అమృత వర్షిణి

ఆకాశవాణి క్రియాకలాప దురంధరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాటంటే పదాల పొందిక కాదు.. స్వరాల అల్లిక కాదు...’
పుట్టిన ప్రతి ప్రాణికీ చలనం వున్నట్లు సంగీతంతో ఊపిరి పోసుకున్న ప్రతి పాటకూ ఆత్మ వుంటుంది. అదే లేకపోతే పాటలు యింతమంది హృదయాలను ఎలా పలకరిస్తాయి? కవి గాయకులు కలిస్తేనే సామగాన గీతవౌతుంది. తల్లిదండ్రులను బట్టి పిల్లల రూపాలెలా ఉంటాయో, సంగీతంతో కలిసిన సాహిత్యం కూడా అంతే.
అలాగే వాక్కునకు భావార్థాలే ప్రాణం. అందుకే కాళిదాస మహాకవి.. ‘వాగర్ధా వివ సంపృక్తౌ/ వాగర్థం ప్రతిపత్తయే/ జగతః పితరౌ వందే/ పార్వతీ పరమేశ్వరౌ’ అన్నాడు.
వాక్కుకు సంగీతం కలిస్తే చెప్పేదేముంది? నాదమే తనువైనవాడు శంకరుడు. అపశబ్దంబుల కూడియున్, హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయు గావున, హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు గీర్తింపుచున్ దపసుత్ సాధులు ధన్యులౌదురు గదా తత్వజ్ఞ! చింతింపుమా - అంటాడు పోతన. నలుగురూ కలిసి పాడితే ఆ ఆనందమే వేరు. అనుభవించాలి తప్ప మాటలతో చెప్పలేం. దోషాలు గమనించే అవసరముండదు. పాడటమే ప్రధానం. వెనుకటి రోజుల్లో ఏ ఇతర ప్రసార మాధ్యమాలూ లేనప్పుడు, గ్రామీణ ప్రాంతాల్లో కంఠమెత్తి ఆబాల గోపాలం పాడిన నారాయణ తీర్థుల వారి తరంగాలూ, భద్రాచల రామదాసు కీర్తనలూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ సంగీత జ్ఞానముండి పాడారనుకోకండి. ఒకరిని చూసి మరొకరు గొంతులు కలిపేవారు. అంతే. ఎలా పాడుతున్నారో బాగా గమనిస్తూ అనుసరించి పాడాలనే ఉత్సాహమే తప్ప, వాళ్లకు మహా గాయకులమనే భావం ఏ మాత్రం వుండేది కాదు.
పైగా ఒక్క రూపాయి ఆశించి ఎరుగరు. పాడగలిగితే అదే భాగ్యం. ఎందుకంటే పాడటం వాళ్ల జీవితంలో ఓ భాగం.
అపశృతికీ, శృతికీ భేదం తెలియకపోయినా అందరూ గొంతులు కలిపి పాడితే అద్భుతంగా వినసొంపుగా వుండేది. ఇది చాలా మందికి అనుభవమే.
కమ్మగా పాడేసి, కడుపునిండా తిని పడుకునే వారు. జానపద కళారూపాలైన చెక్క్భజనలు, కోలాటాలు మొదలైనవన్నీ అలా మనుషుల మధ్య ప్రేమను పంచినవే. తెలుగువారి సంగీత ప్రియత్వాన్ని వారే దేశం వెళ్లినా, వెంట తీసుకొని పోయి ప్రజల మీద చల్లడం వల్ల ఈ సంప్రదాయ గౌరవం ఆ భాష కబ్బింది.
ఒకప్పుడు బ్రిటిషు పరిపాలనలో దక్షిణ భారతానికంతకూ అవిభక్త మద్రాసు రాష్ట్రానికి రాజధానియైన మద్రాసు ఒక్కటే ఏకైక రేడియో కేంద్రం.
ఆనాటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటూ మద్రాసు కేంద్రాన్ని నిర్వహించిన స్టేషన్ డైరెక్టర్లనూ, వారి పరిపాలనా పద్ధతులూ, సామర్థ్యమూ, వ్యక్తిగత విశిష్ట చాతుర్యాలూ, వివిధ విషయ పరిజ్ఞానాన్ని అభినందిస్తూ నా సంగీత గురువైన వోలేటి వెంకటేశ్వర్లుగారు సమర్థులైన స్టేషన్ డైరెక్టర్లంటే వారే అంటూ ముగ్గురి పేర్లు చెప్పేవారు. ఒకరు ఆచంట జానకిరాం, రెండోవారి సూరి నారాయణ మూర్తి, మూడవవారు డా.అయ్యగారి వీరభద్రరావు.
