అమృత వర్షిణి

రాగసుధా రస పానము చేసి రంజిల్లవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 4 ఘంటసాల జయంతి
*
అమృతవర్షిణి పాఠకుడైన సంగీతాభిమాని నాలుగు రోజుల పాటు మా ఇంటికి వస్తూ కూర్చుంటే చెప్పిన మాటల సారాంశమే యిది.
‘నేనో సంగీతాభిమానిని. నాదం, రసం, రాగ సౌందర్యం లాంటి మాటల అర్థం నాకేమీ తెలియదు. కానీ శుద్ధమైన సంప్రదాయ సంగీతం అంటే ప్రాణం. అందులో ఏదో హాయిని అనుభవిస్తూంటాను. నాకు తెలియక అడుగుతాను. సినిమాకు సంగీతం కూడా ముఖ్యమే కదా? పాటలు కంపోజ్ చేసేవారికీ, పాడేవారికీ సంగీత జ్ఞానముంటుంది కదా? ఇక్కడా అక్కడా వినబడే స్వరాలు, రాగాలు ఒకటే అయినప్పుడు, సినిమా సంగీతం ఎందుకంత గందరగోళం (విని) అనిపిస్తోంది? శాస్ర్తియ సంగీతంలోని ప్రశాంతత ఆ పాటల్లో ఎందుకు కనిపించటం లేదూ? మాటలు కూడా తెలియనంత స్థాయిలో రణగొణ ధ్వనుల మధ్య ఎందుకు పాడుతున్నారు? అని ఎంతో అమాయకంగా అడిగాడు.
‘ఈ సందేహం మీకే కాదు. చాలామందికి ఉంటుంది. పైకి చెప్పరు. సమాధానం తెలుసు. కానీ మీరు నా ద్వారా విందామనుకున్నారు. అంతే’ అని తీరికగా, వీలైతే ఇంటికి రమ్మని చెప్పాను.
మిగతా అన్ని కళలలా ‘సంగీతం కూడా ఓ కళ. ప్రజ్ఞ వేరు. పాండిత్యం వేరు. ఈ రెండూ వున్న గాయకులు చాలా అరుదు. సంగీతంలో పాండిత్యం ఎక్కువ లేకపోయినా ప్రజ్ఞతో బ్రతికేవారుంటారు. పుష్కలంగా సంగీత జ్ఞానం కలిగిన వారికి ప్రజ్ఞా పాటవాలుంటే యింకా విశేషం. అనుకరించటం ప్రజ్ఞ. పాండిత్యం కలిగి పాడటం ప్రతిభ.
తణుకులో ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ ఆ రోజుల్లో హరికథా గానంలో అఖండ కీర్తి పొందిన విద్వాంసుడు. మా నాన్నగారికి స్నేహితుడు. ఇద్దరికీ సంగీతం పిచ్చే. సుమారు 2వేల పద్యాలు ఆయనకు హృదయస్థం, కంఠస్థం. గురుముఖంగా వీరిద్దరూ ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు. కానీ శుద్ధమైన సంగీతం పాడేవారు.
పారుపల్లి వారి వద్ద కొన్నాళ్లు వుంటూ ముసునూరి సంగీతాభ్యాసం చేశారు. శ్రావ్యమైన గొంతు. పాట అతి మధురం, మనోహరం. హరికథ చెబితే అది సమ్మోహనాస్తమ్రే. మా నాన్న గారితో మాట్లాడుతూ ‘శ్రీరామ మూర్తిగారూ! శుభ పంతువరాళి రాగం ఆరోహణ, అవరోహణ ఒక్కసారి పాడండి’ అని పాడా వినిపించిన మరుక్షణం రాగం అసాధారణంగా పాడేసేవాడు. అదో ప్రజ్ఞ! తోడి, భైరవి, కల్యాణి రాగాలు ఆయనకెంతో యిష్టం. ఆ రోజుల్లో ఒకప్పుడు విజయవాడ ప్రభుత్వ కళాశాలలో పెమ్మరాజు సూర్యారావుతో బాటు యుగళ గానం పాడే వెంకటరమణ మూర్తి ఆయన కుమారుడే. ‘సీతావర సంగీత జ్ఞానము ధాత వ్రాయవలెరా’? పాడాలనే కాంక్ష పుట్టుకతోనే వుంటే ఎన్ని బంధనాలైనా ఛేదించుకుని సంగీతాన్ని పట్టేసుకుంటారనటానికి సాక్షులు వీళ్లు. బాలమురళీకృష్ణకు ‘బాల’ను చేర్చినదీయనే. అప్పటి ఘంటసాల, ఇప్పటి బాలసుబ్రహ్మణ్యం ఇలాంటి వారెందరో దీనికి ఉదాహరణ. చేతినున్న ఉంగరం అమ్ముకుని విజయనగరం వెళ్లిపోయి సద్గురువును ఆశ్రయించిన ఘంటసాలకు ఎటువంటి పాటలైనా పాడేందుకు తగిన పునాది అక్కడే పడింది. మద్రాసులో ఇంజనీరింగ్ చదివేందుకు వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం జీవితం మలుపు తిరగలా?
