అమృత వర్షిణి

ముఖేముఖే సరస్వతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతం కొందరికి భోగవస్తువు. చేతులూ కాళ్లూ ఆడిస్తూ నోటికొచ్చిన పాటలేవో పాడుతూ నృత్య వినోదాలతో మైమరిచిపోయే వారికి, అదో కాలక్షేప విద్య.
దానికి మరే ఇతర ప్రయోజనమంటూ ఉండదు. సాహిత్యం, సంగీతం శాస్తబ్రద్ధంగా వుండాలనే నియమాలేమీ ఉండవు. ఆ సంగీతం కేవలం ‘్ధ్వని’ ప్రధానమే. అంతే. వాటికి రంగు, రుచి ఏమీ ఉండవు. మనసులోకి ప్రవేశించవు. చెవితో విని వదిలేయటమే.
కానీ భగవంతుడు ప్రాణులకు అనుగ్రహించిన వెల కట్టలేని వస్తువు నాదం. ప్రణవ నాదం. లోకంలో బ్రహ్మానందాన్నివ్వగలదేదైనా ఉందంటే ఇదొక్కటే.
గాయకులే కాదు. అలనాటి కవులు కూడా ఈ నాదానుభూతి రహస్యం తెలిసినవారే. అల్లసాని పెద్దన నుంచి ఆముక్తమాల్యద రచించిన రాయలు వరకూ వారివారి కావ్యాలలో విధిగా సంగీత ప్రసక్తి కనిపిస్తుంది చూడండి. కొందరైతే కొన్ని రాగాల పేర్లను కూడా చొప్పించారు. బాగా పాడగలిగిన కవులున్నారు. సంగీత సరస్వతి స్వరూపం ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తుంది. స్వరాలను దేవతలుగా భావించి ఉపాసనా మార్గంలో గానం చేసేవారికి లభించే మాటలే మంత్రాలు - మంత్రాధీనం దైవతం. దైవానికి అత్యంత సమీపంగా ఉండే ముప్పైమూడు కోట్ల దేవతల మనోభావ మెరిగి, భావ రాగ తాళ సమన్వితంగా పాడేవారంతా నా ఆత్మీయులే నన్నాడు త్యాగయ్య. (ఎందరో మహానుభావులు)
నినె్న కాని పలుకనేరవు మా జిహ్వ
లొల్ల ననుచు బలుకనోడ, నీవు
మా మనంబు లేల మఱపి దొంగిలితివి
యేమి సేయు వారమింక కృష్ణ!
అంటూ గోపాలకృష్ణుణ్ణి వదల్లేని గోపికలతో అందంగా ఆడుతూ పాడుతూ వ్రేపల్లె వీధుల్లో తిరిగే ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు కృష్ణయ్య అన్నమయ్య ఊహాలోకంలో దర్శనమివ్వగా వెలువడిన ఒక కీర్తన ఎంత జగత్ప్రసిద్ధమైందో మీకు తెలుసు. ఒక పాట ప్రసిద్ధమవటానికి అనేక కారణాలుంటాయి.
ప్రధాన కారణం ‘అందులో నిండిన రాగం’ మాటల చుట్టూ ఆవరించిన రాగం నిండిన నాదం ఒక్కటే మనసును లాగి కూర్చోపెట్టి వినేలా చేస్తుంది.
సాహిత్యానికి తగిన రాగం జతకలిపి పాడటం, చిన్న విషయం మాత్రం కాదు. అదో ప్రజ్ఞ. సంగీత జ్ఞానం బొత్తిగా లేనివాళ్లూ పాడతారు. పాడిస్తూంటారు. అదీ ప్రజ్ఞే.
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణికము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడులోకాల గరుడపచ్చ పూస
చెంతల మాలో నున్న చిన్ని కృష్ణుడు ॥
రతికేళీ రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము
గతియై మమ్ము కాచే కమలాక్షుడు ॥
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము
పాల జలనిధిలోన పాయని దివ్యరత్నము
బాలుని వలె తిరిగీ పద్మనాభుడు ॥
సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి తిరుపతి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా వుండే రోజుల్లో అన్నమయ్య కీర్తనలకు స్వరరచన చేసిన వాటిలో ఈ సంకీర్తన ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.
‘కురంజి’ రాగంలో స్వరపరిచారు.
29వ మేళకర్త శంకరాభరణం రాగానికి జన్యం ఈ కురంజి రాగం.
మంద్ర నిషాదం నుంచి దైవతం వరకే సంచారం.
అన్నమయ్యకు అందరూ సమానమే. తాను కొలిచే వేంకటేశ్వరుణ్ణి సకల దేవతా స్వరూపుడుగా భావించాడు.