ఆ తరువాత వచ్చిన టి.శంకరన్, ఎస్.గోపాలన్, జిపిఎస్ నాయర్ లాంటి వారు కూడా లబ్ధప్రతిష్టులై రేడియో ప్రాభవానికి కారణభూతులైన వారి సంగతి చెబుతోంటే ఆయన కళ్లు ఎర్రబడేవి. నాకింకా గుర్తే. ఆ మహానుభావుల ఒరవడిలో పెరిగి, నడిచిన మేధావి డా.రజని. ఉపోద్ఘాతంలో రాసిన మాటలను మళ్లీ ప్రస్తావిస్తాను. రజని అంటే స్ఫురణకు వచ్చేవి ఆయన మాట, పాట.. రెండూనూ. మనసులో పుట్టిన భావానికి ప్రతీకగా నిలిచే మాటకు సంగీతంతో అర్థం చెప్పగలగటం ఒక నేర్పు. ఒక ప్రజ్ఞ. ఇది అందరికీ అలవడే విద్య కాదు.
నిజానికి రేడియో ఆవిర్భవించిన ఆ రోజులలో సినిమా పాటలకు పెద్దగా ప్రాతినిధ్యమంటూ వుండేది కాదు. ఒకవేళ నాలుగైదు పాటలు ప్రసారం చేసినా ఆ పాటల్లో నాణ్యత వుండేది - సంగీత ప్రధానంగానే ఉండేవి. శ్రీలంక రేడియో స్టేషన్ నుంచి బినాకా గీత్‌మాలా అనే కార్యక్రమాన్ని అత్యంత ఆకర్షణీయమైన తన మాటల చాతుర్యంతో అమీన్ సయానీ అనే ఒక ఎనౌన్సర్ ప్రతిరోజూ ఉదయం గంటసేపు వినిపించి భారతీయ శ్రోతల్ని వశపరచుకోవటంతో రేడియో శ్రోతల సంఖ్య పడిపోయింది. దీనికి ప్రతి క్రియగా కొన్ని సంస్కరణలు బయలుదేరాయి.
ఆలిండియా వెరైటీ ప్రోగ్రాం - (ఎఐవిపి) ద్వారా చిన్నచిన్న లఘు నాటికలు, హాస్య కదంబాలూ ప్రసారవౌతుండేవి. తర్వాత అదే వివిధ భారతిగా మారింది. తర్వాత సుగమ సంగీత శాఖలు ఏర్పడ్డాయి.
బాలాంత్రపు రజనీకాంతరావే ప్రధాన పర్యవేక్షకు డవటంతో, పాట ఎలా ఉండాలో ఎలా పాడాలో చెప్పగలిగిన మేధావులతో దిశా నిర్దేశమంటూ రేడియోకి ఏర్పడింది. ఆ తరువాత ‘్భక్తిరంజని’ ఆలోచన పుట్టింది. లలిత సంగీత ప్రియుల కోసం ఆ రోజుల్లో అన్ని భాషల్లో సమర్థులైన కవుల చేత పాటలు రాయించేవారు. అంతకంటే అద్భుతమైన కంఠస్వరాలు కలిగిన గాయకుల చేత పాడించారు. కొన్ని పాటలు లభ్యం. మరి కొన్ని అలభ్యం. మీరు వెయ్యి చెప్పండి లక్ష చెప్పండి. సినిమా సంగతి వేరు. సినిమా సంగీతం, సినీ సాహిత్యం విషయంలో వారి లక్ష్యాలు వేరు. వాటిని ప్రామాణికతగా తీసుకుని మాట్లాడే ఆస్కారం లేదు. లలిత సంగీత సినీమా వరుసలు గానీ, మరే యితర చౌకబారు బాణీలు గానీ పాడకుండా రేడియో కొన్ని ఆంక్షలు విధించిన విషయం ఎలా మరచిపోగలం? సంప్రదాయ సంగీత గౌరవంతో ఎంతో హృద్యంగా ఘంటసాల వెంకటేశ్వర్రావు, సాలూరి రాజేశ్వర్రావు, బాలసరస్వతి, సుశీల, లీల, కోమల, పిఠాపురం, మాధవపెద్ది సత్యం, ఎ.ఎం.రాజా, ఎం.ఎస్.రామారావు లాంటి ఎందరో గాయనీ గాయకులు పాడిన పాటలకు అప్పట్లో హెచ్‌ఎంవి రికార్డింగ్ వారే ఆకర్షించబడ్డారు. కొందరి పాటలు గ్రామఫోన్ రికార్డులుగా విడుదల చేశారు. దీనితో ఆ గాయనీ గాయకుల కీర్తి మరింత పెరిగింది - ఆ వైభోగమే వేరు.