యోగ్యత కలిగిన వారు చాలామంది వుంటారు. అదొక్కటే సరిపోదు. యోగం వుండాలి. ప్రజ్ఞ కూడా ప్రధానమే. డాక్టర్ కావలసిన వాళ్లు యాక్టర్‌లు, యాక్టర్లు కావలసిన వాళ్లు కండక్టర్లు, కండక్టరు స్టార్‌లైనట్లే కలిసొచ్చే యోగమంటూ వుంటే ఏదైనా సాధ్యమే.
అసలు సంగీతమబ్బే యోగమే వుంటే ఎక్కడున్నా నేర్పేవారెవరో దొరుకుతారు. అది లేకపోతే గురువు ఎదురు గుమ్మంలో వున్నా ప్రయోజనం ఉండదు. చాలామంది వర్థిష్ణు గాయనీ గాయకులకిది అనుభవమే.
‘సినిమా’ కళాత్మకమైన వ్యాపారం. ప్రతిఫలాపేక్ష, లాభాపేక్షలు ఎక్కువ. సహజం. సంగీతం కూడా ముఖ్యమే. అయినా సాత్వికంగా పాడే ధోరణికి సరిపోని రంగం.
రాజస తామస గుణాలతో వుంటేనే సామాన్య జనానికి కిక్కు. రసము, రాగము, సాహిత్యము సామాజిక స్పృహ లాంటి వాటి జోలికి సాధారణంగా వెళ్లరు. అటువంటివి సామాన్య జనానికి అంతగా రుచించకపోవచ్చు. వారికి జనరంజకమే ప్రధానమైతే అంతర్ముఖుడై నాదోపాసనే ధ్యేయంగా గానం చేసేవారికి ఆత్మారాముడే లక్ష్యం. అదీ తేడా. సంగీతానికి ‘గ్రామర్’ శరీరం అనుకుంటే ‘నాదం.. ఆ శరీరానికి ఆత్మ’. సంగీతంలో మూడు రకాలు.
మొదటిది వింటున్నంతసేపూ చెవికి బాగానే ఉంటుంది. అంతకంటే లోపలికి వెళ్లదు. రెండవది చెవి దాటి మెదడులోకి ప్రయాణిస్తుంది. బుద్ధికి పని చెబుతుంది. మూడవ రకం మనసులోకి వెళ్లి కూర్చుని ఆనందాన్నిస్తూ భావ పరిణతి తోడైతే హృదయాన్ని కరిగించి అనిర్వచనీయ సౌఖ్యాన్నిస్తుంది.
కాలక్షేపానికో అవసరానికో పాడేది మొదటి కోవకు చెందుతాయి. తాను నేర్చుకున్న సంప్రదాయ సంగీత పరిధిని అతిక్రమించకుండా మొత్తం తెలుగు సినిమా రంగాన్ని తన పాటతో ప్రభావితం చేసిన అరుదైన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర్రావు. పరిశ్రమలోని నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు అతని మాటకు (పాటకే) లొంగిపోయారు. అతని పాటే ఆ సినిమాలకు ప్లస్ పాయింట్. ఆ శకం ముగిసింది. ఘంటసాల తర్వాత పాటల్లో మార్పు వచ్చింది. వినే వాళ్లకూ, చూసేవాళ్లకూ కాదు. ఇదో పరిణామ క్రమం. మార్పు రాకుండా ఉంటుందా?
* * *
యాగ యోగ త్యాగ భోగ ఫల మొసంగే ॥
సదాశివ మయమగు - నా దోంకార స్వర
విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు ॥
మనసులో ఎనే్నసి భావాలుంటాయో, అనే్నసి రాగాలున్నాయి. ఒక్కో అనుభూతికి ఒక్కో రాగం పుట్టింది.
