అమృత వర్షిణి
కర్ణాటక సంగీతమొక కామధేనువు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాడాలనే ఉత్సాహముండి సంగీతం నేర్చుకోవాలనే వారికి లభించవలసినది మొట్టమొదట సద్గురువు. గురువు సమర్థత నేర్చుకునే శిష్యుడు గ్రహించటం కష్టసాధ్యమైన విషయం. సర్వ సమర్థుడని తెలిసేదెలా? ప్రతిభా విశేషాలున్న వారి గానమే సాక్ష్యం. నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి పుణ్యమా యని సంగీత కచేరీలు వినే అలవాటు సంక్రమించింది. నాకు గుర్తున్నవి మీతో పంచుకోవాలని పించటమే ‘అమృతవర్షిణి’కి ప్రేరణ. సంప్రదాయ సంగీతంలోని మాధుర్యాన్ని అందులోని రుచి చూపించిన మహానుభావులు ఒకరు వోలేటి, మరొకరు డా.శ్రీపాద పినాకపాణి, ఇంకొకరు నేదునూరి కృష్ణమూర్తి.
‘సంగీతంలో నీకున్న అర్హత ఏమిటి? నీకేం తెలుసుననీ? నువ్వెంత పాడగలవనీ?’ అని మనస్సు హెచ్చరిస్తూనే ఉన్నా, నలుగురికీ చెప్పాలనే చాపల్యం మనస్సును లొంగతీసుకుంటుంది.
దక్షిణాదిలో నెలకొన్న సంగీత వాతావరణం బాగా తెలిసిన వాడను కాబట్టి, అటువంటిది మనకెందుకు లేదు? ఎక్కడుంది లోపం? రసజ్ఞులైన శ్రోతలకు లోటు లేదు. పాడగలిగే వారున్నారు. ఆంధ్రలో పేరు తెచ్చుకున్న విద్వాంసులు ఎందరు లేరు? అందరూ హాయిగా కూర్చుని కర్ణాటక సంగీతాన్ని విని ఆనందించగల స్థితి ఎలా వస్తుంది?
ఈ సందర్భంగా విధిగా డా.బాలమురళీకృష్ణను తలచుకోవాలి. తెలుగు భాషలోని మాధుర్యం తెలిపి, అర్థం చేసుకుంటూ గానం చేయటం ఒక విశేషమైతే, మాటలను సుతిమెత్తగా సుతారంగా వీణ మీటినట్లుగా పలకడం మరో విశేషం.
సాహిత్య భావం మనసులో ప్రవేశించడానికి ఒక్కోసారి గమక సహితమైన సంగతులు అభ్యంతరం చెప్పవచ్చునని భావించి, అవసరమైన మేరకే గమకాలను పొదుపుగా వాడి మెప్పించటం, అంతిమ లక్ష్యం సభారంజనం, ఇవన్నీ ఆయనకు వెన్నతోబెట్టిన విద్యలు. తమిళ విద్వాంసులైన కొందరికి ఇది రుచించలేదు. సరే. అదలా ఉంచండి. ప్రత్యేక కారణమంటూ లేకపోయినా వాసిలోనూ రాశిలోనూ దేశంలోవున్న అన్ని రాష్ట్రాల కంటే తమిళనాడులో గుడులూ గోపురాలు ఎక్కువే! తంజావూరు పేరు చెబితే చాలు, భక్తులూ, వాగ్గేయకారులూ తమిళ కవులూ ఎందరెందరో గుర్తుకొస్తారు. చాలామంది నుదుటి మీద విభూతి రేఖలు లేకుండా ఉండరు. అక్కడ అలవాటైన సంప్రదాయమది.
కోవూరు కుంభకోణం తిరువత్తియూర్ లాంటి చాలా ప్రసిద్ధ క్షేత్రాల్లో వెలసిన దేవతలందరూ శక్తిసంపన్నులే. నిత్య దైవదర్శనం అక్కడి వాళ్ల దైనందిన కార్యక్రమాల్లో ఒకటి. పేరున్న చాలామంది సంగీత విద్వాంసుల పేర్లు ముందు వారు పుట్టిన ఊరు పేరుతో పిలుస్తారు.
పాల్ఘాట్, కుంభకోణం, నామగిరిపెటై, తిరువడుదురై, మన్నార్‌గుడి, లాల్‌గుడి వంటివన్నీ అక్కడి విద్వాంసుల వల్ల మరింత ప్రసిద్ధమయ్యాయి. ‘మధురై’ని ఒకప్పుడు ‘మధుర’ అని పిలిచేవారు. అంటే అర్థం తీయదనం. క్రమంగా ‘మధురై’గా మారింది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, అక్కడి విద్వాంసురాలే. సోమం అక్కడి వాడే. సంగీత మూర్తిత్రయం ముగ్గురూ ఆ ప్రాంతాల వారే. వారి శిష్యులంతా అక్కడివారే. మనకంటే దక్షిణాదిలో వున్న వారికి ఆ కావేరీ నదీమతల్లి పుణ్యమో ఏమో గానీ, సంగీతాభిరుచి మెండు. తెచ్చిపెట్టుకున్నది కాదు. అది వారికి సహజంగా సంక్రమించినదే. వారికి తమిళ సంప్రదాయం, సంస్కృతులతోబాటుగా సంగీతం కూడా ఒకటి.
