. దాదాపు 8,323 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగింది. అయితే ముసాయిదాలో వ్యవసాయక జోన్ పరిధిలో కొన్ని గ్రామాలను చేర్చడంతో అప్పట్లో ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ముందుగా ప్రపంచ స్థాయి నగర నిర్మాణంపైనే తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి సారించింది. స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కు చెందిన సెంబ్‌కార్ప్, అసెండాస్, సింగ్‌బ్రిడ్జ్
సంస్థలు ముందుకొచ్చాయి. అభివృద్ధి అనంతరం 49 శాతం ప్రభుత్వానికి, 51 శాతం సింగపూర్ సంస్థలకు వాటాలుగా నిర్ణయించాయి. దీనిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణంలో పూర్తిస్థాయి అవినీతి జరిగిందని, విచారణకు నిపుణుల కమిటీని కూడా నియమించింది. మొత్తంగా రాజధాని మీద సమీక్ష జరిపి ఇతర ప్రాంతాలకు కూడా కొన్ని కార్యాలయాలు తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. సమీక్ష చేసుకునే అధికారం ఏపీ ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఆ ప్రభావం తమ దేశపు సంస్థలపై ఏ విధంగా ఉంటుందోనన్న సందేహాన్ని సింగపూర్ మంత్రి బాలకృష్ణన్ వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణాలు నిలిచిపోయిన నేపథ్యంలో తాము ఏ విధంగా ముందుకు వెళ్తున్నదీ సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేయకపోయినా గత మూడు నెలలుగా సింగపూర్ కన్సార్టియంలు అమరావతిపై ఆసక్తి చూపడం లేదు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు బ్యాంక్ గ్యారెంటీ లేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా సింగపూర్ సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేస్తారా, కొనసాగిస్తారా అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లో పర్యటిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి రాజధానిపై సింగపూర్ ప్రభుత్వంతో సమీక్షలు నిర్వహించి మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ రాజధానిపై ఫోకస్ పెంచింది. సింగపూర్‌తో భవిష్యత్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయనేది మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి పర్యటన అనంతరం కొలిక్కి వచ్చే అవకాశముంది. రాజధాని నగర నిర్మాణంలో భాగంగా ప్రతిపాదిత గ్రామాలతో పాటు మంగళగిరి ప్రాంతానికి కూడా నిర్మాణాలను విస్తరింపజేయాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆలోచనగా తెలుస్తోంది. పాలనా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే హైకోర్టు, హెచ్‌ఓడీ కార్యాలయాలు, ఐటీ సంస్థలను ప్రాంతాలవారీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో రాజధాని నిర్మాణాలకు సంబంధించి స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.