సబ్ ఫీచర్

ఆందోళనల్ని జయిస్తే ఆనందం మీ వెంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక యుగంలో ఎవర్ని చూసినా ఏదో ఆతృత, ఆవేదనతో సతమతమవుతూ కనిపిస్తుంటారు. ఏ విషయాన్నైనా నిదానంగా ఆలోచిస్తే ఒత్తిళ్లు తగ్గి ప్రశాంతంగా వుండొచ్చు. మానసిక ప్రశాంతత సాధ్యమైతే ఆనందం తనంతట తానే వస్తుంది. చదువు, కెరీర్ కోసం ఆరాటపడేవారు, బాధ్యతలున్నవారు కొన్ని రకాల ఆందోళనలకు గురికావడం అత్యంత సహజం. ఎందుకంటే వారు కొన్ని ఆర్థిక ఇబ్బందులకు గురికావలసి వస్తుంది. పిల్లల చదువులు, వివాహాల విషయంలో తల్లిదండ్రులకు అనేక ఒడిదుడుకులు, ఆవేదనలు తప్పవు. వాటిని మానసిక ప్రశాంతతతో ఎదుర్కొంటే ఆందోళనలు వారి మనసుల్ని అంతగా బాధించవు.
మనసుకి ప్రశాంతత లభించాలంటే రోజులో కొంత సమయమైనా ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. డబ్బు ఖర్చుపెట్టి గొప్పగా పూజలు, వ్రతాలు చెయ్యక్కర్లేదు. కాసేపు ఇతర చింతలకు దూరంగా నచ్చిన భగవన్నామాన్ని జపిస్తే చాలు. అలా మనసు నిలవదనుకుంటే ఇంట్లో టీవీ చానళ్ళలో వచ్చే ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటే చాలు. కాసేపైనా మనసు ప్రశాంతంగా వుంటుంది.
బాధ్యతలు, సమస్యలు తీరిపోయినా కొందరు అదేపనిగా ఆందోళన చెందుతుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేసి, పదవీ విరమణ చేసినప్పటికీ కొందరు ఇంకా తమకు మనవలు పుట్టలేదనో, వారికి మంచి స్కూళ్ళల్లో సీటు రాలేదనో, పిల్లలు సమయానికి ఇంటికి రాలేదనో ఆందోళన చెందుతుంటారు. పిల్లలకి పెళ్లిళ్ళు చేసి, ఇంటి బాధ్యతలు వారికి అప్పచెప్పాక- ప్రతిదానికీ ఆందోళన చెందకుండా వ్యవహరించగలిగితే మనసు ప్రశాంతంగా వుంటుంది. పెద్ద వయసులో ప్రతివారికీ ప్రశాంతత ఎంతో అవసరం. అందుకే పురాణకాలంలో వృద్ధాప్యం వచ్చాక వానప్రస్తాశ్రమానికి వెళ్ళేవారు. ఇపుడు పిల్లలకు దూరంగా ఉండే వృద్ధుల కోసం వృద్ధాశ్రమాలు వెలిశాయి. ఒత్తిళ్లకు, అనవసర ఆలోచనలకు దూరం కానపుడు ఇలాంటి ఆశ్రమాల్లోనూ వృద్ధులకు మానసిక ప్రశాంతత కరవవుతుంది. ఉద్యోగాలు చేసే పిల్లలు వారి కుటుంబాలతో మరో పట్టణంలోనో, వేరే దేశంలోనో ఉండాల్సి వస్తే తల్లిదండ్రులు లేనిపోని ఆందోళనలకు గురికావడం సరికాదు.
‘ఏదో మనం చెయ్యవలసినది చేశాం, ఇక చాలు. వాళ్ళ పాట్లు వాళ్ళు పడతారు..’ అనుకుని అంటీముట్టనట్లు వ్యవహరించాలి. పిల్లలు కోరినపుడు ఏవైనా సలహాలు ఇస్తుండాలే తప్ప అన్ని విషయాల్లో మితిమీరి జోక్యం చేసుకోవడం మంచిది కాదు. తమ ఆధిపత్యం ఇంకా కొనసాగాలని ఆరాట పడితే లేనిపోని స్పర్ధలు, మానసిక ఆందోళనలు తప్పవు. అయితే- ఇలా ఉండగలగడం కొంత కష్టమే!
తాము చెయ్యలేని విషయాలు, పనులు వుంటే మనసులో పెట్టుకుని బాధపడకుండా పిల్లలకు వాటిని విడమరచి చెప్పగలగాలి. ఇలా చేస్తే గనుక పిల్లలు మొదట్లో సుముఖత చూపకపోయినా ఆ తర్వాత తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు. పేరెంట్స్ అభిప్రాయాలకు అనుగుణంగా సర్దుకుపోయే ప్రయత్నం చేస్తారు. ‘జీవితం కూడా రైలు ప్రయాణం లాంటిదే’ అని గ్రహించాలి. కుటుంబ సభ్యుల్లో కొందరు తాత్కాలికంగా, ఇంకొందరు శాశ్వతంగా దూరమైనా కుంగిపోకుండా జీవితాన్ని గడపాలి. దేనిమీదా మమకారం పెంచుకోకుండా చింతలు లేని రీతిలో జీవనయానం సాగించాలి. ‘నావాళ్లు, నా ఇల్లు, నా డబ్బులు’ అంటూ ఇన్నాళ్ళూ ఎంతో తాపత్రయపడినా- చివరకు మన వెంట ఏదీ రాదని గ్రహించాలి. ఆందోళనలకు దూరంగా ఉంటేనే ఆనందం మన సొం తం అవుతుందని తెలుసుకుంటే జీవితం సార్ధకమవుతుంది.

-ఆర్.ఎస్.హైమవతి