క్రైమ్ కథ

రెండో అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలీస్ చీఫ్ పాల్ తన పైప్‌ని తాగుతూ ఆరుం ముప్పావుకి వచ్చే రైలు కోసం కేరింగ్టన్ రైల్వేస్టేషన్‌లో వేచి ఉన్నాడు. అందులో మాజీ ఖైదీ హేరిస్ వస్తున్నాడు. పాల్ ఒక్కడే తన వ్యక్తిగత సమయంలో, వ్యక్తిగత ఖర్చుతో అతను నేరస్థుడు కాడని రుజువు సంపాదించడంతో గత తొమ్మిదేళ్లుగా తను చేయని నేరానికి జైలుశిక్షని అనుభవిస్తున్న హేరిస్ విడుదలై వస్తున్నాడు. ఈ సందర్భంగా పోలీస్ చీఫ్ పాల్‌కి జాతీయ ఖ్యాతి కూడా లభించింది.

న్యూయార్క్‌లోని ఎడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీలో పని చేసి విసుగు చెందిన హేరిస్ ఆ చిన్న ఊరికి వచ్చి స్థిరపడ్డ మొదటి చిత్రకారుడు. అతని తర్వాత చాలామంది రావడంతో అది చిత్రకారుల కేంద్రంగా మారింది. దాంతో రాష్ట్రంలో కళకి రాజధానిగా పరిగణింప బడసాగింది.
హేరిస్ ఓ చిన్న కాటేజ్‌లో ఒంటరిగా జీవించేవాడు. అతనికి మిత్రులు ఎవరూ లేరు. దాదాపు ఓ యోగి జీవితం గడిపేవాడు. కేరింగ్టన్ కోవ్‌కి హేరిస్ వచ్చి స్థిరపడ్డ దాదాపు ఏడాదికి మిసెస్ లూసీ అనే వేసవి పర్యాటకురాలు హత్య చేయబడింది. ఆమె తన కాటేజ్‌ని మిసెస్ లూసీ మూర్ పేర అద్దెకి తీసుకోవడంతో ఆమె మూర్ భార్య అని అంతా భావించారు. ఆమె కాటేజ్‌లో కాల్చి చంపబడ్డ ఆమె శవాన్ని గుర్తించాక పాల్ చేసిన పరిశోధనలో ఆమెని ఆఖరిసారి చూసింది హేరిస్ అని తెలిసింది. వెంటనే హేరిస్‌ని ప్రశ్నించాడు.
‘అవును. నాకు, ఆమె కొద్ది వారాల క్రితం పరిచయం అయింది. ఆమెతో నాకు శారీరక సంబంధం ఉంది. ఆ రాత్రి నేను ఆమెని ఆఖరిసారి కలిసాను. మర్నాడు ఉదయం ఆమె తిరిగి లాస్ ఏంజెలెస్‌కి వెళ్లిపోతున్నానని చెప్పింది. కొద్దిసేపటికి నేను వెళ్లిపోయాను. నేను బయలుదేరే సమయానికి ఆమె జీవించే ఉంది. అంతకు మించి నాకు ఇంకేం తెలీదు’ అతను జవాబు చెప్పాడు.
లూసీని కాల్చి చంపిన రివాల్వర్ పోలీసులకి దొరకలేదు. రికార్డుల ప్రకారం హేరిస్ రివాల్వర్ యజమాని కూడా కాదు. హత్య జరిగిన సమయంలో హేరిస్ తన కాటేజ్‌లో ఉన్నానని చెప్పాడు. దానికి సాక్షులు లేరు. మరే విధంగానూ హేరిస్ తన ఎలిబీని రుజువు చేసుకోలేక పోయాడు. లూసీ కాటేజీకి, అతని కాటేజీకి మధ్య గల దూరం అర మైలే.
మరో హంతకుడి ప్రమేయం ఉందని విచారణలో తెలీకపోవడంతో సర్క్‌మస్టేన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా హేరిస్‌ని ప్రాసిక్యూషన్ వారు దోషిగా బోను ఎక్కించారు. లూసీతో అతనికి గల శారీరక సంబంధం కారణంగా హేరిస్‌ని అనుమానించారు. అతను లూసీని వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించాడని, కాని ఆమె వినకపోవడంతో కోపంలో హత్య చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అతనికి ముప్పై ఏళ్ల జైలుశిక్ష పడింది.