ఇప్పుడు ఆ గత వైభవాన్ని తలుచుకోవడమే తప్ప కొత్తగా రేడియో సాధించగలిగేదంటూ లేదు. మీకు తెలుసా? కె.వి.మహదేవన్, మాస్టర్ వేణు, సిఆర్ సుబ్బరామన్, సుసర్ల దక్షిణామూర్తి లాంటి సంగీత దర్శకులు కూడా అప్పట్లో కొన్ని లలిత గీతాలు పాడి రికార్డులుగా యిచ్చారు. హెచ్‌ఎంవి ఆర్కెస్ట్రా అంటూ వుండేది. కె.వి. మహదేవన్, ఎ.పి.కోమల పాడిన ఒక క్రైస్తవ యుగళ గీతం ఆ రోజుల్లో (‘సంతోషించుడీ.. అందరు కలిసీ) ఎంతో ప్రసిద్ధమయ్యాయి. కొత్తకొత్త ఎలక్ట్రానిక్ వాద్యాల రాకతో ఈ వేళ గమనిస్తున్నారుగా? వాద్య ఘోష తప్ప పాట వినబడదు. ఆ పాట ఎవరి కోసమో తెలియదు. ఆనాటి లలిత గీతాల నేపథ్యమంతా ఏదో ఒక గిటార్, పియానో, మాండలిన్ లాంటివి తప్ప, మరే యితర వాద్యాలకు చోటు లేదు. పియానో అంటే గుర్తుకొచ్చింది - 1970-71 ప్రాంతాల్లో నేనోసారి మద్రాసు రేడియో కేంద్రానికి వెళ్లినప్పుడు అక్కడ స్టూడియోలో పియానో కనిపిస్తే అక్కడున్న వారి నడిగాను. పియానో నాకిష్టమైన వాద్యం. మద్రాసు కేంద్రపు డైరెక్టర్లలో మొట్టమొదటి ఆయన పేరు విక్టర్ పరంజ్యోతి. ఆయన మద్రాసులోని ‘సెయింట్ ఆండ్రూస్ చర్చ్’లో ‘క్వయిర్ లీడర్’. గాయక బృంద నాయకుడు. 1938లో మద్రాసు రేడియో కేంద్రం ప్రారంభకుడు ఆయన. ఆయన శిష్యుడు, క్వయిర్ లీడర్‌గా పాశ్చాత్య సంగీత ప్రయోక్తగా, ప్రొడ్యూసర్ ఎమిరిటస్, రాష్టప్రతి గౌరవాన్ని అందుకున్న హేండెల్ మాన్యూల్. ఈ పియానో వాయించేవాడని చెప్పారు. పియానో ఒక్కటి చాలు. మైమరచి మత్తెక్కెలా ఉంటుంది. ‘రీమా’ అనే కలం పేరుతో జెమినీ స్టూడియోలో ఆర్.వైద్యనాథన్ అనే సంగీత ప్రయోక్త, వీణబాలచందర్, నారాయణయ్యర్ (గోటు) రజని వంటి మేధావులందరూ కూర్చుని విద్వాంసులనూ, కళాకారులనూ స్టూడియోలకు పిలిపించి అప్పుడప్పుడు కొన్ని సంగీత సమావేశాలు ఏర్పాటు చేసేవారు. పాత సంగీత వరుసలలో కొత్తదనం ఎలా వస్తుంది? కొన్నిటికి కొత్త మెరుపులు జోడిస్తే ఆకర్షణీయమైన లలిత గీతంగా ఎలా రూపొందుతుంది? అనే విషయాలు చర్చించేవారని రజని చెప్పగా విన్నాను.
