లోకాభిరామం

అప్పాలజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రకారుడు బాపు, కార్టూన్‌లు వేసి కితకితలు పెట్టినపుడే బాగుండేది. ఆయనకు సినిమా చీమ ఎందుకు కుట్టిందీ, కనీసం నాకు, అర్థం కాదు. ఒకానొక మాసపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ఆయన అప్పట్లో ఒక కార్టూన్ సీరియల్ వేసేవారు. బంగారం - సింగారం అనే కథలో ఆయన అప్పారావు అనే ఒక పాత్రను మనముందుంచారు. అదే అప్పారావును అందాల రాముడు సిన్మాలో రాజబాబు రూపంలో మరోసారి ప్రవేశపెట్టారు. అప్పారావు, తన మామతో ఎడారుల్లో బంగారం అనే్వషణలో ఉంటాడు. అక్కడ వాళ్లిద్దరు తప్ప మరో ప్రాణి ఎవరూ లేరు. అప్పారావు తన మామయ్యను, ‘ఓ ఫైవుందా?’ అని అడుగుతాడు. ఈ ఎడారిలో అప్పు దేనికిరా? అంటాడు మామ. ‘అలవాటు తప్పగూడదనీ!’ నసుగుతాడు అప్పారావు.
ముళ్లపూడి వెంకటరమణ కూడా ఋణానందలహరి అని ఒక రచన చేసినట్టున్నారు.
నాన్నకు, అంటే మా నాయినకు అప్పు చేయడం ఇష్టం ఉండేది కాదు. ఆయన ఎన్నడూ ఎవరి దగ్గరా అప్పు తీసుకోవడం నేను చూడలేదు. అయితే, నాన్న పురం నర్సిములు అనే ఆయన అంగడిలో ప్రతి నెలా నెల సామాను అను సరుకులు తెచ్చుకునే వాడు. ఎప్పటికప్పుడు పైసలిచ్చి సరుకు కొనేవారికి, అదే అంగడికి పోవాలన్న పట్టింపు అవసరం లేదు. అయినా నాన్న అదే అంగడికి పోతాడు. నర్సిములు నాన్నకు ఒక సూత్రం చెప్పాడు. ఒక నెల మాత్రం డబ్బు ఇవ్వకుండానే సరుకు తీసుకుపోవాలి. ఆ డబ్బులు మరుసటి నెల యిచ్చి, మళ్లీ సరుకులు తీసుకుపోవాలి. ఆ ఒక నెల తప్ప ప్రతి నెలా డబ్బులు ఇచ్చి సరుకులు తెచ్చుకున్న తృప్తి నాన్నకు! అయ్యగారు తమ అంగట్లో ఖాతా అంటే అకౌంటు పెట్టారన్నది నర్సిములుకు తృప్తి!
అట్లాగే అదే ప్రాంతంలో ఉన్న ఒక రెడీమేడ్ దుస్తుల అంగట్లో నాన్నకు ఖాతా ఉండేది.
ఇంతకూ ఎందుకు ఈ రుణానందలహరి? ఒక పుస్తకం చదువుతున్నాను. అయిదు వేల ఏండ్లుగా డబ్బు, అప్పులు కొనసాగిన తీరు గురించి ఈ పుస్తకంలో ఎన్నో ఆసక్తికరమయిన అంశాల గురించి చర్చ ఉంది. రాసింది పడమటి మనిషి. కొంత కష్టపడి శతపథ బ్రాహ్మణం, ఋగ్వేదం నుంచి అప్పు అను ఋణం, అను రుణం గురించి కొటేషన్‌లు సేకరించాడు. ‘అప్పులు తీర్చిన పద్ధతిలోనే, పీడ కలల ప్రభావాన్ని కూడా తప్పించుకుందాము’ అని ఋగ్వేదంలో ఉందట. దేవతలకు, ఋషులకు, పితరులకు, ప్రజలకు అప్పుబడి ఉన్నందుకే, ప్రతి మానవుడు పుడుతున్నాడు. హోమం చేస్తే, ఆజన్మం దేవతలకు అప్పులో ఉన్నందుకే. పవిత్ర గ్రంథ పఠనంతో రుషుల ఋణం తీరుతుంది. సంతానం కావాలనుకుంటే, అది పితరుల రుణం కారణంగానే. ఆతిథ్యం ఇస్తుంటే, అది ప్రజలకు అప్పుబడినందుకే, అని శతపథ బ్రాహ్మణంలో ఉందట.
