అమృత వర్షిణి

వినదగునెవ్వరు చెప్పిన...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీయాత్రకు వెళ్ళేవారు అక్కడ తమకు బాగా ప్రీతిపాత్రమైన వస్తువును వదిలేసిరావడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వాళ్ళకు ఇష్టపడి తినే ఆకుకూరలు, దుంపకూరలు, తీపి పదార్థాలు వగైరా పేరు చెప్పి మళ్లీ వాటిని జన్మలో ముట్టుకోరు.
ఓరోజు మాకు తెలిసినామె ఒకరు కాశీనుంచి రాగానే, కాశీ గంగ చెంబులు చేతికిస్తోంటే, ‘‘కుతూహలంగా కాశీలో ఏం వదిలేసి వచ్చారని’’ అడిగా. వెంటనే నవ్వుతూ ‘బంగారం’ అంది.
నిర్ఘాంతపోయాను.
‘‘మీరే బంగారం. మీకెందుకు ఆ బంగారం’’ అని ఏదో తెలివిగా అన్నాను అనుకున్నా గానీ, ప్రాణ సమానమైన ఆడవారికి ఎంతో ప్రీతిపాత్రమైన బంగారాన్ని ఆ తల్లి కాశీలో ఎలా వదిలేసిందో అని ఆశ్చర్యపడ్డాను. కాయకూరలు, కందమూలాలంటే సహజంగా ఆశ్చర్యం లేదు. ఏకంగా బంగారమంటే ఎంతో స్థితప్రజ్ఞత కావాలి? అనుకున్నాను.
నిజానికి బంగారమంటే యిష్టంలేని ఆడవాళ్ళుండరు. నడుముకు వడ్డాణం దగ్గరనుంచి చెవులకూ ముక్కులకూ ధరించే చేతులకూ ధరించే ఏ ఆభరణమైనా అందంగా నగిషీలు చెక్కి శోభాయమానంగా వుంటేనే వాటికందం. లక్షలు, కోట్లు పెట్టి నడిపే ఏ షోరూములైనా, స్వర్ణకారుడిమీదే ఆధారపడాలి. మనం కోరిన డిజైన్లలో వుంటేనే కొంటాం. పాటైనా అంతే.
పాటకు ఆధారం స్వరం. కోరిన భావానికనుగుణంగా రాగంలోని స్వరాలను మలిచినపుడే సాహిత్యం తిన్నగా చెవికి చేరి మనసుకు ఆనందాన్నిస్తుంది.
పులుపు, తీపి, ఉప్పు, కారం అన్నీ సమపాళ్ళలో వున్న పదార్థం జిహ్వకు రుచిని ఎలా కల్పిస్తుందో, రాగరసంతో నిండిన మధురమైన గీతం కూడా శ్రవణానందమై మళ్లీమళ్లీ వినాలనిపించేలా వుంటుంది.
వడ్డాణాన్ని ఎలా చెక్కారో, ముక్కెరను, వంకీలను, గొలుసులను ఎలా మలిచారో, ఏయే ద్రావకాల్లో ముంచి తీశారో, మెరుగు ఎలా తెప్పించారో వెళ్లి స్వర్ణకారుడిని ఎవరూ అడగరు. అడిగినా అర్థమయ్యే విషయం కాదు. పైగా అనవసరం కూడా.
అలాగే సంగీత పరిభాషలో రాగాలకున్న పరిధి, ఏయే స్వరాలు ఎలా పలికిస్తే రాగం ఏర్పడుతుందో సంగీతం పాడేవారికున్న సంగీత పరిజ్ఞానం, వినే శ్రోతలకుండనక్కర్లేదు. వినగలిగే సంస్కారం చాలు. అయితే ఏం వింటారు? ఏం వినాలనుకుంటారు? ఈ సంస్కారాల్లో మళ్లీ తేడాలున్నాయి.
కొందరు కేవలం సినిమా పాటలు వినేందుకే పరిమితవౌతారు. మరికొందరు శుద్ధమైన కర్ణాటక సంగీతమే వింటారు. చౌకబారు సంగీతం వినరు! మరికొందరు వారికి తెలిసిన సంగీతమే వినాలనుకుంటారు. వారికేం తెలుసో వారికే తెలియదు. అయినా వినేవారున్నారు. దక్షిణాదిలో రాగానుభవంతో పాడే విద్వాంసుల సంఖ్య ఎక్కువ. వినేవారూ ఎక్కువే. వెనుకటితరంలో 3, 4 గంటలపాటు రాగసౌందర్యాన్ని అనుభవిస్తూ విస్తారంగా పాడినా, ఓపికతో వినాలనే ఆసక్తి కలిగిన శ్రోతలుండేవారు- సృజనాత్మకత ప్రధానంగా కనిపించేది. అప్పటికప్పుడు సృష్టించే మనోధర్మ సంగీతాన్ని మనసారా వినేవారు.
కల్పిత సంగీతం, కల్పనాసంగీతమని రెండున్నాయి. వాగ్గేయకారుల కీర్తనలన్నీ కల్పిత సంగీతం కోవకు చెందుతాయి. ఆ కీర్తనలు పాడగా పాడగా.. తెచ్చుకున్న రాగానుభవంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త భావాలతో పాడటమే కల్పనా సంగీతం,. ఇది గురువుల దగ్గర శ్రద్ధగా కూర్చుని నేర్చుకోవలసినదే.
సినిమా సంగీతమంతా కల్పిత సంగీతమే. ఆ పాటల్లో ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టించేదేమీ వుండదు. మనోధర్మం వుండదు.