ఆ రోజుల్లో ప్రసిద్ధ వైణికుడు ఈమని శంకరశాస్ర్తీ ఐదు వీణలతో చేసిన ఆదర్శ శిఖరారోహణం చాలా పేరు పొందిన కార్యక్రమం. వాద్యగోష్టిలో అక్షరాలంటూ లేకుండా కూర్చిన సంగీతంలో భావరూప కల్పన, కథాకల్పనా వెరసి ‘ఎవరెస్టు శిఖరంపై సాధించిన విజయం’గా ‘ఆదర్శ శిఖరారోహణం’ ప్రసారమైందని ఓసారి బాలాంత్రపువారే నాతో చెప్పారు. ఈ సందర్భంలో ఈమని శంకరశాస్ర్తీ గారి సమీప బంధువు ఎం.ఎస్.శ్రీరామ్‌ని గురించి మీకు చెప్పాలి. సాధారణంగా ఆకాశవాణిలో సంగీత శాఖ నిర్వహించే అధికారులకు సంగీతంపై అవగాహన ఉండటం అరుదు. సంగీత జ్ఞానం కల్గినవారే ఆ శాఖను నిర్వహించటం ఇంకా అరుదు. శ్రీరామ్ మంచి సంగీత జ్ఞానమున్న వ్యక్తి. కొన్ని తెలుగు సినిమాలకు సంగీతం కూడా చేశారు. ‘పెళ్లిరోజు’ అనే చిత్రం బాగా పేరు తెచ్చింది. శ్రీరామ్‌కు కార్యదక్షత ఒక్కటే కాదు సంగీతానురక్తి కూడా బాగా ఎక్కువ. ఆఫీసుకు వస్తున్నా, వెళ్తున్నా ఏదో పాడుకుంటూనే వుండే సంగీత పిపాసి. ఆయనతో చాలా సన్నిహితంగా తిరిగేవాణ్ణి. విజయవాడ రేడియో కేంద్రంలో కార్యనిర్వాహకుడిగా చేరారు. పైగా సంగీత శాఖ చూసేవారు. వందలాది లలిత సంగీతం పాడే గాయనీ గాయకులు ప్రతి రోజూ రేడియో కేంద్రానికి వస్తూ వెళ్తూంటారు.
సాధారణ స్థాయిలో (బి గ్రేడ్) పాడేవారి సంఖ్య ఎక్కువ. అత్యుత్తమంగా పాడగలిగే (ఎ గ్రేడ్) వారి సంఖ్య ఎప్పుడూ తక్కువే. ప్రత్యేక రికార్డింగులు పాడే అవకాశాలు వీరికే ఉంటాయి. వీరికే గుర్తింపు. మిగిలిన వారు బృంద గానాలకు పరిమితవౌతూంటారు. లేదా వారి పాట వారు పాడేసి వెళ్తూంటారు. అప్పుడప్పుడు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో మిగతా వారితోబాటుసమానంగా అవకాశాలు రావాలని చాతక పక్షుల్లా ఎదురుచూస్తూంటారు. కానీ లోలోపల వాళ్లల్లో ఏదో అసంతృప్తి వెంటాడుతూంటుంది.
పై గ్రేడుకు దరఖాస్తు చేసి పాడాలంటే లోలోపల దిగులు. ఉన్న గోడు కూడా పోతుందనే భయం. అధైర్యం. ఇది గమనించిన శ్రీరామ్ ఓ రోజు నన్ను పిలిచి ‘బి’ గ్రేడు మాత్రమే కలిగి విడిగా ప్రత్యేకంగా పాడాలనే కాంక్ష కలిగిన వారందరి జాబితా ఒకటి తయారుచేయమన్నారు. ఓ పాతిక మంది పర్లు సిద్ధం చేసిచ్చాను. అంతా సాధారణ స్థాయిలో పాడే గాయకులు. వీరిలో కొందరిని ఎంపిక చేశారు. ‘శివస్తుతి’ని కంపోజ్ చేసి, పక్కాగా రెండు మూడు రోజులపాటు రిహార్సల్స్ చేసి పాడించిన సంఘటన నాకిప్పుడూ గుర్తే. పెద్ద విద్వాంసులతో పాడే అవకాశం వస్తుందని వారు ఊహించలేదు. అలా రికార్డైంది ‘శివస్తుతి’.
