ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర రాజధానిపై బొత్స వ్యాఖ్యలతో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 20: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలక నేతల వ్యాఖ్యలు కలకలం రేకెత్తిస్తున్నాయి. కృష్ణానదికి వరదతో మాజీ సీఎం నివాసం ముంపునకు గురైన నేపథ్యంలో విశాఖలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణంపై మరోసారి విస్తృత చర్చ జరగాల్సి ఉందని పేర్కొనడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సుమారు 33 వేల ఎకరాల పంట భూములను రైతుల నుంచి సమీకరించి, రాజధాని నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే వందల కోట్ల వ్యయంతో తాత్కాలిక నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. కేంద్రం పూర్తిగా సహకరించనప్పటికీ బాండ్లు, ఇతరత్రా ఆర్థిక సంస్థల నుంచి నిధులు తీసుకుని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. ఈ అయిదేళ్ల కాలంలో కృష్ణా నదికి కనీస స్థాయిలో వరద రాకపోవడంతో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. తాజాగా మాజీ సీఎం ఇల్లు సైతం వరద నీట మునిగిపోయే పరిస్థితి తలెత్తడంతో దీనిపై చర్చకు ఆస్కారమేర్పడింది. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణానికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ విస్తృతంగా పర్యటించి, వివిధ కోణాల్లో పలు అంశాలను విశే్లషించింది. ప్రకాశం జిల్లా దొనకొండలో ప్రభుత్వ భూముల లభ్యత, భౌగోళిక పరిస్థితుల అనుకూలతపై ఒక అభిప్రాయానికి వచ్చింది. అయితే నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం గుంటూరు జిల్లా తుళ్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాంతంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33వేల ఎకరాల పచ్చటి పొలాలను సమీకరణ విధానంలో ప్రభుత్వం సేకరించింది. దీనిపై పలు స్వచ్ఛంధ సంస్థలు, గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. పలు అంశాలను పరిశీలించిన మీదట కొన్ని షరతులతో ఎన్‌జీటీ రాజధాని నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. అయితే కొండవీటి వాగు ముంపు విషయంలో కొన్ని సూచనలు చేసింది. రాజధాని నిర్మాణానికి అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ముందుకు సాగింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలకు ప్రతిపాదించింది. పెద్ద సంఖ్యలో బాండ్లను సేకరించింది. రాజధాని నిర్మాణానికి రూ.300 కోట్ల డాలర్ల ఆర్థిక సహకారం అందించేందుకు ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ వంటి సంస్థలు తొలుత సానుకూలంగా స్పందించినప్పటికీ ఇటీవల కాలంలో వెనక్కు తగ్గాయి. దీంతో రాజధాని నిర్మాణంపై పూర్తిగా నీలినీడలు అలముకున్నట్టే. తాజాగా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కీలక నేతలు అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అమరావతిలో రాజధాని నిర్మాణంపై విస్తృత చర్చ జరగాలని మంత్రి బొత్స చెపుతూనే, నిర్మాణ వ్యయం రెండింతలు పెరుగుతుందని చెప్పుకొచ్చారు. ముంపు ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు, ఇతర నీటి మళ్లింపు నిర్మాణాలకు అదనపు వ్యయం తప్పదన్న వాదన వినిపించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా రాజధానిపై కీలక సమీక్షలు జరుగుతున్నాయన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది వేచి చూడాల్సిందే.