ముఖ్యంగా కృష్ణుడిపై ఆయన రాసినవి ఎక్కువ.
గోపికల పాలిట కొంగు బంగారం ఆ కృష్ణుడు - అరచేతి మాణికం.. అన్నాడు.
ధవరోజు, జంఝాటి, కురంజి రాగాన్ని పోలిన రాగాలు - నృత్యానికి అనువైన సంకీర్తన. ఈ సంకీర్తనకు చాలా మంది నాట్యానుసరణ చేశారు. మీరూ చూసే వుంటారు.
పోతన భాగవతానికి ప్రభావితం కాని వారెవ్వరూ లేరు.
నారాయణ తీర్థుల వారైతే భాగవత దశమ స్కంధానికే అంకితమైన మహాభక్తుడు. వాగ్గేయకారుడు, యోగి. ‘శ్రీకృష్ణ లీలా తరంగిణి’ ఒకటి చాలు. గోపాలకృష్ణుని లీలా వైభవాన్ని మనసారా దర్శించవచ్చు.
పద్యమైనా, పాటైనా, పసందుగా చెవికి చేరేలా చేసేవి సుస్వరంతో కూడిన స్వరాలే.
ఏ సాహిత్యానికి ఎటువంటి రాగం నప్పుతుందో తెలియాలంటే రాగాల స్వరూప స్వభావాలు తెలియాలి. కొన్ని విషాదభరితమైన రాగాలుంటాయి. మరికొన్ని ఆహ్లాద వాతావరణాన్ని ప్రతిబింబించేవీ వుంటాయి - మూడ్‌ని బట్టి ఒక్కోసారి ఇవి తారుమారవ్వచ్చు.
ఆకాశవాణి కార్యక్రమాలు విషాదభావాన్ని సూచించే ‘శివరంజని’ రాగంలో చేసిన వాద్య సంగీతంతోనే ప్రారంభవౌతాయి. సాహిత్యం చూడగానే ఏర్పడే ఆలోచన రాగ నిర్ణయం చేస్తుంది. ఒకసారి నేదునూరితో ఇంటర్వ్యూ చేశాను. ఒక రాగాన్ని ఎంచుకుని కనీసం ఒక వారం పదిహేను రోజులపాటు ఆ రాగంలోని వర్ణాలు మొదలుకొని లభించే ప్రసిద్ధ రచనన్నిటినీ పాడి, పాడి అనుభవానికి తెచ్చుకునేవాణ్ణి.
అలా సాధన చేయగా చేయగా ఆయా రాగాలు ఘనీభవించి నాకు అందుబాటులో వుండేవి. ఆ రాగాలతో ఏర్పడ్డ బాంధవ్యం ఎన్నటికీ నిలిచిపోతుంది.
అలా ఒక్కో రాగంలో ఎనే్నసి సంగతులు పాడవచ్చునో బాగా అనుభవానికి వచ్చేది.
నేను గతంలో చేసిన ‘ఒకపరికొకపరి ఒయ్యారమై, భావములోన బాహ్యమునందున’ వంటి కీర్తనలన్నీ అలా చేసినవే’ అంటూ నేదునూరి.. అన్నమాచార్య కీర్తనలు కంపోజింగ్ గురించి చెప్పారు. ‘ఆరోహణ అవరోహణ ఒక్కటే తెలిస్తే సరిపోదు. రాగం అనుభవానికి రావాలి. పదిసార్లు పాడగా రాగం మనసుకు పట్టాలి- మాటలకు భావాన్నిచ్చే సంగతులన్నీ గూడు కట్టుకుని ఉంటాయి.
అన్నమయ్య ఒక వేదాంతి. ఒక తత్త్వవేత్త. జీవిత సారాన్ని వడబోసి తన కీర్తనల్లో పొందుపరిచిన మేధావి.
ఆయన సాహిత్యం ఎంతో లోతైన భావాలతో నిండి, ఏ ఇతర వాగ్గేయకారులతోనైనా సరితూగేలానే ఉంటుంది.
తేలికపాటి బాణీలతో పాడి ప్రచారంచేస్తే ఆయన గౌరవాన్ని తగ్గించిన వాళ్లవౌతాం. ఆ పాటలకు సంగీత గౌరవం అత్యున్నతంగా ఉండాలి.’
అన్నమాచార్య కీర్తనలు వేడుక కొద్దీ పాడేవి కావు. అవి సాక్షాత్ శ్రీ వేంకటేశ్వరుణ్ణి అన్నమయ్య స్వయంగా పూజించి పాడుకున్న సంకీర్తన సుమా అన్నారు.
ఆనందాన్ని ఏదో సందర్భంలో అందరం అనుభవిస్తూనే ఉంటాం. ఆ ఆనందాన్ని బయటికి చెప్పాలంటే అక్షరాలు మనకు లొంగవు.
