మెయిన్ ఫీచర్

అంబర వీధిలో ఇక అతివ సాహసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అది ఇది ఏలన? ఇక అన్ని రంగముల..’ అన్నట్టుగా భారతీయ మహిళలు గగనవీధిలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మన రక్షణరంగానికి సంబంధించి త్రివిధ దళాల్లో మహిళల భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతోంది. దేశ సరిహద్దుల్లో కఠోర బాధ్యతలు నిర్వహించేందుకే కాదు, విమానాల్లో విహరిస్తూ ఆకాశమార్గాన యుద్ధ విన్యాసాలు చేసేందుకూ మగువలు ముందుకొస్తున్నారు. భారత వాయుసేనలో పైలెట్లుగా మహిళలు చాలాకాలంగా సేవలందిస్తూనే ఉన్నారు. అయితే, తొలిసారిగా మహిళా ఫైటర్ పైలెట్లకు మన వాయుసేనలో అవకాశం దక్కింది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న ముగ్గురు ఫైటర్ పైలెట్లు భావనాకాంత్, అవనీ చతుర్వేది, మోహనాసింగ్ ఈ ఏడాది జూన్ నుంచి యుద్ధవిమానాల్లో సేవలందించ బోతున్నారు.
భారత వాయుసేనలో మహిళలను నియమించడం 1990లోనే ప్రారంభమైంది. అయితే, వారు దీర్ఘకాలం పాటు పనిచేసే పరిస్థితులు ఉండేవికావు. వాయుసేనలో నియామకాలకు సంబంధించి విధి విధానాల్లో మార్పులు చేయడంతో ఇటీవలి కాలంలో పైలెట్లుగా సేవలందించేందుకు యువతులు మొగ్గు చూపుతున్నారు. మహిళలు కార్గో (రవాణా) విమానాలను నడిపేందుకు 1991లోనే అవకాశం కల్పించారు. హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ యుద్ధపాత్రల్లో రాణించేలా 2012లో ఫ్లయిట్ లెఫ్టినెంట్లు అల్కా శుక్లా, ఎంపీ సుమతి తర్ఫీదు పొందారు. రక్షణ మంత్రిత్వశాఖ అనుమతించడంతో ఫైటర్ పైలెట్లకు సంబంధించి తొలి బ్యాచ్ శిక్షణ ఇప్పటికే ప్రారంభించామని, మొదటిసారిగా ముగ్గురు మహిళలు వచ్చే జూన్ 18 నుంచి యుద్ధపాత్రల్లో విధులు నిర్వహిస్తారని భారత వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. రక్షణరంగంలో ఇది శుభపరిణామమని ఆయన అభివర్ణించారు. ఫైటర్ పైలెట్లు భావన, అవని, మోహన ప్రస్తుతం రెండో దశ శిక్షణ పూర్తి చేసుకున్నారని, పురుష ఫైటర్లతో సమానంగా వీరు పోరాట పటిమను ప్రదర్శించగలరని రహా చెబుతున్నారు.
వాయుసేనలోని అన్ని విభాగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఫైటర్ పైలెట్లుగా మహిళలు రాణించలేరని గతంలో వాయుసేన నుంచి అభ్యంతరాలు వచ్చేవి. గర్భధారణ, ఇతర అనారోగ్య సమస్యలు వారికి అవరోధంగా ఉంటాయని భావించేవారు. అయితే, నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధి విధానాల్లో మార్పులు చేయడంతో మహిళలను ఫైటర్ పైలెట్లుగా నియమించేందుకు అవరోధాలు తొలగిపోయాయి. ఒక ఫైబర్ పైలెట్‌ను తీర్చిదిద్దేందుకు వాయుసేనకు దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఓ అంచనా. యుద్ధ విమానాల్లో ఫైటర్లుగా మహిళలు సేవలందించేందుకు అడ్డంకులు తొలగినా, సముద్ర జలాల్లో సంచరించే యుద్ధనౌకల్లోకి మాత్రం ఇపుడు అనుమతించడం లేదు.
కెనడాలో 1989లోనే మహిళా ఫైటర్ పైలెట్లు రంగప్రవేశం చేయగా, ఆ తర్వాత అనేక దేశాల్లోనూ మగువలు యుద్ధపాత్రల్లో సేవలందించేందుకు ముందుకు వచ్చారు. టర్కీలో 1936లోనే సబీహా గోకెన్ అనే మహిళ యుద్ధ విమానాల్లో సేవలందించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బుక్‌లో నమోదైంది. 2013లో పాకిస్తాన్‌లో అయేషా ఫరూఖ్ అనే మహిళ యుద్ధపాత్రల్లో రాణించింది. కాగా, మన దేశానికి సంబంధించి త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న మహిళల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. ఆర్మీలో 1,436 మంది, నేవీలో 413 మంది, వాయుసేనలో 1,331 మంది మహిళలు చెప్పుకోదగ్గ ఉద్యోగాల్లో ఉన్నారు. భారత వాయుసేనలో మహిళా పైలెట్ల సంఖ్య 94 మాత్రమే. మన త్రివిధ దళాల్లో ఇకపై మహిళలు సాహసోపేతమైన బాధ్యతలు సైతం నిర్వహిస్తారని గత నెలలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆయన మాటలను నిజం చేస్తూ ముగ్గురు యువతులు ఫైటర్ పైలెట్లుగా కఠోర శిక్షణ తీసుకుంటూ త్వరలోనే మన వాయుసేనలో సేవలందించబోతున్నారు.

chitram...
ఫైటర్ పైలెట్లు భావన, అవని, మోహన

-రమ