అమృత వర్షిణి

ఉత్తమ వాగ్గేయకారులు.. ఉర్రూతలూపిన కీర్తనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల సమూహాన్ని ఒక్కోసారి తేరిపార తదేక దృష్టితో చూడాలనిపిస్తుంది. ఆ పక్షికున్న స్వేచ్ఛ నిజంగా మనిషికి లేదనిపిస్తుంది.
మనసుకు ఎక్కడ వాలాలనిపించాలో హాయిగా ఎంతసేపైనా కోయిల కూర్చోగలదు. పాడుకోగలదు. ఆకలేస్తే నాలుగు గింజలెక్కడో ఏరేసుకుంటుంది. మళ్లీ తిరుగుతుంది. ఎగురుతూనే ఉంటుంది. స్వేచ్ఛగా పాడే గానం అలా వుండాలి. సకల చరాచర సృష్టికీ కారణమైన పరమేశ్వరుడి లీలా విశేషాలను పొగుడుతూ మైమరచి పాడేదే పాట. గానం పుట్టిందే దీని కోసం.
ఈ విశాల విశ్వంలోని సోయగాలను తిలకించి పులకించగలవాడు ఒక్క మనిషే! ఏ ప్రాణికైనా భూమి మీద తిరిగే విహంగంలో విహరించే ఏ పక్షైనా పొగడగలుగుతుందా? ఆనందించినట్లు తెలుస్తుందా? ఒక సూర్యోదయమున్నట్లు, మరో సూర్యోదయం ఉండదు. ఒక మొక్క వున్నట్టు మరోటి వుండదు. ఒక చెట్టున్నట్టు మరో వృక్షం కనపడదు. ఒక పక్షి వున్నట్లు కూసినట్లు, మరో పక్షి కూయదు.
ఒక గాయకుడు పాడినట్లు మరో గాయకుడు పాడడు.
పక్షి కాళ్లకు దారం కట్టి మనకు కావలసిన చోట తిరిగే ఏర్పాటు చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది? ఓ చిలుకను పంజరంలో పెట్టి చూడండి. దానికది పెద్ద శిక్ష. గుడ్డుదశ, లార్వా, ప్యూపా దశలు దాటితేనే గాని, సీతాకోక చిలుక సప్తవర్ణాలతో దర్శనమివ్వదు.
పాపం ‘పసిగుడ్డు’ కదా’ జాలిపడి అన్ని దశలూ దాటకుండా దాని కాళ్లకు దారం కట్టేసి ఎగరమంటే దానివల్ల అయ్యే పనేనా?
కడుపుతో ఉన్న తల్లి కనక మానుతుందా? లోకంలో ప్రతిదానికీ ఒక ప్రణాళికను దైవం సిద్ధం చేసే ఉంచాడు. ఆయన అనుకున్న ప్రకారమే అన్నీ జరుగుతాయి. మనల్ని సలహా అడిగే అవసరం ఆయనకెప్పుడూ ఉండదు.
అందుకే భగవంతుడికే ఆత్మసమర్పణ చేసుకోగలం.
మరెవ్వరికీ ఆ అర్హత ఉండదు. నటుడు గానో, నాయకుడిగానో, గాయకుడిగానో, శిల్పిగానో తయారవ్వాలన్నా నిర్ణయం ఆయనదే. మనం అనుకున్నా వీలుపడదు.
గురువును చూపించేదీ ఆయనే - సద్గురువుతో సంబంధాన్ని పటిష్టం చేసి పైకి లాగి కీర్తి లభించేలా చేసేదీ పైవాడే. ఆయన సంకల్పించాలి.
మనం చేయగలిగింది మనం చేసేస్తే మిగిలినది భగవంతుడు పూర్తి చేస్తాడనటానికి ఉదాహరణలు కోకొల్లలు. ఏ విద్య లొంగాలన్నా ఉబలాటం, ఉత్సాహం ఒక్కటే సరిపోదు. అర్హతలున్నాయో లేదో ఎవరికి వారు తెలుసుకోవాలి. ‘మాయ’ బాగా కప్పేస్తే మాత్రం తెలియదు. అంతా తెలుసుననుకోవటమే పెద్ద మాయ.
