ఆంధ్రప్రదేశ్‌

పసుపు, చేనేతకు ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 15: పసుపు, చేనేత వస్త్రాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొస్తానని రాష్టమ్రంత్రి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం పట్టణంలో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతులు పసుపు ఎక్కువగా పండిస్తారన్నారు. అదే విధంగా చేనేత వస్త్రాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారన్నారు. విశాఖ జిల్లా అరకులో గిరిజనులు ఉత్పత్తి చేసిన కాఫీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చినట్లుగానే, పసుపు, చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెస్తానన్నారు. వచ్చే నెల జరిగే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలు అసూయపడే విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని, అభివృద్ధి, సంక్షేమంలో టీడీపీతో ఎవరూ పొటీ పడలేరన్నారు. వచ్చే నెల 11న జరిగే ఎన్నికలకు ఇంకా 27 రోజులే ఉన్నాయని, ఈ 27 రోజులూ తనకోసం కష్టపడి పనిచేసి గెలిపిస్తే జీవితాంతం అంకిత భావంతో మంగళగిరి అభివృద్ధి కోసం పనిచేస్తానని లోకేష్ అన్నారు. అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగాక 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చారని, జీతాలు, పెన్షన్లు రావేమోనని భయపడగా 40 ఏళ్ల అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామన్నారు. మంగళగిరికి ఇప్పటికే పలు ఐటీ పరిశ్రమలు తీసుకు వచ్చామని, మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి మరో గచ్చిబౌలిగా తీర్చిదిద్దుతామన్నారు. 68 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి భావి తరాల కోసం యువకుడిగా పరుగులు పెడుతూ కష్టపడుతున్నారన్నారు. ప్రతిపక్ష వైసీపీ ఒక డ్రామా కంపెనీ అన్నారు. జగన్ భద్రతకేమో ఆంధ్రా పోలీసులు కావాలని, కేసు దర్యాప్తుకు మాత్రం ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటున్నాడని లోకేష్ అన్నారు. టీడీపీని ఓడించడానికి కేసీఆర్ తన మంత్రుల ద్వారా వేయి కోట్ల రూపాయలను పంపాడని, ఈనెల 14న వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటన కేసీఆర్ అనుమతి లేకే ఆపారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు చంద్రబాబుకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలని, ఐక్యంగా ఉండి పార్లమెంట్‌కు గల్లా జయదేవ్‌ను, అసెంబ్లీకి తనను గెలిపించాలని లోకేష్ అభ్యర్థించారు.
ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ చంద్రబాబు వల్లే హైదరాబాద్ బ్రాండ్ విలువ పెరిగిందని, అమరావతి కూడా ఆదే మారిదిగా పెరుగుతుందని, లోకేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడం ద్వారా మంగళగిరి బ్రాండ్ ఇమేజి కూడా పెరుగుతుందన్నారు. జగన్‌ను ఓడించి తెలంగాణలోని లోటస్‌పాండ్‌కు పంపాలనిఅన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి మాట్లాడుతూ లోకేష్ పోటీతో మంగళగిరికి మహర్దశ పడుతుందన్నారు. ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేగా లోకేష్ మంగళగిరిని అభివృద్ధిలో తీర్చిదిద్దుతారని అన్నారు.