చిలకపలుకుల్లా విన్నది విన్నట్లు పాడేయటమే. పైగా మార్పు చేయకూడదు. అదో నేరం కూడా. ఇంకెక్కడ మనోధర్మం? మంచి అభిరుచి కలిగి తెలివితేటలుండి, మృదువైన గాత్రముండీ రాగరసానుభూతిని పొందలేని చాలామంది యువతీయువకులు ఈవేళ సినీ సంగీతానికి దాసులై, నిర్దిష్టమైన పరిధిలో వినగానే పాడగలిగే పాటల్ని నెత్తికెక్కించుకోవడంతో దివ్యమైన సంగీత మాధుర్యానికి దూరమైపోయారు.
సినీ సంగీతానికి ప్రధాన శత్రువు సంప్రదాయ సంగీతం. తాను నేర్చుకున్న సంగీతం కంటే భిన్నంగా పాడవలసిన పద్ధతిని బాగా గమనించి, భుక్తికోసం తన ప్రవృత్తికి తగిన వృత్తి లభించినా తన స్థాయిని దిగజార్చకుండా సినిమా పాటలకో గౌరవాన్నిచ్చి నిలదొక్కుకున్న నేపథ్యగాయడు ఘంటసాల.
బంగారానికి సువాసన అబ్బినట్లు, ఆయన పాడిన పాటలన్నీ జనామోదం పొంది శాశ్వత కీర్తి నార్జించి పెట్టాయి. ఈ ధైర్యం అందరికీ వుండదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంగీత కళాశాలల్లో తేలికగా పాడే సంగీత విధానాలంటూ లేవు. సంగీతంలో డిప్లొమాలు, డిగ్రీలున్నవారికి ఉద్యోగావకాశాలు సున్నా.
మరి లక్షలు, కోట్లు ఖర్చుచేస్తూ ఈ సంగీత కళాశాలలన్నీ ఏ లక్ష్యంతో నడుస్తున్నాయో ఎవ్వరికెరుక? దీనికి ప్రభుత్వాల దగ్గర సమాధానం లేదు.
పాడాలనే ఆశను చంపుకోలేని ఔత్సాహికులైన గాయకులు సినీ గీతాలను ఆశ్రయించి ఆనందించక చేసేదేముంది? ‘నిన్నాడ నేల నీరజాక్ష’ అన్న చందాన తెల్లవారుతూనే టీవీల్లో సినిమాలాయె. ఇంక ఏళ్ళ తరబడి నేర్చుకున్న సంప్రదాయ సంగీతానికే విలువ లేనపుడు మరో దారేది? పడవలసిన కష్టాలన్నీ పడి శ్రద్ధగా బంగారం లాంటి సంప్రదాయ సంగీతం నేర్చుకుని సినిమా రంగంలో నిలదొక్కుకునే ముందు ఘంటసాల వంటి గాయకుడికీ ఈ బాధలు తప్పలేదు. అయినా ఆయన లక్ష్యశుద్ధి లక్షణంగా తీరాన్ని దాటించింది. తరతరాలుగా గుర్తుంచుకునేలా చేసింది. ఆయనకు సాగినట్లు మరొకరికి సాగదు.
ఎక్కడ ఎవరు నేర్పారో తెలియదు, తెనాలిలో తెల్లాకుల వెంకటేశ్వర గుప్త అనే హరికథకుడుండేవారు. కథనంలో, గానంలో ఆ రోజుల్లో ఆయనకాయనే సాటి. ఆయన దగ్గర స్ర్తిలు చాలామంది కథ నేర్చుకుని చెప్పడం విశేషం. అందరూ చాలా బాగా పాడేవారు. కుల మత భేదం లేకుండా తనని ఆశ్రయించిన వారికి విద్యాదానం చేసిన కథకుడు. ఆయన దగ్గర నేర్చుకున్న కథకురాండ్రు తరచూ రేడియోకి వచ్చేవారు.
ముదపాక మల్లేశ్వర్రావు, బళ్ళ బసవలింగం, కూచిభట్ల కోటేశ్వరరావు, యాళ్ళబండి తాతారావు, పొడుగు పాండురంగదాసు, పాతూరి మధుసూదనరావు వంటి వారి కథకుల శుద్ధసంప్రదాయ రీతిలో చేసే కథాగానాలు ఏలూరులో జరిగేవి. తండోపతండాలుగా వస్తూ ఆ హరికధా సప్తాహాలు జనం తెల్లవార్లూ వినటం నేనెరుగుదును.
ఆఖరికి హారతి పళ్ళెంలో వేసే కాసులు చూసి సంబరపడిపోయి కథను కాస్త పొడిగించి తృప్తిపడటం కూడా తెలుసు. వారికి అంతకుమించి అపరిమితమైన సంపాదనంటూ వుండేది కాదు. సంపాదన కాదు, సంగీతమే వారికి బలం. ప్రజల సహకారం తలకాయలు ఊపేవరకే. సహజ పాండిత్యంతో సమయస్ఫూర్తితో వేలాది జనాన్ని ఉర్రూతలూపిన ఆ సంగీతజ్ఞులు సంపాదించింది కేవలం కీర్త్ధినమే - ఈవేళ హరికథలు బుర్రకథలు సినిమాల పుణ్యమా అని అటకెక్కేశాయి.
సమాజానికి సాంస్కృతిక చైతన్యం నింపేది కళాకారులే. వారి సంఖ్య పెరగాలి. ఆదరణ లభించాలి. నేర్చుకున్న విద్యకు సార్థకత వుండాలి. సమర్థులైన వారిని ప్రభుత్వాలు, ప్రజలు దూరం చేసినంత కాలం జాతికి గుర్తింపు లభించదు.

- మల్లాది సూరిబాబు 90527 65490