ఆంధ్రప్రదేశ్‌

అండగా ఉండండి ... మీకు మద్దతుగా నేనుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: గతంలో ఏమీ ఆశించకుండా టీడీపీకి తాము మద్దతు ఇచ్చామని, ఇప్పుడు ఆ పార్టీ శ్రేణులు జనసేన పార్టీకి అండగా ఉంటే, తాము మద్దతుగా నిలుస్తామని జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అన్నారు. సోమవారం గుంటూరు జిల్లాలో పవన్ సుడిగాలి పర్యటన చేశారు. గుంటూరు నగరంతో పాటు ప్రత్తిపాడు, వేమూరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభలను నిర్వహించారు. ఆయా సందర్భాల్లో పవన్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చామని, తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్ట లేకపోవడం, రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్రప్రభుత్వం విఫలం కావడంతో బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం వర్గం జనసేనకు మద్దతు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. మీరు ఏమీ చేయనప్పుడే మీకు మద్దతుగా, అండగా నిలిచానని పేర్కొన్నారు. ఒకరికి ఊడిగం చేసే రోజులు పోయాయని, పల్లకీలు మోసిన ప్రజలను పల్లకి ఎక్కించాలంటే టీడీపీ శ్రేణులు జనసేనకు చేయూతనందించాలని కోరారు. గుంటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా చిల్లరదుకాణాల వారికి అండగా ఉంటానన్నారు. అతిసారతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే స్థానిక ఎంపీ చోద్యం చూశారని, కనీసం బాధితులను పరామర్శించేందుకు కూడా ఆయనకు సమయం లేకపోయిందా అంటూ ప్రశ్నించారు. కేవలం కమీషన్ల కోసమే గుంటూరు రోడ్లన్నీ తరచుగా తవ్వుతున్నారని ఆయన ఆరోపించారు. జనసేన అధికారంలోకి వస్తే మూడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి ఊతమిచ్చేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలు సాగులో ఉన్నప్పటికీ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితులు లేవన్నారు.
ఇజ్రాయిల్ తరహా వ్యవసాయ విధానాలు అమలులోకి తెచ్చి రెండేళ్ల సమయంలో నవతరం రైతుల్ని తయారు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నా తొలిసంతకం అన్నం పెట్టే రైతులకు రూ.5వేల పెన్షన్ ఇచ్చే ఫైలుపై ఉంటుందని పేర్కొన్నారు. తర్వాత ఫైలు రైతన్నకు రూ.8 వేల సాగు సాయం అందించేదిగా ఉంటుందని తెలిపారు.
రాజకీయాలు ఎవడబ్బా సొత్తూ కాదని, తలచుకుంటే తామూ చేసి చూపుతామని అన్నారు. రాజకీయాల్లో మార్పు తెచ్చి చూపుతామని, ప్రజల ఆశలు నెరవేర్చేందుకు, అవినీతి రాజకీయ వ్యవస్థ మీద అస్త్రం సంధించేందుకు వచ్చానని పేర్కొన్నారు. సభలో గుంటూరు ఎంపీ, తూర్పు, పశ్చిమ అసెంబ్లీ అభ్యర్థులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జియా ఉర్ రహమాన్, తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు.
చిత్రం.. గుంటూరు ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్