72 మేళకర్త రాగ పద్ధతిని సంగీత లోకానికందించి ప్రాతఃస్మరణీయుడైన వేంకటమణికి సంగీతజ్ఞులు ఎప్పుడూ రుణపడే యున్నారని అనిపిస్తుంది నాకు.
అనంతాలై రాగాః. వేలాది రాగాలున్నాయి. జీవనదికి ఉపనదులున్నట్లు ఒక్కో జనక (మేళకర్త) రాగానికి ఎనె్నన్నో జీవ రాగాలు, ఔడవ (5 స్వరాలున్నవి) రాగాలు, షాడవ (6 స్వరాలున్నవి) రాగాలు వక్ర రాగాలెన్నో ఉద్భవించి భారతీయ సంగీతాన్ని ఉత్తుంగ శిఖరాలపై వుంచాయి - ఈ అపురూపమైన రాగ సంపదే మన భారతీయ సంగీతానికున్న విశిష్టత. చిన్నచిన్న స్వరాల మార్పుతో ఎనె్నన్ని రాగాలో? గమనిస్తే తెలుస్తుంది. ఆనంద భైరవి/ రీతిగౌళ, ఆరభి/ దేవగాంధారి, భూపాలం/ భౌళి, భైరవి/ ముఖారి.. ఇలా ప్రతి రాగానికీ ఓ ఆత్మ వుంది. నదులన్నీ మహాసముద్రంలో కలిసినట్లు, ఈ కోలాహల సప్త స్వరాలన్నీ చివరకు కలిసేది ఆధార షడ్జంలోనే-
నాదోత్పత్తికి అదే పరాకాష్ఠ. ఆ మూలాధార జనాదం తెలుసుకోవడమే, మోక్ష మార్గమని చెప్పారు త్యాగరాజు.
ఏ రాగ స్వరూపం తెలియాలన్నా కీర్తనలే ఆధారం. త్యాగరాజాది మూర్తిత్రయంతోబాటు ఎందరో వాగ్గేయకారులు ఒకే రాగంలో ఎనె్నన్నో కీర్తనలు పాడుకున్నారు. కీర్తనలను అనుష్టానం చేసిన కొద్దీ రాగాలాపన శక్తి పెరుగుతూనే ఉంటుంది.
ఆందోళిక రాగం చాలా అపురూపమైన రాగం. ఈ రాగంలోని అపురూపమైన కీర్తన మీకు గుర్తుండే వుంటుంది. మిస్సమ్మ చిత్రానికి లీల పాడింది. సుప్రసిద్ధ హిందుస్థానీ విద్వాంసుడైన బడేగులామాలీఖాన్, సంగీత కచేరీల కోసం దక్షిణాదిలో వున్నప్పుడు, మా గురువైన వోలేటి గారు స్వయంగా వెళ్లి కల్సుకునేవారు.
వోలేటిగారు బడేగులామాలీఖాన్ అభిమానియే కాదు. ఆయన మానసిక గురువు. ఓ రోజు ఆందోళిక రాగంలో ‘రాగ సుధారస పానము చేసి రంజిల్లవే మనసా..’ ఖాన్ సాహెబ్ ఎదురుగా కూర్చుని పాడి వినిపించారు. ఆ రాగానికి పరమ ఖుషీయైన ఖాన్ సాహెబ్ వెంటనే ప్రక్కనే వున్న స్వరమండల్‌లో ఆందోళిక స్వరాలు చేసి, పాడటం ప్రారంభించారు. 40 ని.లసేపు సాగిన ఖాన్ సాహెబ్ గానం ‘నా జీవితంలో మరపురాని అనుభూతి’ అని గుర్తు చేసుకుంటూ ఉండేవారు.