పెళ్లీడు వచ్చిన ఆడపిల్లలకు సంగీతం ఒక అర్హత. తొందరగా పాట పాడగలిగిన వారికి వివాహాలవడం కద్దు. వివాహమైన తర్వాత కూడా సంసారం పెరిగిపోకుండా ముందే జాగ్రత్తపడి సంగీతాభిలాష కల్గిన ఆడపిల్లలు సద్గురువులను ఆశ్రయించి, శ్రద్ధ్భాక్తులతో సంగీతం నేర్చుకునే వారి సంఖ్య అక్కడే ఎక్కువ. ఇక్కడ ప్రోత్సహించేవారు లేకపోలేదు కానీ నిర్లిప్తత ఎక్కువ. అక్కడి పుణ్యక్షేత్రాల్లో మరో విశేషముంది. దేవాలయాల్లో ప్రత్యేక సందర్భాల్లో జరిగే ఉత్సవాల్లో సంగీత కచేరీలే ఏర్పాటు చేస్తూంటారు. కేరళలో అయితే మరీను. కాస్త పొద్దుపోయిన తర్వాత సంగీత కచేరీలు ప్రారంభమై అర్ధరాత్రి దాటే వరకూ సాగుతాయి. శ్రద్ధగా కూర్చుని వినటం చూశాను. ప్రజల్లో సంగీతాసక్తి మరి పెరగదా? ఆ వాతావరణం ఇక్కడ మృగ్యం. లేదు లేదని తలబాదుకుంటే ఎలా? వారికి సంగీతం అంటే సంప్రదాయ సంగీతమే. అలా సంగీతంపై అభిరుచి కలిగిన వారు ముందు శ్రద్ధగా గురువును ఆశ్రయించే పనిలో పడతారు. చౌకబారు సంగీతం పట్ల ఆకర్షితులవ్వరు. సద్గురువు దొరికాడా! పంట పండినట్లే. క్షుణ్ణంగా భయభక్తులతో 7,8 ఏళ్లపాటు నేర్చుకుంటారు. ఒక స్థాయికి రాగానే అక్కడున్న సంగీత రసికులకు అనతి కాలంలోనే, బాగా పాడుతున్నారనే సంగతి తెలిసిపోతుంది. పని మానుకుని, వాళ్లే ప్రచారం మొదలుపెట్తారు. ఆ గాయకులకు అవకాశం కల్పించమని సంగీత సభలను వీరే ఆశ్రయించి కోరుతారు.
క్రమంగా ఆ నోటా ఈ నోటా పదిమందికీ పేరు తెలుస్తుంది. ఆ వాతావరణమే పాడిస్తుంది. పరిణతి సాధించేలా చేస్తుంది. దక్షిణాది విద్వాంసులకు విని మెచ్చుకోగల రసజ్ఞులే వుండటం అక్కడి విద్వాంసులకో పెద్ద వరం. పాడలేకపోయినా అక్కడి వారికి చాలా రాగాలు ఎలా పాడాలో తెలుసు. బాగా రాగభావంతో మనసు పెట్టి గానం చేసేవారిని అలా అనుసరిస్తూనే ఆనందిస్తూ వింటారు. అక్కడి వారు తెచ్చుకున్న సంస్కారమది.
మనలో మన మాట. పరమ భక్తులైన వాగ్గేయకారులు రచించినవన్నీ భగవద్భక్తిని ప్రోద్బలం చేరే కీర్తనలు. త్యాగరాజ కీర్తనలు, తరంగాలు, రామదాసు కీర్తనలు, భగవంతుడి సమక్షంలో పాడితే ఎంత రసవత్తరమై నిలిచిపోతుందో వేరే చెప్పాలా?
మనం గుడికెందుకు వెళ్తాం? కాసేపైనా ప్రశాంతత దొరుకుతుందని. ప్రశాంతంగా వుంచగలుగుతున్నారా? వుండగలుగుతున్నామా? నేటికీ దక్షిణాదిలో చాలా పెద్ద పెద్ద సంగీత కచేరీలన్నీ దేవాలయ ప్రాంగణాల్లోనే జరుగుతాయి. శ్రద్ధగా సంగీతం వింటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మనకూ ఉంది. ఎంతో శ్రద్ధగా ఏ రోజు హుండీలో ఎంతెంత పోగైందో ఎప్పటికప్పుడు అత్యుత్సాహంగా, టీవీల్లో చూపించటంలోని అంతరార్థం ఏమిటో ఎవరైనా చెప్పాలి. వారికి అదే పరమార్థం అనుకోవాలి. టిక్కెట్లుకో క్యూ, దర్శనానికో క్యూ, అంచెలవారీగా ప్రసాదాలకూ, కాటేజీలకూ క్యూ. బతుకు అలా క్యూలతోనే సరిపోతుంది. కాస్త శ్రద్ధ పెట్తే తప్ప దేవాలయాల్లోని వాతావరణంలో మార్పు రాదు.
శ్రుతిశుద్ధంగా పాడుతూ ఎదురుగా కూర్చున్న భక్త జనంతో పాడించగల భజన కూటములెన్నో ఉన్నాయి. హరికథలు చెప్పగల సమర్థులున్నారు. రామాయణ, భారత, భాగవతాలపై ప్రసంగించగల పండితులున్నారు. లేనిదొక్కటే. సమర్థవంతంగా, ఇష్టపడి నిర్వహించగల నేర్పు గలిగిన అధికార గణం.
రాష్ట్రంలోని ఏ దేవాలయంలోనైనా ఇదే స్థితి. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా మనిషి ఎలా పెరుగుతాడు? సమాజం పెరిగే మార్గమేది? అమ్మవారికో అయ్యవార్లకో, నియమ నిష్టలతో చీరె సారె సమర్పించుకోవటమే పెద్ద ఆధ్యాత్మిక సేవ. మనశ్శాంతి నివ్వవలసిన ఆలయాలు మాన్యత కోల్పోతే, ఇంకెక్కడ సాంస్కృతిక చైతన్యం? మరెక్కడ ఆధ్యాత్మిక ప్రగతి?