కాని లెఫ్టినెంట్ పాల్ మాత్రం హేరిస్‌ని హింసాత్మక వ్యక్తిగా భావించలేదు. ప్రాసిక్యూషన్ ఆరోపణని కూడా అతను విశ్వసించలేదు.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలపాటు తన సమయాన్ని, డబ్బుని వెచ్చించి పాల్ అసలు హంతకుడ్ని కనుగొనే ప్రయత్నం చేశాడు. తన భార్యతో కలిసి రెండోసారి హనీమూన్‌కి లాస్ ఏంజెలెస్‌కి వెళ్లినప్పుడు విచారిస్తే, లూసీ మూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని, నిజానికి ఆమె రోనాల్డ్ అనే అతని భార్యని తెలిసింది.
పాల్ వెంటనే రోనాల్డ్ కోసం పరిశోధన చేస్తే ఆర్నెల్ల క్రితమే అతను కోలరేడో టిబి శానిటోరియానికి వెళ్లి చేరాడని తెలిసింది. వెంటనే అక్కడికి విమానం టిక్కెట్ కొనుక్కుని వెళ్లి రోనాల్డ్‌ని కలిశాడు. క్షయ వ్యాధితో చిక్కి శల్యమైన అతన్ని ప్రశ్నించాడు.
‘తొమ్మిది సంవత్సరాల క్రితం మీ భార్య లూసీ హత్య చేయబడ్డ రాత్రి మీరు ఎక్కడ ఉన్నారు?’
‘నాకు గుర్తు లేదు’
‘మీ భార్య తప్పిపోయినట్లు ఈ తొమ్మిదేళ్లల్లో ఎందుకు పోలీసులకి ఫిర్యాదు చేయలేదు?’
‘మీ ప్రశ్నలకి నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెళ్లండి’ నిరాకరించాడు.
‘అమాయకుడైన హేరిస్ జైలుశిక్షని అనుభవిస్తున్నాడు. కాబట్టి మీరు సహకరిస్తే అది అతనికి ఉపయోగం’
అతను జవాబు చెప్పలేదు.
దాదాపు ప్రతీవారం ఓసారి పాల్ డొనాల్డ్‌కి ఫోన్ చేసి ఓ అమాయకుడు జైలుశిక్షని అనుభవిస్తున్నాడని గుర్తు చేయసాగాడు. చివరకి మూడు వారాల క్రితం కొలరేడోలోని టిబి హాస్పిటల్ నించి పాల్‌కి ఫోన్ వచ్చింది.
‘గంట క్రితం డొనాల్డ్ మరణించాడు. మీ పేర అతను ఓ ఉత్తరాన్ని రాశాడు. తన మరణానంతరం దాన్ని మీకు అందజేయమని కోరాడు’
‘దయచేసి నాకు దాన్ని వెంటనే పంపగలరా?’ కోరాడు.
అది తన చేతికి రాగానే పాల్ దాన్ని చింపి చదివాడు. లూసీని తను చంపానని డొనాల్డ్ అంగీకరిస్తూ రాసిన ఉత్తరం అది. ఆమె హేరిస్‌ని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించి తననించి విడాకులు కోరడంతో అందుకు సమ్మతించని తను అసూయతో కేరింగ్టన్ కోవ్‌కి వచ్చి ఆమెని హత్య చేశానని, ఆమె భర్త మూర్ మరణించాక ఆమె తనని పెళ్లి చేసుకుందని, ఈ సంగతి కూడా తన నించి దాచడంతో తమ మధ్య పొరపొచ్చాలు ఆరంభమయ్యాయని, దాంతో ఆమె తనని వదిలి తను అభిమానిగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే హేరిస్ దగ్గరికి వెళ్లిందని, హేరిస్ శిక్ష అనుభవిస్తున్నాడని తెలిసి ఆ ఉత్తరం రాస్తున్నానని ఆ ఉత్తరంలో ఉంది.