‘సినిమా సంగీతానికి సంబంధించినంత వరకూ నూటికి నూరు పాళ్లూ దేశీయత కలిగిన సంగీత దర్శకులలో ప్రముఖులుగా నాకు తోచేది యిద్దరు’ అన్నారు పాలగుమ్మి విశ్వనాథం. వారిలో ఒకరు చిత్తూరు నాగయ్య. మరొకరు ఘంటసాల. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన గాత్రాలకు, స్వరాలను గమక యుక్తంగా పాడితేనే ఆ పాటకు బరువుంటుంది. అది అలవాటయిన గాత్రాలకు స్వరాలను తక్కువ గమకాలతో పలికించగల నేర్పు అందరికీ వుండదు. నేపథ్య గాయకుడిగా రూపుదిద్దుకున్న ఘంటసాల నేర్చినది శాస్ర్తియ సంగీతమైనా, ఆ మూసలో గొంతుని బిగించకుండా సినిమా సంగీతానికి కావలసినంత వరకూ జాగ్రత్తగా మలుచుకున్నందువల్ల ఆయన పాట అన్ని వనె్న చినె్నలతో నిండి రసికుల హృదయాల్లో పన్నీరు చిలికింది.
శాస్ర్తియమైనా లలితమైనా, సమదృష్టితో చూడగలగాలి. శ్రుతి శుద్ధత, సుస్వరం వుంటే అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంటుందన్న వారిలో ద్వారం వెంకటస్వామి నాయుడు ఒకరు. కచేరీ చివరలో హాయిగా ‘అప్పన్నా తనమన్నా’ వాయించేవారు. శాస్ర్తియ సంగీతంలో పేరు మోసిన నాయుడు గారికి మద్రాసులో సన్మానం జరిగినప్పుడు, అప్పట్లో ప్రభంజనంలా వెలిగిపోతున్న ఘంటసాల కచేరీ జరిగింది (రాజాజీ హాలులో).
సుస్వరం, సునాదం దండిగా రెండూ వుండబట్టే నాయుడుగారి ఎదురుగా పాడే అవకాశం ఘంటసాలకు లభించింది’ అన్నారు పాలగుమ్మి.
పాలగుమ్మి విశ్వనాథ హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో లలిత సంగీత ప్రయోక్త.
వివిధభారతిలో నేనోసారి పెండ్యాల నాగేశ్వర్రావుతో ఇంటర్వ్యూ చేశాను. ఆయన బావమరిది కూడా పక్కనే వున్నాడు. (1976లో) అప్పుడు ఘంటసాల జీవించి లేరు.
‘ప్రొడ్యూసర్లూ సంగీత దర్శకులూ ఘంటసాల వెంటబడి ఆయన చేతే పాడించుకోవాలని ఎందుకనుకునేవారు?’ అని అడిగాను. ‘రోజంతా షూటింగ్ ముగించుకుని, ఆయా సీనులు ఎలా వచ్చాయో ప్రివ్యూ థియేటర్‌లో రషెస్ చూసేవాళ్లం. ఒక్కోసారి ఒక్కో సీను పేలవంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. దీనికి కారణం స్క్రీన్‌ప్లే లోపం కావచ్చు. నటన లోపం వల్లనో, డైలాగ్ సరిగా లేకపోవటం వల్ల కూడా అనుకున్న ఎఫెక్ట్ రాక డల్‌గా ఉంటుంది. అప్పుడు రక్షకుడిలా ఘంటసాల గుర్తుకు వస్తాడు. ఓ పాట ఆ సందర్భానికి వ్రాయించి ఘంటసాల చేత పాడించేస్తే చాలు. అక్కడ పాట అవసరమా? కాదా? అని కాదు. ఒక్కసారి ఘంటసాల గొంతు చెవిని పడితే చాలు. ప్రేక్షకుడికి మైకం కమ్మేస్తుందన్నారు. మరో మాట? అంటూ ఆయన పాటల వల్ల బ్రతికిన సినిమాలు చాలా వున్నాయి. అందుకే ఘంటసాల కోసం ప్రొడ్యూసర్లు వెంటబడేవారు’ అన్నారు.
హిందుస్థానీ సంగీత విద్వాంసుడైన బడే గులామాలీఖాన్ కచేరీ ‘మద్రాసు నగరంలో జరిగినప్పుడు కర్ణాటక సంగీత విద్వాంసులెందరో వెళ్లి విన్నారు. జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం ఆయన గానానికి మైమరిచిపోయి వెళ్లి పాదాభివందనం చేయటం కొంతమంది తమిళ రసికులకు నచ్చలేదు. సంప్రదాయం పట్ల గౌరవం, మర్యాద కలిగిన జిఎన్‌బి బాధపడ్డాడు కూడా. సరిగ్గా అదే సమయంలో బడే గులామాలీఖాన్ సంగీతానికి ఘంటసాల కూడా పరవశుడయిపోయాడు. తన ఇంట్లోనే ఆ మహా విద్వాంసుణ్ణి కొన్నాళ్లు ఉంచుకుని ఆయన పాట తనివితీరా విన్న సంస్కారం కలిగిన సంగీత రసికుడు ఘంటసాల.
