అమృత వర్షిణి

సుమధుర గానం.. సొగసైన మృదంగ తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమధురమైన గానానికి మృదంగం సొగసుగా ఉండాలనేది, ఒకరు చెప్పాలా? ఎవరికి వారు తెలుసుకోవాల్సిందే. ఓసారి మహారాజపురం విశ్వనాథయ్యర్ అనే విద్వాంసుడు కచేరీ పాడి ఇవతలకు రాగానే, అక్కడున్న వారు ఆయనతో ‘అయ్యా! మృదంగ విద్వాంసునికి తని’ వాయించే అవకాశం ఇవ్వలేదేం?’ అనడిగారుట.
‘్భలేవారే! కచేరీ పూర్తయ్యేవరకూ ఆయన వాయించినదంతా ‘తని’యే కదా?’ అనేసరికి అందరూ ఒక్కసారి నవ్వుకున్నారుట. (సంగీత కచేరీలో ‘తని’ అంటే అర్థం సహకార వాద్యాలు ప్రత్యేకంగా కొంతసేపు వారి వాద్యం వినిపించటం) అడుగడుగుకూ కరతాళ ధ్వనుల కోసం తాపత్రయపడే లౌకికానందం, బ్రహ్మానందాన్ని దూరం చేస్తుంది. మహామహా యోగులు, సంగీత ఋషులనుభవించినది అలౌకికమైన ఆనందం. ఆ ఆనందసాగరంలో ఈదులాడని జన్మమెందుకు పండగ? అన్నాడు త్యాగయ్య. నిజానికి ఆ నాదానందం అనుభవించే అదృష్టానికి నోచుకున్న సంగీత విద్వాంసులే అర్హులు. ఈలాటి మహత్తరమైన అవకాశం మరే విద్యలోనైనా వుందా? చెప్పండి. గానం చేసే వారితోబాటు వినేవారు కూడా తరించేదీ అందులో ఆనందాన్ని అనుభవించేది సంగీతంలోనే. అందుకే ఇది ఆత్మవిద్య. పొట్టకూటికి ఏదో విద్య సరిపోతుంది. కానీ మనిషి తరించటానికి ఏర్పడ్డ విద్యయే సంగీతం. ఈ సంగీతాన్ని తామస విద్యగా మార్చేసే రోజులొచ్చాయి. ఒక గాయకుడు ఎంత గుక్క పట్టగలడు? ఎన్ని స్థాయిలలో సంచారం చేయగలడు? దానికి తగినట్లుగా లయ వాద్యాలు ఒకరిని మించి మరొకరు శక్తికి మించిన శబ్దాలతో చెవులు దిమ్ము పట్టించేస్తూ పోతే ఆ సంగీతంలో స్వారస్యముంటుందా? ఆత్మానందాన్నిస్తుందా?

ఎం త ప్రయత్నం చేసినా పరమాత్మను చింతిద్దామంటే ఒక్క నిమిషం మనసు నిలవడంలేదు.
ఏం చేయాలి భగవాన్! అని రమణులని అడిగాడొక భక్తుడు.
తనను చూసేందుకు వచ్చే భక్తులంతా సాధారణంగా ఇటువంటివే అని ఆయనకు బాగా తెలుసు. వెంటనే ఒక్కసారి నవ్వుతూ ‘చిన్వతావా? మజ్జతావా?’ అంటే ‘చింతిస్తావా? మునుగుతావా?’ అనడిగారు.
‘నేను ప్రయత్నిస్తున్నాను’ అనే అహంకారం వున్నంతవరకూ ఆలోచించబడే విషయం కంటే వేరుగానే ఉంటాడు.
