ఆంధ్రప్రదేశ్‌

భయం గుప్పిట్లో లంక గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 16: కృష్ణానదీ పరివాహక లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల జలాశయాల నుంచి లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల కావటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని తీర గ్రామాలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నాయి. గుంటూరు జిల్లా రేపల్లె, భట్టిప్రోలు, కొల్లూరు, కొల్లిపర మండల గ్రామాలతో పాటు కృష్ణా జిల్లా తోట్లవల్లూరు, కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, ఉంగుటూరు, అవనిగడ్డ, నాగాయలంక, తదితర మండలాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2009లో పదిలక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరటంతో పాటు నాగార్జునసాగర్‌కు గండి పడటంతో రేపల్లె తదితర పట్టణాలు నీటమునిగాయి. ప్రస్తుతం శుక్రవారం సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో ఇన్‌ఫ్లోగా 8,06,145 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, ఔట్‌ఫ్లోగా 8,19,607 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 7లక్షల 13,982 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కాగా 7,13,972 ఔట్‌ఫ్లోగా వదులుతున్నారు. అక్కడి నుంచి పులిచింతల ప్రాజెక్ట్‌కు 7,97,502 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా చేరుతోంది. పులిచింతల నుంచి దిగువన ప్రకాశం బ్యారేజీకి 7,97,502 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 4.08 టీఎంసీలు కాగా 3.07 టీఎంసీల నీరు ప్రవహిస్తోంది. ఇన్‌ఫ్లోగా 7,57,005కాగా దిగువన సముద్రంలోకి 7,71,134 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం ఉదయానికి మరో రెండు లక్షల క్యూసెక్కుల నీరు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె, కృష్ణాజిల్లా నాగాయలంక, అవనిగడ్డ, పెడన తదితర సముద్ర తీర మండల గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. రేపల్లె- అవనిగడ్డ మధ్య పెనుమూడి రేవు వద్ద మత్స్యకారుల నివాసాలు జలదిగ్బంధంలో చిక్కుకోవటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కృష్ణా జిల్లా కనిగిరిలంక వద్ద వరద ఉధృతి జల ప్రళయాన్ని తలపిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలివచ్చేందుకు లోతట్టు గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారు. పది లక్షల క్యూసెక్కులు దాటితేకానీ తమకు ముప్పు ఉండదని అధికారులతో వాదిస్తున్నారు. దీంతో పునరావాస కేంద్రాలకు నిర్వాసితుల తరలింపు అధికారులకు కష్టతరంగా మారింది. గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేక బోట్లును గుంటూరు, కృష్ణా జిల్లాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 18 మండలాల్లో 24 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 12 మండలాల్లో 39 గ్రామాలను వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. కృష్ణా జిల్లాకు 84 అగ్నిమాపక దళాలు, గుంటూరు జిల్లాకు 28 దళాలను నియమించారు. లైఫ్ జాకెట్లు, ఐఆర్ బోట్లను సిద్ధం చేశారు. రెండు జిల్లాల్లో 180 ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు, గుంటూరు జిల్లాలో 10 ఎస్డీఆర్‌ఎఫ్ దళాలను వరద ప్రాంతాలకు తరలించారు. కృష్ణాజిల్లాలోని 41 పునరావాస కేంద్రాల్లో 8100 మంది ఆశ్రయం పొందుతున్నారు. గుంటూరు జిల్లాలో రెండువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజధాని ప్రాంతంలో ఉద్దండరాయనిపాలెం, తాళ్లాయపాలెం, వెంకటపాలెం, పెదలంక గ్రామాలు కూడా జలదిగ్బంధనలో చిక్కుకున్నాయి. మాచవరం మండలం రేగులగడ్డ, వెల్లంపల్లి, వేమవరం, గురజాల మండలం దైద, గొట్టిముక్కల, దాచేపల్లి మండలం రామాపురం, కాట్రపాడు, పొందుగల, తంగెడ గ్రామాలతో పాటు అచ్చంపేట మండలం మాదినపాడు, గింజపల్లి, తాడువాయి గ్రామాలు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో పాటు పులిచింతల ముంపు గ్రామాలు కావడంతో తెలంగాణ అధికారుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.