‘ఆయనకు రోజూ ఉదయం నేనే అల్పాహారం చేస్తూండేదాన్ని. నిక్షేపంగా ఓ పదేశి చపాతీలు, చెంబుడు పాలు తాగేసి, ‘రియాజ్ (సాధన) కర్‌నా బేటీ’ అని లేచి, ‘స్వర మండల్ చేసి పాటను ప్రారంభించే ముందు, మామయ్యను (ఘంటసాలను) రమ్మని పిలిచి కూర్చోమనేవారు. ఇద్దరూ అలా గంటల తరబడి పాడటం నాకింకే గుర్తే’ ‘ఖాన్ సాహెబ్ రాగేశ్వరి రాగాన్ని ఎంత ముగ్ధుడై వినేవారో’ అని ఘంటసాల సావిత్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
అందరినీ కలుపుకుని పోయేది అనురాగం. ఎందరినైనా కలిపేసేది రాగ మాధుర్యం. వినగలిగే చెవులుండి పాడగలిగే శక్తి వుంటే ఏ రాగమైతేనేమి? ఏ బాణీ అయితేనేమి? సంస్కారమే ప్రధానం. మనకు స్వతంత్రం రాకముందున్న సంస్థానాలకు వాద్య బృందాలుండేవి. బ్రిటిష్ వారు కూడా వాద్య బృందాలు నిర్వహించేవారు.
నూనె దీప కాంతుల్లో ఆర్కెస్ట్రా నడుస్తూ వినిపించే వాద్య బృంద సంగీతంతో త్యాగరాజు, దీక్షితులు వారూ, తర్వాత వాగ్గేయకారులూ మరి కొందరు ప్రభావితమయ్యారు. త్యాగరాజు దివ్యనామ కీర్తనలు వరలీల గానలోల, గత మోహాశ్రీతపాల, శరశర సమరైక శూర వంటివి ఈ కోవలోనివే.
త్యాగరాజ శిష్య ప్రశిష్య వర్గంలో ముఖ్యుడైన పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ పేరును జగద్విఖ్యాతం చేసిన ‘రఘు వంశ సుధాంబుధి చంద్రశ్రీ - కదన కుతూహలం’ రాగంలో పాశ్చాత్య ధోరణి కనిపిస్తుంది. వినండి. వాద్య కళాకారులు ఎంతో ఇష్టపడే కీర్తన యిది.
ముత్తుస్వామి దీక్షితులు పాశ్చాత్య సంగీత ప్రభావంతో చేసిన కీర్తనలు-
-కమలాసన వందిత పాదాబ్జే
-పాహిమాం జానకీ వల్లభ
-గురుగుహ సరసిజ
-ముచుకుంద వరద
-వరశివ బాలం
-రామచంద్రం రాజీవాక్షం
శక్తి సహిత గణపతిం...
ధ్యానంలో ఏకాగ్రత ఎలాగో గానంలో శ్రుతి అటువంటిది. షడ్జ పంచమ స్వరాలు తప్పిస్తే మిగిలిన స్వరాలన్నీ కోలాహలంగా వుండే స్వరాలే.
షడ్జానికీ మిగిలిన స్వరాలకూ వున్న దూరాన్ని కొలిచేది మనసే. ఎలక్ట్రానిక్ వాద్యాల్లో ఈ స్వరాలను తేలికగా గుర్తించవచ్చు.
కుశాగ్రబుద్ధి అనే మాట మీరు వినే వుంటారు. అటువంటిదీ శ్రుతిజ్ఞానం. ఆలిండియా రేడియోలో పాడాలనే ఉత్సాహంతో వెళ్లి వెనుదిరగటానికి ప్రధాన కారణం శ్రుతి జ్ఞానం లేకపోవటమే. ఎలక్ట్రానిక్ శ్రుతి బాక్సులోని నాదానికీ, తంబురా శ్రుతిలోని సహజ జీవ స్వరంతో నిండిన నాదానికీ తేడా ఉంది. విద్వాంసులే ఒక్కొక్కసారి ఒకటికి పదిసార్లు పరీక్షించుకుంటూ నిర్ధారించుకుని ముందుకు సాగుతూంటారు.