24 గంటలూ స్వామిని వదలకుండా సంకీర్తనా యజ్ఞమే జీవితంగా గడిపిన అన్నమయ్య జీవితంలో అనుక్షణమూ ఆనందానే్న అనుభవించాడు. జాతకరీత్యా గ్రహాలు చెడు స్థానాల్లో వుంటే అవి శాంతించడానికి నవరత్నాలను ధరిస్తే మంచిదని పెద్దలంటారు.
మాణిక్యం, ముత్యం, పగడం, గోమేధికం, పుష్యరాగం వంటి అపురూపమైన రత్నాల రాశిగా కృష్ణుణ్ణి వర్ణించిన అన్నమయ్య కురంజి రాగ కీర్తన నేదునూరి వారు స్వరపరచిన వందలాది కీర్తనలలో ఆణిముత్యం లాంటిది. ఆరోహణ అవరోహణలో సప్తస్వరాలే అయినా ఒక రాగం నుంచి మరో రాగాన్ని వేరుచేసేవి స్వరస్థానాలే. ప్రతిభ అంతా ఆ స్వరాలను పలికించటంలోనే ఉంది. ఆ విద్య స్వాధీనమైనవారే విద్వాంసులుగా పరిగణించబడతారు.
పూర్తిగా ఆహ్లాదభరిత సన్నివేశంలో, ఆనందాతిశయంతో అన్నమయ్య ముద్దులొలికే మాటలను మధువులో రంగరించి ముంచి నోటికి అందించిన సంకీర్తన ఇది.
సంప్రదాయ సంగీతంలో రాగ ప్రసక్తి వస్తే స్ఫురించే పేర్లు వెంకట మణి, రామామాత్యుడు, శారంగదేవుడు. మనోహర నామాలతో రాగ నిర్ణయం చేసి 72 మేళకర్త రాగాల స్వరూపం చూపించిన వేంకటమణి.
రాగ సంచారాలను తన గీతాలలో నిక్షిప్తం చేసి లోకప్రసిద్ధుడైన వెయ్యి గీతాల పైడాల గురుమూర్తి శాస్ర్తీ నిత్య స్మరణీయులు.
ఒకే రాగం అనేక రూపాల్లో కనిపిస్తుంది అనేందుకు వివిధ వాగ్గేయకారుల రచనలే సాక్ష్యం - సృజనాత్మకతకు మార్గం చూపిన మహనీయులున్నారు.
కురంజి రాగంలోని అన్నమాచార్య కీర్తన పూర్తిగా ఆనందభరితమైన గోపాల బాలుణ్ణి మన కళ్లెదుట నిల్పిన రచన గురించి ఆ పాటకు బాణీ కట్టిన నేదునూరిని తలుచుకున్నాం. ఈ పాట, 1958లో ఘంటసాల నోట ఎప్పుడో మద్రాసు ఆలిండియా రేడియోలో లలిత సంగీత విభాగం వారి (లైట్ మ్యూజిక్ ఆర్కెస్ట్రా) వాద్య బృందంతో విన్న పాట.
టి.ఎస్. రికార్డుగా (ట్రాన్స్‌స్క్రిప్షన్ సర్వీస్) విడుదలైనది. సంప్రదాయ సంగీత గౌరవం చెడిపోకుండా లలిత సంగీతం ఎలా ఉండాలో, ఎలా పాడాలో దానికి ఆర్కెస్ట్రా ఎవరెవరుండాలో, ఆ వాద్య బృందం ఏమి వినిపిస్తే పాట మరింత హృదయానికి చేరువౌతుందో తెలిసిన సంగీత దర్శకులు, గాయకులు బ్రతికిన కాలమది. ఆకాశవాణిలో పాడితే పాపులరై 1959లో హెచ్‌ఎంవి వారు గ్రామఫోన్ రికార్డుగా విడుదల చేశారు.
ఇప్పుడా లలిత సంగీతం ఎవరు వింటారు? ప్రజల్లో ఆ పాటలు వినే ఉత్సాహం ఇంకా ఉందంటారా? అంటూ ప్రతి విషయాన్నీ ప్రజల మీద శ్రోతల మీద నెట్టేస్తూంటారు.
శుద్ధంగా ఒళ్లు వంచి, కష్టపడి నేర్చుకుని, తను పాడిందేమిటో గాయకుడికి బాగా అర్థమై ఆనందిస్తూ పాడితే వినకుండా లేచిపోయే వారెవరూ ఉండరు.
లోపం వినేవాళ్లలో లేదు. పాడాలనే ఉత్సాహమే కరువైంది.
