అమృత వర్షిణి

సుగంధ పరిమళ సదృశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాయకులెందరో వుంటారు. కానీ గొంతులో సుస్వరం కొందరి మాత్రమే లభించే వరం. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో, కొద్దిమంది మంచి శారీరం కలిగిన నేపథ్య గాయకులకు సంగీత నేపథ్యం మరో వరం.
అపారమైన సంగీత జ్ఞానమున్నా లేకపోయినా కంఠస్వరంలో మాధుర్యం లోపిస్తే ఎక్కువ కాలం ఈ రంగంలో నిలదొక్కుకోలేరు.
ఉత్తరాది హిందీ చలనచిత్ర సంగీతమంతా హిందూస్థానీ సంగీత బాణీ ప్రధానంగానే వినిపిస్తుంది.
దక్షిణాది చిత్రాల సంగీతంలో కర్ణాటక బాణీ కనిపిస్తుంది.
అతి సామాన్య ప్రేక్షకుడికి వినగానే వెంటనే అర్థమయ్యే రీతిలో సాహిత్యం, ఒక్కసారి వింటే మరోసారి వినాలనిపించే ట్యూన్, సినిమాల్లో కనిపించే ముఖ్య లక్షణం. ఏ భాషా చిత్రానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. భాషలో వున్న సౌలభ్యం కారణంగా సుస్వరంతో నిండి నాద ప్రధానంగా తయారైన హిందీ చలనచిత్ర సంగీత, దర్శకుల అలనాటి పాటలన్నీ నిజానికి పరిశోధనాంశాలే. నేటి సినీ సంగీత దర్శకులకు మార్గదర్శకం చేయగల మధుర గీతాలే. ప్రతీ దర్శకుడూ ప్రాణం పెట్టి చేసిన ఆణిముత్యాలే. నాలుగు నిమిషాల వ్యవధిలో పాటలో నవరసాలూ చిందించగల ప్రతిభ కలిగిన సంగీత దర్శకులూ, గాయకులూ తమ శక్తినంతా ధారపోసి, అందించిన వెనకటి తరంలోని సుస్వర గీతాలు వాటి మధురిమలూ నేటికీ నిత్య నూతనంగా వుండటానికి ఏమిటి కారణం?
సుస్వరంతో నిండిన గాయకుల ప్రతిభా విశేషమే.. ఒక కారణమైతే ఆ పాటల రూపకల్పన చేసిన సంగీత దర్శకులు మరో కారణం.
తెర మీద నటీనటుల కంఠస్వరానికి నప్పే నేపథ్య గానం కూడా చిత్ర విజయానికి తోడ్పడే ప్రధాన కారణం. సినీ నటీనటుల గొంతును పోలినట్లుగా మరో గాత్రం దాదాపు అసాధ్యం. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అన్నట్లుగా, పాటలు ఆసక్తిగా వినగా వినగా తెర మీద కనపడే నటీనటుల హావభావాల కనుగుణంగానే పాడుతున్నారనే భ్రమ కలగడం సహజం.
సినీ నేపథ్య గాయకులలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒంటికి సరిపడా దుస్తులు కుట్టినట్లుగా, గాయకుల గాత్ర సౌలభ్యానికి అనువుగా పాటలు కట్టే సంగీత దర్శకులున్నారు. ఒకప్పుడు అక్కినేనికి ఒకలా, ఎన్టీఆర్‌కు మరోలా ఘంటసాల నేపథ్య గానముండేదని కొందరు భావించేవారు. ఆసక్తి కొద్దీ ఘంటసాల సావిత్రి గారితో రేడియో ఇంటర్వ్యూ చేస్తూ ఈ విషయాన్ని ఓసారి ప్రస్తావించాను.
ఆమె నవ్వుతూ ‘్భలేవారే! మా ఆయనకు మిమిక్రీ చేతకాదండోయ్! తన పాటేదో తను కమ్మగా పాడేసి వచ్చేసేవారంతే!’ అన్నారు. మనుషులను పోలిన మరో మనిషి ఉండవచ్చు. కానీ ఒక గొంతును పోలిన గొంతుండటం కష్టం. హిందీ చలనచిత్ర రంగంలో అద్భుతమైన ప్రతిభా విశేషాలు కలిగిన అతి కొద్దిమందిలో కిషోర్ కుమార్ పేరు మీకు బాగా తెలుసు. రచయితగా, సంగీత దర్శకునిగా, నటుడిగా, దర్శకుడిగా, అత్యంత ప్రజ్ఞ కలిగిన అరుదైన గాయకుడిగా, ప్రజల హృదయాలలో సుస్థిర స్థానమేర్పరచుకున్న అరుదైన వ్యక్తి. (1946- 1987)
అశోక్‌కుమార్ గంగూలీ
అనూప్‌కుమార్ గంగూలీ
కిషోర్‌కుమార్ గంగూలీ
సోదరులుగా ఒక వెలుగు వెలిగిన కుటుంబం, వీరిది.
అప్పట్లో తండ్రి ఒక పెద్ద లాయర్. కుటుంబ నేపథ్యం ఎక్కువగా తెలియదు కానీ, మంచి కళాకారులంతా ఆ కుటుంబంలో పుట్టారు.
మైక్ ముందు నిలబడి చుట్టూ పరివేష్టించి వున్న వాద్య బృందం మధ్యలో, వాద్య సంగీతం పూరె్తైన తక్షణం తెర మీద కన్పించే నటుణ్ణి మనసులో తలుచుకుంటూ, ఆయా హావభావాలకు సరితూగేలా, తూకంగా పెదవులను అనుసంధానించి భావం ఉట్టిపడేలా గానం చేయటం కత్తిమీద సాము లాంటిదే. అంతేకాదు. ఊపిరి తీసుకోవటంలో గానీ, వదలటంలో గానీ, ఎక్కడా తేడా రాకూడదు.