శ్రుతికీ, అపశ్రుతికీ గల తేడా తెలిస్తే సంగీతాభ్యాసానికి ఎదురయ్యే అవరోధాలుండవు.
స్వర స్థానాల విషయంలో పాశ్చాత్య సంగీతంలో అనిశ్చిత స్థితి ఉండదు. వాళ్లకు పియానో, కీ బోర్డులు ప్రమాణం. వాటి మీద 12 స్వర స్థానాలు మాత్రమే పలుకుతాయి. వాటి మధ్య వుండే సూక్ష్మ స్వరాలతో (మైక్రో టోన్స్) పియానో మీద పలకవు. మన సంగీతానికి శ్రుతులు, ఆధారంగా ఏర్పడే గమకాలకే విలువ. భారతీయ సంగీతానికే తలమానికంగా నిలిచిపోయే రాగ ప్రధానమైన మన సంగీతానికి దూరవౌతూ, దాన్ని వదిలేసి పాశ్చాత్య సంగీత వ్యామోహంతో పొడి స్వరాలతో పాడితే భారతీయత ఎక్కడ? భాషకు అక్షరాలెంత ముఖ్యమో, పాటకు స్వరాలు అంత ముఖ్యం. అర్థవంతమైన మాటలతో ఏర్పడిన పాటకు, సుస్వరంతో కూడిన సునాదం నిండిన స్వర సముదాయంతో, నాదం ఏర్పడుతోంది. భాషలో పదాలకే గాని, ఏ ఒక్క అక్షరానికీ భావం వ్యక్తం చేయలేం. అలాగే స్వరం కూడా.
అందని ద్రాక్ష పులుపు. మనకు అర్థం కాని విషయాల మీద ఆసక్తి లేకపోతే సరి. అనాదరం కూడా ఉంటుంది.
కర్ణాటక సంగీత కచేరీలు వింటూ, ఎవరితోనో కబుర్లు చెప్పేవారికి ఈ సంగీతాన్ని గురించి మాట్లాడే హక్కుండదు.
తార, మధ్యమ, మంద్ర స్థాయిల్లో మనకు సంగీతం వినిపిస్తూంటుంది ఇవి శ్రుతి భేదాలు.
తారస్థాయిలో రాగ సంచారం రాక్షసులకు ఆనందాన్నిస్తుంది. మంద్ర స్థాయిలోని గానం మానవులకు ఉద్దేశించినదనీ, మధ్యమ శ్రుతి దేవతల కోసమనీ యజుర్వేదం చెప్పిన మాట.
మంద్ర స్థాయిలో హిందూస్థానీ సంగీత విద్వాంసులు విధిగా ‘సాధన’ చేస్తారు.
శ్రీ రామభక్త హనుమాన్ రామచంద్రుడితో మాట్లాడినప్పుడు ‘మధ్యమ శ్రుతి’లో మాట్లాడాడని చెప్పిన వాల్మీకిని గుర్తు చేసుకోవాలి.
అహో! ఏమి రూపం? ఏమి తేజం? ఏమి గంభీరత? అని హనుమంతుడి చేత పొగడబడిన రావణాసురుడు కూడా గొప్ప శివభక్తుడే. ఉపాసన వున్నవాడే. (ఆ ఒక్క దుర్లక్షణం లేకపోతే) శివుణ్ణే పిలవగలిగిన శక్తిమంతుడు. కానీ ఏం లాభం? అనాగరిక స్థాయిలోని నిషిద్ధ గురువు కుంభకర్ణుణ్ణి నిద్ర లేపేందుకు ఉపయోగించిన సంగీత వాద్యాలెలా ఉండి ఉంటాయో మనం ఊహించలేమా? ఈవేళ మన చెవిన పడే పాటలను గమనించండి సమాధానం దొరుకుతుంది.
సమర్థులైన సంగీత దర్శకులున్నారు. ప్రజ్ఞాదురంధరులైన గాయకులున్నారు. ఉన్నదల్లా భావదారిద్య్రమే. శ్రోతల స్థాయికి దిగిపోవాలనేదే లక్ష్యంగా వుంటే, రాగ సుధారస పానానికి చోటేది?
*

చిత్రాలు..ఘంటసాల
*బడే గులామలీ ఖాన్
*ముసునూరి సూర్యనారాయణ భాగవతార్

- మల్లాది సూరిబాబు 9052765490