నిర్మొహమాటంగా అటు గురువైనా చెప్పాలి. శిష్యుడైనా అడగాలి. సద్గురువైన వాడు మాయ మాటలు చెప్పడు. చెప్పకూడదు. పట్టుదలతో నేర్చుకోవాలన్న నిజాయితీ శిష్యుడికి విధిగా వుండాలి. గురువును నమ్మిన శిష్యుడిలో దోషాలు సవరించుకొనే నిజాయితీ ఉండాలి. అందుకే గురువును చిల్లగింజ, పరుసవేది భ్రమరాలతో పోల్చాడు త్యాగరాజు. దేవాలయాల్లో అర్చకుడు శటారికి తలవంచి నమస్కరించినట్లుగా శిష్యుడుంటే ఏ విద్య అయినా లొంగి తీరుతుంది.
కొంత తెలియటం, మిగతాదంతా మెరుగులు దిద్దటం సంగీతంలో వుండదు. వీరివల్ల లోకానికి మేలు జరగాలనే ప్రణాళిక దైవానికి ముందు ఏర్పడితే, సద్గురువులకు తగిన శిష్యులు విధిగా లభిస్తారనటానికి మహాపురుషులు ఇంకెందరో యోగులు సంగీత విద్వాంసులే ఉదాహరణ. మాటామంతీ లేక వౌన స్వామిగా పిలువబడే భగవాన్ రమణ మహర్షి చేత మాట్లాడించి వౌన వ్రతం మానిపించిన తపశ్శాలి ‘కావ్యకంఠ గణపతి ముని’.
‘నాయనా’ అని ఆప్యాయంగా భగవాన్ చేత పిలిపించుకున్న వాడాయన. ఒక్కసారి చూడగానే యోగ్యతా లక్షణాలను గుర్తించగలిగిన గురువులుంటారు.
నిజాయితీ గల సద్గురువులైతే అయోగ్యులైన శిష్యుల్ని సాధ్యమైనంత దూరంలోనే ఉంచుతారు. మాయ గురువులు పుట్టి ముంచుతారు.
పుణ్యభూమిగా పిలువబడే మన దేశం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం ఈ సచ్చీలురైన సద్గురువులు, వారికి తగ్గ శిష్యులే.
శుద్ధమైన సంగీత సంప్రదాయం విశ్వవ్యాప్తమవటానికి కారణం కూడా ఈ పటిష్టమైన గురుశిష్య సంబంధ బాంధవ్యాలే - ఏ మాటకా మాటే. కవిత్వమైనా, సంగీతమైనా కడవల కొద్దీ తాగేసేది కాదు. నిలకడగా, నిశ్చలంగా నిర్మలమైన మనస్సుతో వొంటపట్టించుకోవలసినదే.
త్యాగరాజ శిష్య వర్గంలో ఆకుమళ్ల వెంకట సుబ్బయ్యర్ చాలామంది శిష్యుల్ని తయారుచేశాడు. ఆ రోజుల్లో మహావైద్యనాథ అయ్యర్‌తో సమానమైన స్థాయి కలిగినవాడు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, రామ్నాడ్ శ్రీనివాస అయ్యంగార్ పట్నం శిష్యుడే. ఇద్దరూ ఇద్దరే.
త్యాగరాజు కీర్తనలు ఎలా వుండేవో తెలియాలంటే ఆ రోజుల్లో ఆధారం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ పాటే ప్రామాణికం అనుకునేవారుట. మనకు స్వతంత్రం రాని రోజుల్లో ప్రభువుల సంస్థానాల్లో వుండే వాద్యబృందాల పాశ్చాత్య సంగీత వరుసల ప్రభావం ఈ విద్వాంసులపై బాగా వుండేదనటానికి ఈ కీర్తన వినే ఉంటారు.
రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ/ రామరాజు రాజేశ్వర॥
అఘ మేఘ మారుత శ్రీకర/ అసురేభ మృగేంద్ర వర జగన్నాథ॥
జమదగ్నిజ గర్వ ఖండన/ జయ రుద్రాది విస్మిత భండన
కమలాప్తాన్వయ మండన/ గణితాద్భుత శౌర్య శ్రీ వేంకటేశ॥
-సంగీత ప్రియులు ఈ కీర్తన వినే వుంటారు. పాశ్చాత్య సంగీత బాణీని పోలి వుండే కీర్తన ‘పట్నం’దే.
త్యాగరాజాది మహనీయులు తర్వాత మూర్తిత్రయం వారి అడుగు జాడల్లో నడిచిన చాలామంది వాగ్గేయకారులు తెలుగు భాషలో బాగా పాండిత్యం సంపాదించి తెలుగులోనే కీర్తనలు రాశారు.
వీరిలో అగ్రగణ్యుడు పట్నం సుబ్రహ్మణ్యం. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలలో పాశ్చాత్య బృందం వినిపించేవన్నీ మూర్తిత్రయం వారి కీర్తనలే.
రెండు క్లారినెట్‌లు, ట్రంపెట్‌లు ఇతర పాశ్చాత్య లయ వాద్యాలతో, ఈ కీర్తనలు మహాపసందుగా వుండేవి. నిజానికి రహదారి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, మైకులు కూడా లేని ఆ రోజుల్లో పెట్రోమాక్సుల వెలుతురులో ఎంతో శోభాయమానంగా జరిగే ఊరేగింపుల్లో కనిపించే వాద్య బృంద సంగీతం కోసం తండోపతండాలుగా జనం పోగై వెళ్లి వినేవారుట. మరోవైపు ‘నువ్వా, నేనా’ అనేలా కొమ్ములు తిరిగిన నాదస్వర మేళం ఒకరితో మరొకరు పోటీ పడుతూ కీర్తనలు వినిపిస్తోంటే, రాత్రి తెల్లవార్లూ జనం విని, ఇళ్లకు వెళ్లేవారు. మీరెవరినైనా అడగండి. మన కంటే దక్షిణాదిలో సంగీతం బాగా వింటారండీ. మనకా సీను లేదు’ అని చిరునవ్వులు ఒలకబోస్తూ గర్వంగా చెప్తూంటారు - మన తెలుగు కీర్తనలు, తెలుగు భాష తెలియకపోయినా వాళ్లు వింటున్నారని తెలిసినా, ఏ ప్రతిస్పందన లేని స్వభావం మనది.
సందర్భం వచ్చిందని మనవి చేసాతను. తమిళనాడులో ఒకప్పుడు ‘తమిళ ఇసై’ ఉద్యమం లేవదీశారు. ఎవరో కాదు ‘్భరతరత్న’ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఆమె భర్త సదాశివం. అప్పట్లో బాగా జన బాహుళ్యంలో ప్రసిద్ధమైన పత్రికలు. కల్కి కృష్ణమూర్తి రాసే వ్యాసాలు, తమిళ కీర్తనలు, సాహిత్యం బాగా ప్రచారం కావాలనీ, తెలుగులో వున్న త్యాగరాజ కీర్తనల ప్రచారం జోరు తగ్గాలని కూడా వాంఛించారు. అలాగే జరిగింది. మహా విద్వాంసులు చాలామంది ఈ ఉద్యమాన్ని సమర్థించారు కూడా. అందులో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి కూడా ఉంది. సంగీత కచేరీలలో తమిళ కీర్తనలే పాడాలి -అనేది వారి నినాదం.