‘నీవు బ్యాంక్‌కు లక్ష అప్పు ఉంటే, నీవు బ్యాంక్ ఆస్తివి. అదే నీ స్వంతదారు. ఇక వంద కోట్లు అప్పు ఉన్నావనుకో. అప్పుడు బ్యాంకు నీది. నీవే స్వంతదారునివి’ అన్నది ఒక అమెరికా సామెత. కోట్లు ఎగబెట్టి తప్పించుకుని బయటి దేశాలలో తిరుగుతున్న మనుషులు గుర్తువచ్చారా? అసలు ఇంతకూ అప్పు, లేదా ఋణము అనగానేమి? అని అడగాలని అనిపించడము లేదా? మీరు ఎవరికో ఏదో ఇస్తామని మాట యిచ్చారు. లేదా ఆశ పెట్టారు. అప్పుడది ఆశ మాత్రమే. అప్పు కాదు. డబ్బు, పైసా, రొక్కం, మనీ, అది వ్యవహారంలో ఉంటేనే అప్పు, అంటున్నారు నిపుణులు. కుబేరుడు మిత్రుడు. అయినా శివయ్య బిచ్చమెత్తాడు. అంతేగానీ అప్పు చేసి పప్పుకూడు తినలేదు. యంగటేస్పరుడు అను వెంకటేశ్వరుడు మాత్రం అప్పు చేశాడు. అది ఈనాటికీ తీరలేదట. ఇవాళ కూడా, తిరుమల గుళ్లో రాత్రి తాళం వేసే ముందు, ఆ అప్పు గురించిన లెక్కలు చదువుతారు. ఆయన అనగా వెంకటేశ్వరులు గారు, అందరి దగ్గరా, డబ్బులాగి, వడ్డీ చెల్లించుకుంటాడట. అందుకే ఆయనకు వడ్డికాసుల వాడు అని పేరు. ఎవరయితేనేమి. పణం! అనగా సొమ్ము! అదే అప్పునకు ఆధారం. తీర్చకుంటే తిప్పలకు, ముప్పులకు కారణం.
నా దగ్గరయినా, మీ దగ్గరయినా పైసా ఉంటే, అప్పు యివ్వడం కుదురుతుంది. ఈ భూప్రపంచంలో మొట్టమొదట మెసొపొటేమియాలో చేతిరాతలు మొదలయినట్లు చెపుతారు. పచ్చి మట్టి పలకల మీద, తుంగ కాడలతో గుంటలు గుచ్చి రాతలు రాసుకున్నారు. ఆ రాతల్లో ఉన్న విశేషాలు, అప్పుల గురించి అని చెపితే ఆశ్చర్యం పడతారా? గుడులకు విడుదల చేసిన గింజలు, పైకం గురించి, ఎవరికి వారు చేసుకున్న అప్పులు, రాబడి గురించి, వెండి, ధాన్యం విలువల గురించి మాత్రమే ఆ పలకల రాతలలో ఉంది. ఒకానొక మనిషి, తన తమ్మునికి ఉత్తరంగా రాసిన పలక దొరికింది. అందులో ఆ అన్నయ్య తన అప్పులు, తిప్పల గురించి చెప్పుకున్నాడు. ధనం చరిత్ర అంటే అప్పు చరిత్రేనంటున్నారు, అలనాటి రాతలను చదివినవారు.