సినీ నేపథ్య గాయకులందరిలోనూ ‘మైక్ సెన్స్’ తెలిసి, గానం చేయటంలో కిషోర్‌కుమార్‌కు ఎంతో ప్రత్యేకత ఉందనేవారు. మాటలను ఎలా పలకాలి? ఎలా నిలబడితే, సరైన శబ్దాన్ని వదలవచ్చునో, తెలిసిన మేథావి కిషోర్. ఇదొక ప్రజ్ఞ.
ఈ సందర్భంలో కర్ణాటక సంగీత రంగంలో మన డా.బాలమురళీకృష్ణ కూడా అటువంటి ‘మైక్ సెన్స్’ తెలిసిన గాయకుడు. మైకు ఎదురుగా ఉన్నా గాయకులు తమ బాధ్యతంతా మైక్ మీదకు నెట్టడం కుదరదు. ద్విత్వాక్షరాలూ, రేఫలు పలుకుతున్నప్పుడు, ముఖ్యంగా హ, క్ష, ఓహో లాంటి అక్షరాలు, ఆ శబ్దం కంటే మైకులో గాలే ఒక్కసారిగా ప్రవేశిస్తుంది. అక్షరాలు వినబడవు. ‘బ్లోయింగ్’ రాకుండా జాగ్రత్త పడాలి. ఎలా ఉచ్చరిస్తే తిన్నగా మైకులో ఆ మాట ప్రవేశిస్తుందో, దాని కోసం ఎంత ఊపిరి తీసుకోవాలో, ఎలా నెమ్మదిగా వదులుతూ, శ్రుతిపక్వమైన గొంతులో పాడవచ్చునో తెలిసిన ఘటికుడు కిషోర్. గాయకుడిగా అతని విజయానికి ఇదే ముఖ్య కారణమని అశోక్‌కుమార్ వంటి అగ్రనటుని వాక్కు.
నేర్చుకోవడం ఒకెత్తు. నేర్చుకున్నది పదిమందికీ నచ్చేలా పాడి మెప్పించటం మరొక ఎత్తు. నేపథ్య గాయనీ గాయకులెవరికైనా, ప్రదర్శనా యోగ్యత కలిగి ఉండటమే ముఖ్యమైన అర్హత. ఆ పాట తానే రచించినట్లుగా, తానే ఆశువుగా పాడినట్లుగా భ్రమింపచేసేలా వుంటుందీ నేపథ్య గానం.
తెర మీద కనపడే నటీనటులు సహజంగా భావంతో పలికే సంభాషణలకు సరితూగేదే నేపథ్య గానం.
ఆయా నటీనటులు పాడుతున్న భ్రాంతిని కలిగించటంలోనే నేపథ్య గాయకుల ప్రజ్ఞా విశేషం కనిపిస్తుంది. బెంగాలీ, మరాఠీ, హిందీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్‌పురి భాషల్లో ఎన్నో పాటలు పాడి రికార్డు సృష్టించిన కిషోర్ 8 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాడు. కిషోర్ పాడిన ఆఖరి పాట వేలం వేయగా, 15 లక్షల రూపాయలు పాడారంటే, ఆతడి గొంతులోని ఆకర్షణ విలువెంతో ఊహించండి. అల్లరి చిల్లరగా పాడవలసినవైనా ఆనందంగా పాడవలసినవైనా, సుస్వరం ఆయన సొత్తుగాబట్టి శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకో గలిగాడు. కిషోర్ కుమార్‌లోని మరో ప్రత్యేకత యూడిలింగ్. అంటే, కృత్రిమంగా గొంతులో పలికించగల యాస. రాజేష్‌ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, దిలీప్‌కుమార్ లాంటి కథానాయకులెందరికో పాడి, వారి కీర్తికి కూడా కారణమై, చిరయశస్సు నార్జించిన కిషోర్‌కు చెప్పుకోతగిన సంగీత నేపథ్యమేమీ లేదు. అదే ఆశ్చర్యం. సంగీతం మీద ఆసక్తి ఒక్కటే అర్హత. కె.ఎల్.సైగల్ అభిమాన గాయకుడు. సైగల్‌ని అనుకరించి పాడేవాడు. కిషోర్‌కుమార్ చేత అపురూపమైన రాగ సౌందర్యంతో నిండిన పాటలు పాడించిన ఘనత ఎస్.డి.బర్మన్‌కే చెందుతుంది. ఒకటా? రెండా? వందలు, వేలుగా ప్రేమ గీతాలు, విరహ గీతాలు, విషాద గీతాలు, ఏమి పాడినా వాటికి పూర్తి న్యాయం చేకూర్చి మైమరచి గానం చేసిన అమర గాయకుడు. కిషోర్‌కుమార్ పాటలెప్పుడూ చిరంజీవులే! సునాయాసంగా అనుకరించి పాడగలిగే ఔత్సాహిక గాయనీ గాయకులు, దశాబ్దాల అనుభవంతో పాడిన అలనాటి నేపథ్య గాయకుల కీర్తి వెనుక దాగిన వారి శ్రమ పట్ల ఒక సదవగాహన ఏర్పడితే, వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోగలరు. లేదంటే ఉన్నచోటులోనే ఉంటారు.

- మల్లాది సూరిబాబు 90527 65490