వెంటనే పాల్ ఆ ఉత్తరం ఆధారంగా లూసీ కేసుని తిరిగి తెరవమని కోరుతూ ప్రాసిక్యూషన్ వారిని కోరాడు. ఫలితంగా జైలు నించి విడుదలైన హేరిస్ తిరిగి కోరింగ్టన్ కోవ్‌కి రైల్లో వస్తున్నాడు.
హేరిస్‌ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ స్థానిక దినపత్రిక విలేఖరి పాల్‌ని చూసి పలకరించాడు.
‘అతన్ని అరెస్ట్ చేసింది మీరే. అతను నిరపరాధని రుజువు చేసిందీ మీరే. కాబట్టి మీరు ఇక్కడికి వస్తారనుకున్నాను. మీరు అతన్ని గుర్తు పట్టగలరా?’ ప్రశ్నించాడు.
‘ఏమో మరి? చెప్పలేను. తొమ్మిదేళ్ల జైలు జీవితంతో చాలా మారి ఉంటాడు’
అతను పాల్‌ని ఫొటోలు తీశాడు. రైలు సమయానికి వచ్చి ఆగింది. హేరిస్‌ని పాల్ తేలిగ్గానే గుర్తు పట్టాడు. అతను జుట్టు తెల్లబడి సన్నబడ్డాడు. మొహం కొద్దిగా పాలిపోయింది. ఒంటి మీద చవక సూట్. చేతిలో ఓ కేన్‌వాస్ ఎయిర్‌బేగ్. అతను జైలుకి వెళ్లడంలో తన పాత్ర కూడా కాస్త ఉండటంతో పాల్ కొద్దిగా సిగ్గు పడ్డాడు.
ఇద్దరూ ఒకరి వంక మరొకరు కొద్ది క్షణాలు చూసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి పలకరింపుగా నవ్వారు. హేరిస్ చెప్పాడు.
‘మీరు ఎవరని నేను అడగక్కర్లేదు. ఈ సందర్భంలో థాంక్ యు అన్న పదాలు సరిపోవని నాకు తెలుసు. కాని మీకు హృదయపూర్వకంగా థాంక్స్ చెప్తున్నాను పాల్’
‘నేను నా పనిని సక్రమంగా చేశాను. అంతే. చూడు హేరిస్. నీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటో నాకు తెలీదు. బహుశ నిన్ను తప్పుగా శిక్షించినందుకు నష్టపరిహారం కోసం కోర్ట్‌కి వెళ్తావు’
‘లేదు పాల్. నాకా ఉద్దేశం లేదు. దీని గురించి వస్తూ నేను రైల్లో ఆలోచించాను. రాష్ట్రం మీద వ్యాజ్యం వేయడం అంటే నీ మీద వేయడంతో సమానం అవుతుంది. నేను ఈ తొమ్మిదేళ్లు ఆనందంగా జీవించానని చెప్పను. కాని నాకు దొరికిన ఈ గొప్ప విరామంలో నా చిత్రలేఖనాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం దొరికిందని మాత్రం చెప్పగలను. నేను ఆయిల్ పెయింటర్‌నే ఐనా జైలుకి వెళ్లక మునుపు కలర్ సెన్స్ ఉండేది కాదు. జైల్లో నేను ఎంగ్రేవింగ్ వర్క్‌ని అభ్యసించాను. ఆయిల్ పెయింటింగ్స్ వేస్తూ జీవించాలని నా కోరిక. వాటికి మార్కెట్ ఉందనే నా నమ్మకం. జైలుశిక్ష వల్ల కాలం విలువ తెలిసింది కాబట్టి కాలం మీద గీయడానికి చాలా థీమ్స్ నా మనసులో ఉన్నాయి’
‘ఈ తొమ్మిదేళ్లల్లో కేరింగ్టన్ కోవ్ బాగా మారింది. నీ కాటేజ్‌ని టేక్సుల కోసం ప్రభుత్వం వేలం వేసేసింది. నువ్వు సంపాదించడం ఆరంభించడానికి కొంత సమయం పడుతుంది. అందుకు నీకు కొంత ఆర్థిక మద్దతు కూడా అవసరం. కాబట్టి నువ్వు అంత దాకా మా ఇంట్లో ఉచితంగా ఉండచ్చు. నా భార్య కూడా అందుకు ఇష్టపడింది’
‘మీ ఉదారతకి కృతజ్ఞుడ్ని. కాని నేను జైలుకి వెళ్లే నాటికి బేంక్‌లో అరవై వేల డాలర్లు ఉన్నాయి. వడ్డీతో కలిపి అవి తొంభై వేలు అవుతాయి. నేను సంపాదన ఆరంభించే దాకా నాకు పోషణకి ఇబ్బంది లేదు. మంచి ఇల్లు చూసుకునే దాకా హోటల్‌లో బస చేయదలచుకున్నాను.’