‘హృదయం’ అనే అద్దంలో నీ ప్రియురాలి ప్రతిబింబం ఉంది. ఒక్కసారి తలవంచి నీ హృదయంలోకి తొంగి చూసుకో’ అంటాడు మీర్జా గాలిబ్. తల ఎత్తి ‘నేను’ అనే భావం వున్నంతవరకూ మన దృష్టి ఇతరులపై వున్నంతవరకూ పరమాత్మ లభించడు. ద్వైతం లేదు. అద్వైతమే. శరణాగతుడై పోతేనే లభిస్తాడు. ఉపాసన అంటే అదే. కాశీ వెళ్లి ‘గంగలో మునిగి చేసిన పాపాలన్నీ పోతాయని కాదు అర్థం. తెలిసీ తెలియని పాపాలు భరించగలిగేది ఆ భాగీరథి అనే నమ్మకం గట్టిగా వుంటే ఆ తల్లి ఒడిలో పసివాడై పోతాడు. వీధుల్లో తిరిగే త్రాగుబోతులకూ ఇంట్లో ఆడుకునే పసివాడికీ నేను అనే భావన వుండదు. అది లేనప్పుడు పాపాలెక్కడ? ఉపాసన అలా వుండాలి. సంగీతాన్ని పట్టుకుని ‘నాద సుధారసం చిలను నరాకృతాయెరా’ అన్నాడు. శ్రీరామచంద్రుడే నాదమూర్తిలా కనిపించాడు త్యాగయ్యకు. ఆయన ఉపాసనామూర్తి. రాముడి కోదండానికున్న ఏడు గంటల్నీ సప్తస్వరాలతో పోల్చాడు. కోదండాన్ని రాగమన్నాడు. ఎందుకంటే, రాగానికో నడక వుంది. స్వరాల కూర్పుంది. ఆ స్వరాలను రాముడి మృదువైన మాటలతో పోల్చాడు. ఆయన విడిచే బాణం లక్ష్యాన్ని సమీపించగానే అస్థిత్వాన్ని కోల్పోయినట్లుగా నాదయోగికి కూడా అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది. బ్రహ్మం కనిపించేది కాదు. అనుభవించేది. రామబ్రహ్మ తనయుడైన త్యాగయ్యంటాడు.
నాద స్వరూపుడైన రాముణ్ణి ఎలా తృప్తి పరచగలం? దేనికి తృప్తిపడతాడు? గానంతోనే! ఆ గానం ఎలా వుండాలి? యిలా భావించాడు.
‘సొగసుగా మృదంగ తాళము జత కూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడెవ్వడో నిగమ శిరోర్ధము కలిగి నిజ వాక్కులతో స్వర శుద్ధముతో ॥
యతి విశ్రమ సద్భక్తి విరతి ద్రాక్షారస యుత
నవరస - యుత కృతిచే భజియించే
యుక్తి త్యాగరాజుని తరమా ॥ - సొగసుగా॥
సహజ పాండిత్యంతో, సంగీత సాగరాన్ని పుక్కిటబట్టిన త్యాగరాజే ‘్ధరుడెవ్వడో?’ అంటే ఇంక సామాన్యుల సంగతేమిటి? ఆయనలో వున్న నమ్రతకూ, సంగీత సంస్కారానికీ చేతులెత్తి నమస్కరించాలి - అలా పాడగలిగిన సమర్థుడు ఆయనే.
భగవంతుని అనుగ్రహం కోసం ఎంత ఏడ్చినా సార్థకతే అవుతుంది. హృదయాన్ని తాకే సంగీతానికి రెండే రెండు మూల వస్తువులు - ఒకటి సుస్వరంతో కూడిన నాదం. రెండోది ఆ నాదాన్ని నియంత్రించేవాడు. గాయకులకూ వాదకులకూ ఈ రెండింటి పరమార్థం బాగా తెలియడమే సంగీతానికి లక్ష్యం. కావ్యాలకు ఛందస్సు ఎంత ముఖ్యమో పాటకు శ్రుతిలయలు రెండూ ముఖ్యమే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు క్రమబద్ధంగా ఉంటేనే జీవుల మనుగడ. లేదంటే తేడాయే. గానమైనా అంతే. ఈ రెండింటిలోనూ పండిపోయి పితామహుడనిపించుకున్న ఆదిభట్ల నారాయణదాసు కేవల హరికథకుడే కాదు.