బ్రెజిల్ లేదా బ్రాజిల్‌లో నంబిక్వారా అనే తెగ మనుషులు ఉండేవారు. వాళ్లు చిన్నచిన్న గుంపులుగా బతికేవాళ్లు. అందరూ అన్ని పనులూ చేసేవారు. ఒక్క గుంపులో వందకన్నా ఎక్కువమంది ఉండేవారు కారు. అంతా తిండి వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. అట్లా తిరిగే దారిలో మరొక గుంపు వారు వంట చేసుకున్న ఆనవాళ్లు కనపడతాయి. ఉన్న వస్తువులను ఇచ్చి పుచ్చుకోవడానికి, మన గుంపులు కలవవచ్చు గదా, అనే ప్రస్తావనతో రాయబారులను పంపుతారు. అవతల వారు సరేనంటే, ముందు ఆడంగులను, పిల్లలను అడవిలో దాచేవారట. అప్పుడే మీటింగ్. రెండు జట్లకు నాయకులుంటారు. వారు ఎదుటి వారిని పొగడుతూ, తమ వారిని చవటలుగా చెపుతూ ప్రసంగాలు చేస్తారు. ఆ తరువాత నాట్యం కూడా ఉంటుంది. అప్పుడు వ్యాపారం మొదలవుతుంది.
ఎదుటి మనిషి దగ్గర గొడ్డలి ఉంది. అది ఇవతలి వ్యక్తికి కావాలి. ఇక ఇతను దాన్ని తెగ పొగడుతాడట. ఆ సంగతి ఆ ఎదుటి మనిషి కాదంటాడు. గొడ్డలి పాతది, ఎందుకూ పనికిరానిది అంటాడు. ఇద్దరూ యించుమించు కోపంగా వాదించుకుంటారు. ఎదుటి వారి వస్తువును లాగడానికి ఇద్దరూ ప్రయత్నం చేస్తారు. గొడ్డలికి బదులు ఇవతలి వ్యక్తి, తన మెడలోని గొలుసు ఇస్తానంటాడు. గౌరవంగా తీసి ఇవ్వడు. గొడ్డలి మనిషి దాన్ని బలవంతంగా లాక్కుంటాడు. నిజానికి ఈ వ్యాపారంలో పోట్లాటలకు అవకాశం కూడే ఉంటుంది.
ఇంతకూ ఏమిటిదంతా? డబ్బులు, గెల్డ్ (జెర్మన్) లేని నాడు మనుషుల తీరు అది. వస్తువుల విలువకు లెక్కలేదు. డబ్బు విలువ మాత్రం నిర్ణయం అయి ఉంటుంది. అదీ సంగతి. కుమ్ములాట ముగిసిన తరువాత, ఆడవాళ్లు పిల్లలు వస్తారు. హాయిగా విందు జరుగుతుంది. బాగుంది కదూ, వెర్రి వ్యవహారం!
ఈ మధ్యన అప్పులు ఇస్తామంటూ తెగ మెసేజ్‌లు వస్తుంటాయి. బ్యాంకుల వారు ఎవరికయినా అప్పు ఇవ్వాలంటే, ఆ మనిషి ఆస్తులు, పరపతి గురించి అడుగుతారు. ‘నాకు అప్పు అవసరం లేదు’ అని ఋజువు చేస్తే అప్పు సులభంగా దొరుకుతుందని, ఒక బ్యాంకర్ చమత్కరించాడు.
మనకు పురాణాలలో హరిశ్చంద్రుడు, అని ఒక రాజున్నాడు. అన్నమాట, అంటే తాను పలికిన మాట కొరకు అప్పుల పాలయ్యాడు. ఆ తరువాత అప్పు వసూలుకు వచ్చిన వారంతా నక్షత్రకులయ్యారు. కాబూలీవాలాలు అప్పు యివ్వడం సులభంగా ఇచ్చేవారు. వసూలు మాత్రం క్రూరంగా చేసేవారు. అదంతా కథల్లో కూడా వచ్చింది.
నేను ఒకేసారి పెద్దఎత్తున (నా దృష్టిలో) అప్పు చేశాను. గౌరవంగా దాన్ని తీర్చేశాను. ఇక కొంతమందికి అప్పు ఇచ్చాను. కనీసం ఇప్పించాను. అందరూ నన్ను ముంచారు. అయినా తెలివి రాలేదు. అందుకేనేమో డబ్బు గురించి, అప్పుల గురించి చదువుతున్నాను. బాగనిపించిన సంగతులు పంచాలి గనుక ఇలా రాస్తున్నాను. ఏ జన్మలోనో మీరు నాకు అప్పుపడ్డారు గనుక నా నాలుగు అక్షరాలు చదివారు. అప్పు తీరింది!

కె. బి. గోపాలం