ఉద్యమం ఊపందుకుంది. పాపనాశం శివన్, ఊత్తుక్కాడు సుబ్బయ్యర్, గోపాలకృష్ణ భారతి, వగైరా వగైరా తమిళ రచనలన్నీ వినిపించటం మొదలైంది. 4 ఏళ్లపాటు మద్రాసు మ్యూజిక్ ఎకాడెమీ సుబ్బులక్ష్మిని పిలవలేదు కూడా. ఆమె కూడా తమిళ కీర్తనలే కచేరీల్లో పాడేది మరి. ఇంత జరిగినా, ఉద్యమాలు చేసినా శరభోజి (2) అనే మహారాష్ట్ర ప్రభువు ఏలుబడిలో వుంటూ, రాజాశ్రయం కోరకుండా, చుట్టూ తమిళం, మరాఠా భాషలు మాట్లాడే ప్రజల మధ్యలో వుండి ‘తెలుగు మాతృభాష’ వదలకుండా వేలాది కీర్తనలు రాసి ‘నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా’ అని నిర్భయంగా ‘దేహి’యనకుండా బతికి, హాయిగా రామాంకితంగా పాడుకున్న త్యాగరాజ కీర్తనల మీద పిచ్చి అభిమానం అక్కడి తమిళ సోదరులకు ఒక్క వీసమెతె్తైనా ఈ రోజుకీ తగ్గలేదు తగ్గదు కూడా.
భాషాభివృద్ధి అంటే తెలుగులో మాట్లాడటం, తెలుగులోనే పోట్లాడుకోవటం, వీధుల్లో కనిపించే బోర్డులన్నీ తెలుగులోనే రాయటం ఒకటేనా? కాదు. ప్రపంచంలో ఏ 10 మంది కవులనైనా తీసుకోండి - వాళ్ల ప్రక్క నిలబడగల తెలుగు కవులున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే మన కళలు, సంగీతం, మన సాహిత్యం, నృత్యం మరుగున పడిపోకుండా ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని మరచిపోయే పరిస్థితి దాపురించకుండా జాగ్రత్త పడటం. నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ వంటి ప్రాచీన కవులు, పోతన భాగవత పద్యాలు, రామాయణ శ్లోకాలు, ఇలా మన తెలుగు ప్రాచీన కవులూ, వారి రచనలూ బీరువాల్లోనే మగ్గిపోకుండా, మన ఎదురుగా మన చెవికి వినిపించేలా చేయటం, అవసరం కాదా? మన పూర్వీకులు మనకందించిన జానపద కళారూపాలు, మరుగున పడిపోకుండా కాపాడుకోవటం కూడా మన భాషా సంస్కృతుల అభివృద్ధిలో ఒక భాగమే.
మనిషికి మాయ కబుర్లు తలకెక్కినంత సుళువుగా మంచి మాటలు ప్రవేశించవు.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వారిని ఊళ్లో నుంచి తరిమేయాలనిపిస్తుంది. కాని నిజాన్ని దాయటం అనుకున్నంత తేలిక మాత్రం కాదు. భారత, భాగవత రామాయణాది మహాకావ్యాలే ఇంతకాలం మనల్ని నడిపిస్తూ వచ్చాయన్న సంగతి మనకు తెలిసినట్లుగా, మన భావితరాలకు తెలియద్దా?
మనం అలవాటు చేసుకున్నదే మన సంప్రదాయమైంది. అందుకే ఎనే్నళ్లైనా ఈనాటికీ రామాయణ భారత భాగవతాది పురాణాలు ప్రవచనాలుగా వినిపిస్తోంటే తండోపతండాలుగా జనం కూర్చుని వింటున్నారు. త్యాగరాజ, భద్రాచల రామదాసు కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు, ఉపన్యాసాలతో జోడిస్తే ఆసక్తిగా వింటున్నారు. ఆ కీర్తనలలోని పరమార్థాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. ఈ వాతావరణం ఇంకా పెరగాలి.
పవిత్రమైన కీర్తనలన్నీ అయస్కాంతాల్లాంటివి. అయస్కాంతం ఇనుప ముక్కను ఏం చేస్తుంది? మరో అయస్కాంతంగా చేసి తీరుతుంది. అలాగే ఈ పవిత్ర భూమీద పుట్టిన యోగులు, ఋషులు వాగ్గేయకారుల రచనలు కూడా ఆ ప్రభావాన్ని కలిగే ఉంటాయి.

--మల్లాది సూరిబాబు 90527 65490