ఆయనో శబ్ద బ్రహ్మ. లయ బ్రహ్మ. మన తెలుగు గడ్డ మీద జన్మించిన ఒక పుంభావ సరస్వతి.
‘శంభో’ అని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి పాడితే ఆమడ దూరం వినిపించేదిట. ఆ నాదం పంచముఖీ పరమేశ్వరుడన్న బిరుదును సొంతం చేసుకున్న మహాపురుషుడు అన్న పేరన్న తంబురాతో సహకరిస్తూ ఆయనతో సమానమైన స్థాయిలో గానం చేసేవాడు. రెండు చేతులతోనూ రెండు తాళాలు వేసేవాడు. నాదంలో రుచి తెలిసిన దాసుగారు లయను పూర్తిగా స్వాధీనం చేసుకున్న నందీశ్వరుడు. అదే ఆయన ఉపాసన. ఆయనకు ఆయనే గురువు. హరికథా గానం చేస్తూ మధ్యమధ్యలో కృతికి అనుగుణంగా నృత్యంతోపాటు ‘పంచముఖి’ని ప్రదర్శించేవారు. ‘గానానికి శాస్తమ్రే ప్రమాణం. అయినా ప్రాణం భావం. లెఖ్ఖాచారాలతో ఎంత గింజుకున్నా శ్రోతలు ఆదరించరు. సాహిత్య భావ ప్రకటనతోనే గానం రంజకంగా ఉంటుందనేవారు.
మృదంగం పేరు చెప్పగానే స్ఫురించే పేరు పరమశివుని ప్రమధ గణాల్లో ముఖ్యుడు నందీశ్వరుడు.
ప్రదోష కాలంలో శివుడు చేసే నృత్యానికి నందీశ్వరుడే సాక్షి.
గత శతాబ్దిలో లయ వాద్యంలో తమకు తామే సాటి యనిపించుకుని నందీశ్వరుని అవతారమని భావించిన వారెందరో.
అలఘనంబి, తంజావూరు సేతు రామారావు, తంజావూరు తుకా రామప్ప, పుదుక్కోటై దక్షిణామూర్తి పిళ్లై, ముత్తయపిళ్లై, పళని సుబ్రహ్మణ్య పిళ్లై, మాంపూండియా పిళ్లై (కంజీర) ఉమయాల్పురం నారాయణయ్యర్ (ఘటం) పళని కృష్ణయ్యర్ (ఘటం) మొదలైనవారు ప్రముఖులు. మహారాష్టక్రు చెందిన నారాయణప్ప అనే మృదంగ విద్వాంసుడు ఆ రోజుల్లోనే అధిక పారితోషికం తీసుకున్న విద్వాంసుడు. చిత్రవిచిత్ర గతులలో ఆ వాద్యాన్ని సాధనతో స్వాధీనం చేసుకుని, అఖండ పాండిత్యాన్ని ప్రదర్శించిన ఈ విద్వాంసులందరూ ప్రధానమైన గాత్ర విద్వాంసుణ్ణి అధిగమించటం గానీ, తమకే గుర్తింపు రావాలని గానీ ఏనాడూ భావించలేదు. అందుకే అప్రయత్నంగానే వారికంత కీర్తి లభించింది. మృదంగ సహకారం లేని రోజుల్లో ‘నన్నూమియా, చోటూమియ్యా’ అనే సోదరులు సంగీత కచేరీలలో ‘డోలక్’ వాయించేవారుట. లయ వాద్యాలన్నిటిలోనూ మృదంగమే రారాజు. సొగసైన మృదంగ వాద్యానికో భాష ఉంది. మనసుంది. సుస్వరాన్ని అనుభవించగలదు. ఈ వాద్యం పేరు చెప్పగానే మనసులో మెదిలే, కారణజన్ములైన మహానుభావులున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత. పాల్ఘాట్ టిఎస్ మణి అయ్యర్ ఈ తరానికి బాగా తెలిసిన మృదంగ విద్వాంసుడు. ఆబాలగోపాలానికీ తెలిసి మృదంగ విద్వాంసులకే ఆదర్శమైన వాద్యం ఆయనది.