పాడగలిగే సమర్థత లేకకాదు. ఆ రుచి లేదు. పొందికైన మాటలతో పసందైన పాటలు గౌరవంగా రాసే కవులెందరు లేరు?! మన దృష్టిలోనే ఉంది సృష్టి - నేదునూరి కురంజి రాగంలో స్వరపరిచి ఆనందమయ లోకాల్లో విహరిస్తూ పాడిన ఇదే రాగాన్ని ఆవేదనా భరితమైన పాటకు జోడించి పాడి శెహభాష్ అనిపించుకున్న ప్రముఖ నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు.
ఇందులో ‘కురంజి’ రాగ స్వరాలెలా పొందికగా సాహిత్యాన్ని అల్లుకున్నాయో వింటే తెలుస్తుంది. వీలు చూసుకుని వినండి. సంగీత జ్ఞానం కలిగి స్వయంగా సొంతంగా సహజంగా పాడే పాట ఎలా ఉంటుందో, ఉండాలో తెలుస్తుంది. భావ ప్రకటన కోసం ఒక రాగంలోని స్వరాలను యథాతథంగా పాడకుండా, ఇతర స్వరాలను ప్రయోగించే వీలు లలిత సంగీతంలో ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది. రావులపర్తి భద్రిరాజు లలిత సంగీత ప్రియులకు బాగా తెలిసిన పేరు. రేడియో లలిత సంగీతం పాడేవారు. అప్పట్లో ఈయన పాట ఏదో ఒకటి పాడటం అలవాటే. లోతైన భావం, ఆ భావాన్ని మరింత గంభీరంగా మనముందుంచిన ఘంటసాల. ఇద్దరూ ఇద్దరే.
‘జీవితమంతా కలయేనా ఈ/ జీవితమంతా భ్రమయేనా
పుట్టిన రోజున వేడుకలా/ గిట్టిన రోజున ఏడుపులా
ఎంత చిత్రమీ మానవజన్మ జీవిత/ ఏమిటో ఈ జగమింతేనా
ఆశలతోనే బ్రతుకంతా/ బాసలతోనే మనవలెనా
ఆవంతైనా జీవితాన/ ఆనందానికి తావే లేదా జీవిత
మదిలో రేగిన తుఫానులో/ హృదిలో పొంగిన నెత్తురులో
మాయ మృత్యువు కౌగిటిలోబడి/ మానవుడంతము కావలెనా జీవిత
అప్పట్లో సినీ నేపథ్య గాయకుడుగా బాగా పేరు తెచ్చుకున్న ఘంటసాల కేంద్రంగానే పాటలుండేవి. అటువంటి సంగీత దర్శకులే వుండేవారు. కరకర ఢమఢమ శబ్దాలతో, ఏవేవో మాటలు అల్లేసి, కుప్పిగంతులు వేసే వారికి వెనక ఉండి పాడే పాటలు, ఆఁ! వినకేం చేస్తారు? ఎవరి కోసం వింటారు? అనే ధోరణిలో వుండేవి కావు. ఆయన తప్పుకున్న తర్వాతే అన్ని రకాల మార్పులూ ఏర్పడ్డాయి.
‘ఇప్పుడు వినకేం చేస్తారు? ఒక రాగంలో ఎనె్నన్ని భావాలు పలికించవచ్చునో తెలియటం ఒక ప్రజ్ఞ.
పాండిత్యం కూడిన ప్రజ్ఞ కెప్పుడూ ప్రజలు పట్ట్భాషేకం చేస్తారు అనటానికి నిదర్శనం ఈ సాధారణమైన లలిత గీతం.
పాటలోని మాటలన్నీ అర్థం చేసుకోగలిగినవే. అనుభవించి ఆనందింప వలసినవే. అచ్చమైన తెలుగు పదాలే. రాగభావ సమన్వయంతో మనసుపెట్టి మధురమైన కంఠంతో పాడితే ఇటువంటి పాటలు, ఎన్ని పనులైనా మానుకుని వింటాం.
వినాలనే హృదయముంటే చాలు - అప్పుడు వినిపించే గాయకుడు, విన్న శ్రోత ఇద్దరూ ధన్యులే.
-జుగుప్స కలిగించని కంటికింపైన కమనీయ దృశ్యాలు ఆప్యాయంగా, ఆదరిస్తూ
-విస్తట్లో అలా వడ్డించగానే నోరూరించే రుచికరమైన పదార్థాలతో నిండిన భోజనం
-వినబడిన తక్షణం స్థిమితంగా కూర్చుని వినాలనిపించే వీనులవిందైన గానం
ఈ మూడూ ఈవేళ గగన కుసుమాలే.

- మల్లాది సూరిబాబు 90527 65490