ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. ఈ మేరకు శనివారం రాజభవన్ అధికారులు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ గ్రౌండ్‌లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులకు గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ ఆదేశించారు. కాగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో వైకాపా 175 అసెంబ్లీ స్థానాల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధించిందన్న విషయాన్ని అధికారిక నివేదికను వైఎస్ జగన్ గవర్నర్‌కు అందచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బృందం గవర్నర్‌కు వినతిపత్రం అందించింది. ఆ వెంటనే జగన్మోహనరెడ్డిని గవర్నర్ నరసింహన్ అభినందించారు. గవర్నర్‌తో జగన్మోహన్‌రెడ్డి ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. వైఎస్ జగన్ తన సతీమణి భారతితో పాటు పార్టీ సీనియర్ నేతల్ని గవర్నర్‌కు పరిచయం చేశారు. గవర్నర్ కూడా రాజ్‌భవన్ అధికారులను జగన్‌కు పరిచయం చేశారు. అంతకుముందు శనివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ గన్నవరం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ హైదరాబాద్‌కు రానున్న సందర్భంగా ఆయన అభిమానులు భారీఎత్తున నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతిభవన్ వరకు హోర్డింగులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో జగన్ దిగినప్పటి నుంచి ఆయన అభిమానులు భారీగా జగన్ కాన్వాయ్ వెంట వాహనాల్లో తరలివచ్చారు. సీఎం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. గవర్నర్ బంగ్లా వద్దకు జగన్ అభిమానులు వేలాదిగా తరలిరావడంతో రాజ్‌భవన్ రహదారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. జగన్‌కు జడ్‌ప్లస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. జగన్ కాన్వాయ్‌కి రహదారి పొడవునా తెలంగాణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జగన్ వెంట పార్టీ సీనియర్ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్ ఉన్నారు.