ఓ రోజు - పాల్ఘాట్ మణి అయ్యర్‌లోని ప్రత్యేకత ఏమిటని వోలేటి గారినడిగాను. గానం చేస్తోంటే, ఎక్కడ నిశ్శబ్దాన్ని పాటించాలో తెలిసిన విద్వాంసుడు’ అన్నారు - వాయించకుండా ఉండటమే విశేషమన్నమాట. నిశ్శబ్ద క్రియల్లో భావముందని నమ్మి నిరూపించిన విద్వాంసుడు మణి అయ్యర్. అరియక్కుడి రామానుజయ్యంగార్, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్, చెంబై వైద్యనాథ భాగవతార్, అలత్తూరో సోదరులు, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, డి.కె.పట్టమ్మాళ్, కె.వి.నారాయణ స్వామి, డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి ఎందరికో మృదంగ సహకారమందించి చరిత్ర ప్రసిద్ధుడై మృదంగ వాద్యం కోసమే జన్మించిన అరుదైన విద్వాంసుడు. ఆ రోజుల్లో మణి అయ్యర్‌తో కచేరీ, అదో ప్రత్యేకత. మహా విద్వాంసులతో సరిసమాన స్థాయిలో అఖండ కీర్తి ప్రతిష్టలను దక్కించుకున్నా, అహంకారాన్ని దగ్గరకు చేరనివ్వలేదు. అవార్డుల కోసం, రివార్డుల కోసం వెంపర్లాడలేదు. కీర్తికండూతి లేదు. సాదాసీదాగా తెల్లని లుంగీ, జుబ్బాతో, పైన చిన్న కండువాతో ఎంతో హుందాగా, ఠీవిగా మృదంగంతో ఆశీనుడై కనిపించేవాడు.
వేదికపై తనకు తాను ప్రత్యేకంగా గుర్తింపబడేలా, వేషధారణ వుండేది కాదు. ఇంటి గుమ్మానికి డోర్ కర్టెన్‌లు వేలాడినట్లు ముఖాన్ని కప్పేసేలా చిత్రవిచిత్ర రీతుల్లో కేశాలంకరణతో ప్రసన్నంగా కూర్చున్న వారిని భయపెట్టేలా వెర్రిమొర్రి వేషాలేమీ వుండేవి కావు. అన్నింటికంటె అతి ముఖ్యమైన ఆలోచింపతగిన విషయం. కచేరీలో మైకు లేకుండా మృదంగం వాయించేందుకు ఇష్టపడిన చాలా అరుదైన విద్వాంసుడు. మృదంగ వాద్య విశేషం చెప్తూ - కోమలమైన నాదంతో సున్నితంగా ఉండాలి. మృదంగానికో హృదయముంది. సహజసిద్ధమైన ధ్వని విశేషాన్ని, మైకులు పాడుచేసి, కృత్రిమ ధ్వనిని పుట్టిస్తాయి. అది నాకెంత మాత్రమూ ఇష్టముండదని నిర్భయంగా చెప్పిన ధీశాలి మణి అయ్యర్.
టార్చిలైటు పెట్టి వెదకినా ఈవేళ అటువంటి విద్వాంసులు కనపడరు. కీర్తన సాహిత్యం వినిపించకుండా వాయించటమే కొందరి ప్రత్యేకత.
మన ఆంధ్రదేశంలోనూ, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని మృదంగ విద్వాంసులెందరో మణి అయ్యర్‌ను ఆదర్శంగా భావించేవారున్నా ఆచరణ దగ్గరకొచ్చేసరికి అహం అడ్డువచ్చి తలుపు చెక్కల్ని బాదినట్లు, భూ నభోంతరాళాలు దద్దరిల్లేలా వాయిస్తే గాని, గుర్తింపు ఉండదని భావించే మృదంగ వాద్య విశారదులకు ఆస్తెక్యానుభూతి. లేకపోతే వినబడేది కేవలం ధ్వనియే. నాదం కాదు.

- మల్లాది సూరిబాబు 90527 65490