ఆంధ్రప్రదేశ్‌

మాజీ స్పీకర్ వ్యవహారం దురదృష్టకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 23: ఒక సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, ఎంతో పేరు ప్రఖ్యాతులున్న మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆ విధంగా వ్యవహరించడం జీర్ణించుకోలేకపోతున్నామని, ఇది చాలా దురదృష్టకరమని శాసన సభా ఉప సభాపతి కోన రఘుపతి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఒక సభాపతిగా, ఒక రోల్‌మోడల్‌గా ఉండాల్సిన వ్యక్తి ప్రజల ఆస్తి అయిన శాసనసభ ఫర్నిచర్ విషయంలో ఎందుకలా చేశారో అర్ధం కావడం లేదన్నారు. ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి, అన్నీ తెలిసిన వ్యక్తే ఈవిధంగా ప్రవర్తిస్తే ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరమన్నారు. సభలో ఉన్నది ఎవరైనా సభా సంప్రదాయాలు అనుసరించాలని, గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని, కొన్ని మంచి సంప్రదాయాలను అనుసరించి సభను నిర్వహిస్తున్నామని డిప్యూటీ స్పీకర్ రఘుపతి అన్నారు. సభలో సభ్యుల నిష్పత్తిని బట్టి సమయం కేటాయించడం జరుగుతుందని, దాన్ని సభ్యులు ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటారనేదే ప్రధానమన్నారు. సభ్యులు తాము చెప్పదలచుకున్న పాయింట్‌ను ఎంత త్వరగా సభలో విశే్లషించగలరనేదే ముఖ్యమన్నారు.
సుదీర్ఘమైన ఉపన్యాసాలకు తెరతీస్తూ, అనవసరమైన వాదోపవాదాలకు దిగుతూ, ఉపోద్ఘాతాలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ, వాళ్ళకిచ్చిన సమయాన్ని వృథా చేస్తున్న క్రమంలోనే కొన్నిసందర్భాల్లో కఠినంగా ఉండాల్సివస్తోందన్నారు. అంతమాత్రాన ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నామనే మాట సరికాదు అన్నారు. సభ్యుడు తాను చెప్పదలచుకున్న విషయానికి తనను తాను పరిమితం చేసుకుంటే ఎపుడైనా సరైన సమయం లభిస్తుందన్నారు. ఉప సభాపతి బ్రాహ్మణ సమాజానికి దక్కిన గౌరవమన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజల ఆశలకు అనుగుణంగా సభలో నిర్ణయాలు తీసుకుంటున్నారని, జగన్ పాలన సాగిస్తున్న ఈ సభలో ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. తన తండ్రి సభాపతిగా చేసిన సభలో తనకు కూడా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నారు. రాష్ట్రం అనేక సమస్యలతో ఉన్న దశలో ఒక యువ ముఖ్యమంత్రి తాను చెప్పిన మాటలకు కట్టుబడి, దీర్ఘకాలిక ప్రయోజనాల ఆలోచనతో చట్టాలను తీసుకురావడం చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగిస్తోందన్నారు. ఏపీ అభివృద్ధి పధంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఉప సభాపతి రఘుపతి అన్నారు. విలేఖర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీసీసీ ఛానల్ ఛైర్మన్ వి భాస్కర్రామ్, ఎండీ పంతం కొండలరావు, ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకొళపు శివరామసుబ్రహ్మణ్యం, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.