‘హోటల్ దాకా నేను డ్రాప్ చేస్తాను’
‘లేదు. నేను నడుస్తాను. స్వేచ్ఛని అనుభవించడంలోని మొదటి మెట్టు గార్డుల పర్యవేక్షణ లేని నడక’ హేరిస్ మృదువుగా నిరాకరించాడు.
ఇద్దరూ కరచాలనం చేసాక పాల్ బయటకి నడిచాడు. విలేకరి ప్రశ్నలకి జవాబులు చెప్పాక హేరిస్ బయటకి నడిచాడు. హేరిస్ మెయిన్ రోడ్ మీదకి చేరుకున్నాక ఓ కారు వేగంగా వచ్చి అతని పక్కన ఆగింది. లోపల నించి రివాల్వర్ పేలిన శబ్దం. ఆ గుండు హేరిస్ తలలో గుచ్చుకుంది. కార్లోంచి బయటకి దూకిన ఓ యువకుడు నేల కూలిన హేరిస్ చవక కేన్వాస్ బేగ్‌ని అందుకుని, అతని జేబుల్లోవి తీసుకుని మళ్లీ కారెక్కి పారిపోయాడు.
* * *
‘పాల్! మీరు అన్నం సరిగ్గా తినక ఇది మూడో రాత్రి. హేరిస్ హత్య జరిగినప్పటి నించి మీరు సరిగ్గా అన్నం తినడం మానేసి, అదే పనిగా ఆలోచిస్తున్నారు’ పాల్ భార్య ఫిర్యాదు చేసింది.
‘నేను నా ఉద్యోగ ఆలోచనని ఇంటికి తీసుకురానని నీకు తెలుసు. అతనికి జరిగిన ఈ రెండో అన్యాయం నన్ను బాగా బాధిస్తోంది. జైల్లో తొమ్మిదేళ్లు అన్యాయంగా శిక్షని అనుభవించాక, కొంత జీవితాన్నైనా హాయిగా అనుభవించకుండానే అతను చంపబడటం ఎంత అన్యాయం!’
‘మీరు అతని హంతకుడ్ని పట్టుకోక మానరు. సహనంగా మీరు నిజాన్ని బయటకి తవ్వి తీస్తారు. అది నాకు తెలుసు.’
‘నేను ఈ మూడు రోజులూ చాలా తవ్వాను. కాని కావాల్సింది బయటపడలేదు. హేరిస్ బంధువులు ఎవరూ లేరు కాబట్టి అది కుటుంబపరమైన పగ లేదా లాభం కోసం కాదు. ఆ హత్య మాఫియా స్టైల్‌లో జరిగింది. అతను ఉన్న జైలు అధికారులు జైల్లో హేరిస్ ఎవరితో కలివిడిగా ఉండేవాడు కాడని, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేవాడని చెప్పారు. కాబట్టి జైల్లో కూడా అతను శత్రువులని సృష్టించుకోలేదు’
‘అతను ఏంగ్రేవింగ్‌లో శిక్షణ పొందారని మొన్న మీరు చెప్పారు. నాకోటి అనిపిస్తోంది.
జైల్లో అతను నకిలీ కరెన్సీ చేసే దొంగలతో చేయి కలిపాడేమో?’
పాల్ తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘నాకూ ఈ అనుమానం వచ్చి జైల్లో వార్డెన్‌తో చర్చించాను. ఆ జైల్లో అలాంటి నేరస్థులు లేరు. నకిలీ నోట్ల నేరస్థులని ఫెడరల్ జైల్లో ఉంచుతారు. జైలు నించి విడుదలైన మిగిలిన వారికి, అతనికి గల తేడా అతను చిత్రకారుడు అవడం. ఐతే ఆ హత్యకి కారణం అది అయ్యే అవకాశం లేదు. అతను గీసిన చిత్రాల ధరలు అతని మరణం వల్ల పెరగవు’
ఇద్దరూ హేరిస్ రైల్వేస్టేషన్‌లో పాల్‌తో మాట్లాడిందాని గురించి చర్చించుకున్నారు.