సర్వశ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ, నేనూ, మరి కొంతమంది మిగిలిన గాయనీ గాయకులతో అర్ధరాత్రి వరకూ సాగిన ఆ రికార్డింగు, భక్తి రంజని కోసం చేసిన ‘శివస్తుతి’.
ఒకటి దారిద్య్ర దహన స్తోత్రం, మరోటి లింగాష్టకం.
ఇందులో చాలా చరణాలుంటాయి కదా? ఒక్కో చరణం ఒక్కో గాయకుడు పాడి, ఎంతో శ్రమ పడి భక్తిరంజని కోసం రికార్డు చేసిన ఆ స్తోత్రం ఇప్పటికీ సోమవారాల్లో ప్రసారమవుతోంది. దీనికి మూల కారకుడు, సంగీత ప్రయోక్త ఎం.ఎస్.శ్రీరామ్. భక్తిరంజనికే పేరు తెచ్చిన ఆ స్తోత్రం తెలియనివారు, వినని వారు లేరు. ఆ తర్వాత భక్తిరంజనిలో ఎనె్నన్నో ప్రసారమవుతూ వచ్చాయి. సంప్రదాయ సంగీత విలువలు కాపాడబడాలి అనే లక్ష్యంతో చేసిన కార్యక్రమాలు ఎప్పుడూ వనె్న తగ్గవు. ఎప్పుడు విన్నా, అప్పుడే విన్న అనుభూతినిస్తాయి. విసుగనిపించవు. ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం అంతమంది కళాకారులతో రికార్డింగు సదుపాయాలు అరకొరగా వున్న పరిస్థితులలో ఎంతో శ్రమించి, రిహార్సల్స్ చేయించి పాడించారు. పాత స్టూడియోలున్న చోట ఒక వేదిక సిద్ధంచేస్తే, అర్ధరాత్రి 12 గంటలకు రికార్డింగైయ్యింది.
రేడియో అంటేనే సంగీత సాహిత్యాల వేదిక. ప్రభుత్వ అధీనంలో వున్న ప్రజా సంస్థ కాబట్టి, కొన్ని పరిధులకు లోబడక తప్పదు. కానీ ఉత్తమ సంగీతానికి, సాహిత్య విలువలను పరిరక్షించడానికీ ఎటువంటి మినహాయింపులూ లేనంత కాలం రేడియో గౌరవం తగ్గదు.
అసలు పూర్వం నాటకాలలో మధ్యమధ్య కొన్ని సన్నివేశాలకు పాటలు తయారుచేయటం అనే ప్రక్రియ లలిత సంగీతానికి మూలం. హిందీలో సుగమ్ సంగీత్ అనే ప్రక్రియ ఆధారంగా తెలుగులో గత శతాబ్ది ప్రథమార్ధంలోని కొత్త విధానమే లలిత సంగీతం.
శాస్త్రం బరువు పడకుండా సంప్రదాయాన్ని వదలకుండా, ఆ హద్దుల్లో అందరూ పాడుకునే రూపొందించబడే ఈ లలిత సంగీతానికి, మూల విరాట్టులెవరు? అంటే చెప్పటం కష్టం.
కారణం, సంప్రదాయ సంగీతానికో ప్రణాళిక ఉంది. పద్ధతంటూ ఉంది. కర్ణాటక శాస్ర్తియ సంగీతం చక్కని గమకంతో రాగభావం నింపుకున్న సంగతులతో వినిపిస్తేనే గౌరవం. మాటలు తట్టుకోగలిగిన గమకాలుంటేనే లలిత సంగీతానికి అందం. అవగాహనతో అర్థం చేసుకుని పాడాలి. ఏదేమైనా మొదటి తరం గాయనీ గాయకుల తర్వాత, మళ్లీ ఆ వైభవం లలిత సంగీతానికి రాలేదు.
దిశా నిర్దేశం చేయగల లలిత సంగీత గురువులేరీ? రేడియోలో సాధారణ స్థాయిలో పాడే లలిత సంగీత గాయనీ గాయకులు వారికున్న ప్రజ్ఞతో పాడి వెళ్లడమేగానీ, ప్రత్యేకంగా రేడియోకొచ్చి నేర్చుకునేదంటూ ఉండదు. నేర్పేదీ లేదు. పాటలో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే కాంక్ష, మార్గదర్శకులే అరుదు.

చిత్రాలు..ఆచంట జానకిరామ్
*ఎం.ఎస్. రామారావు

- మల్లాది సూరిబాబు 90527 65490