ఆంధ్రప్రదేశ్‌

ఎంత దోచారో చెబుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 19: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు శాసనసభను తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో అడుగడుగునా అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. అయితే వీటిల్లో తన ప్రమేయం లేదనిపించుకునేందుకే చంద్రబాబు దుర్బుద్ధితో సభను అడ్డుకుంటున్నారన్నారు. పోలవరంలో ఎంత దోచారో మరో 15 రోజుల్లో బయట పెడతాం.. ఆపై ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మద్దాళి గిరి పోలవరం ప్రాజెక్టు... అంశంపై అడిగిన ప్రశ్న మొదటగా చర్చకు వచ్చింది. దీనిపై ఎప్పటిలాగానే రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. అయితే ఆ సమాధానం తనకు సంతృప్తికరంగా లేదంటూ బుచ్చయ్యచౌదరి మాట్లాడటం ప్రారంభించారు. అయితే మంత్రి సమాధానం తర్వాత అవకాశం లేదంటూ స్పీకర్ రెండో ప్రశ్నను చేపట్టారు. దీంతో చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులందరూ మూకుమ్మడిగా లేచి స్పీకర్‌ను విమర్శిస్తూ నినాదలివ్వటం ప్రారంభించారు. దీనికి ప్రతిగా అధికారపక్ష సభ్యులు ప్రత్యారోపణలు, ప్రతి విమర్శలు చేయటంతో అసెంబ్లీ రసాభాసగా మారింది. పోలవరంపై సమాధానం చెప్పలేక పారిపోతున్న ప్రభుత్వం.. ఏపీ నీళ్లను తెలంగాణకు తరలిస్తున్న ప్రభుత్వం... స్పీకర్ మొండివైఖరి నశించాలి... స్పీకర్ వైఖరి మారాలి... అంటూ టీడీపీ సభ్యులు నినాదాలివ్వగా, అధికారపక్ష సభ్యులు దీనికి ప్రతిగా పోలవరం దొంగ చంద్రబాబు అంటూ పెద్దపెట్టున నినదించారు. అయితే స్పీకర్ అధికారపక్ష సభ్యులను అదుపులో పెట్టి మొత్తం పది ప్రశ్నలు చర్చకు తెచ్చారు. మొత్తంపై గంటన్నరలో ప్రశ్నోత్తరాలు ముగిసి ఆపై జీరో అవర్ కూడా జరిగింది. టీడీపీ సభ్యులు మాత్రం రెండుగంటల పాటు సభ వాయిదా పడే వరకు నిలబడి నినాదాలిస్తూనే తమ నిరసన కొనసాగించారు. ఈ దశలో సీఎం జగన్ మాట్లాడుతూ ‘పోలవరంపై ఇంతటి రాద్ధాంతం ఎందుకో అర్థం కావటం లేదు... గత మూడు రోజులుగా మంత్రి వివరణ ఇస్తూనే ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించిన తీరుపై నిపుణుల కమిటీ వేసాం... తాను కూడా ప్రాజెక్ట్‌ను సందర్శించి అన్నింటినీ గమనించానని అన్నారు. చంద్రబాబు నిర్వాకం వలనే ప్రస్తుతం పనులకు అంతరాయం కల్గింది... నవంబర్ నుంచి ప్రారంభించి 2021లో నీళ్లు ఇస్తామన్నారు. తొలుత స్పిల్‌వే పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌పై శ్రద్ధ పెట్టారని, అయితే దాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. దీనివల్ల గోదావరి వెడల్పు 70శాతం తగ్గిపోయి మిగిలిన కొద్ది భాగం నుంచే వరద నీరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అక్టోబర్ వరకు వరద ఉంటే ఇక పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. సబ్ కాంట్రాక్టర్ల ముసుగులో తమకు నచ్చిన వారికి అంచనాలు పెంచి పనులు కట్టబెట్టారన్నారు. వీరిలో నాటి మంత్రి యనమల వియ్యంకుడు కూడా ఉన్నారన్నారు. ఏ పనులు కాకుండానే నవయుగ కంపెనీకి రూ.724 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చారని, అందుకే రివర్స్ టెండరింగ్‌కు వెళ్తున్నామన్నారు. పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యామ్‌పై శ్రద్ధ పెట్టి, దానిని కూడా పూర్తి చేయలేదన్నారు. టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 38 ఏళ్లలో 7.2 శాతం మాత్రమే పనులు పూర్తయితే గత ఐదేళ్లలో 71శాతం పనులు పూర్తయ్యాయని, అయితే దీనిపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలు గత ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అవినీతిపరుడికి అంతా అవినీతిలాగానే కనపడుతుందన్నారు. రివర్స్ టెండరింగ్‌ను స్వాగతిస్తున్నాం.. ప్రాజెక్టు ఖర్చును ఎంత తగ్గిస్తారో చూస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను తామే పూర్తి చేసి సీఎం జగన్‌చే ప్రారంభింపచేస్తామని మంత్రి అనిల్‌కుమార్ బదులిచ్చారు.
స్పీకర్‌ను కల్సిన టీడీపీ సభ్యులు
సభ వాయిదా అనంతరం టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన ఛాంబర్‌లో కలిసారు. ప్రతిపక్షానికి కూడా సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. వైకాపా సభ్యుల మాదిరిగా తమపార్టీకి కూడా మాట్లాడే అవకాశం కల్పించాలన్నారు. పోలవరం విషయంలోనే వాకౌట్ చేద్దామనే విషయం చెబుదామన్నా అవకాశం ఇవ్వలేదన్నారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. సోమ, మంగళవారాల్లో అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌కు పోలవరంపై చర్చకు అవకాశమిస్తామన్నారు.