‘అతని తదనంతరం అతని ఫిక్సెడ్ డిపాజిట్ ఎవరికి చెందుతుందో విచారించాలి’ పాల్ అకస్మాత్తుగా చెప్పాడు.
‘ఏ బ్యాంక్‌లో దాచాడో చెప్పాడా?’
‘లేదు. అది కనుక్కోవడం కష్టం కాదు. మన ఊళ్లో తొమ్మిదేళ్ల క్రితం కేవలం మూడు బ్యాంక్‌లే ఉండేవి. న్యూయార్క్‌లోని పెద్ద బ్యాంక్‌లో దాచి ఉంటే మాత్రం కనుక్కోవడానికి టైం పడుతుంది’ పాల్ చెప్పాడు.
* * *
కేరింగ్టన్ సేవింగ్స్ బేంక్ మేనేజర్ క్లర్క్‌ని పిలిచి కోరాడు.
‘హేరిస్ మోరిస్ అనే అతని అకౌంట్ మన దగ్గర ఉందేమో నీకు తెలుసా?’
‘తెలీదు సార్’ అతను జవాబు చెప్పాడు.
‘డిపాజిటర్స్ రిజిస్టర్ తీసుకురా’
అతను తెచ్చాక దాన్ని తిరగేసి మేనేజర్ చెప్పాడు.
‘అతను మా డిపాజిటర్ కాదు’
మూడు బ్యాంకుల్లో అతను డిపాజిటర్ కాదన్న సంగతి పాల్ ఆ రాత్రి తన భార్యతో చెప్పాడు.
‘కేరింగ్టన్‌లో ఉంటూ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తెరవకపోతే హేరిస్‌కి అసౌకర్యం. ఒకవేళ...’ ఆలోచనగా ఆగింది.
‘ఏమిటి ఒకవేళ?’ పాల్ ఆసక్తిగా అడిగాడు.
‘పోలీస్ భార్యని కాబట్టి అందర్నీ అనుమానించే జాడ్యం నాకూ అంటుకుందేమోనని నాకు అనిపిస్తోంది’
‘ఎవరి మీద నీ అనుమానం?’
‘బ్యాంక్ సిబ్బంది మీద. ముప్పై ఏళ్ల దాకా హేరిస్ జైలు నించి రాడు కాబట్టి అడిగేవాళ్లు లేరని బ్యాంక్ సిబ్బందిలో ఎవరైనా దాన్ని స్వాహా చేశారేమో? అతను బయటకి రాబోతున్నాడన్న సంగతి పత్రికల్లోని వార్తల ద్వారా తెలుసుకుని, తమ నేరం బయట పడుతుందని అతన్ని చంపారేమో?’
‘నీ మానసిక జాడ్యానికి జోహార్లు. ఆ కోణంలో పరిశోధిస్తాను’
* * *
పాల్ మూడు రోజుల తర్వాత మూడు బ్యాంక్‌లకి వెళ్లి వారి అకౌంట్లని పరిశీలించేందుకు అనుమతించిన కోర్ట్ ఆర్డర్‌ని చూపించి చెప్పాడు.
‘నేను అనధికారికంగా వచ్చాను. మా పోలీస్ ఆడిటర్ న్యూయార్క్ నించి బయలుదేరబోతున్నాడు. ఆడిటర్ అంటూ వస్తే మీకు తెలీకుండా చేసిన అనేక తప్పులు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈలోగా మీరు సీరియస్‌గా హేరిస్ మోరిస్‌కి మీ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా అన్నది పరిశీలించండి. లేదా ఆయన మీ బ్యాంక్ రికార్డులన్నీ తిరగేయచ్చు’
ఆ రాత్రి రెండున్నరకి కేరింగ్టన్ సేవింగ్స్ బ్యాంక్ మేనేజర్ ఎడ్వర్డ్ పెద్ద సెడాన్ కారుని ఓ రోడ్ బ్లాక్ దగ్గర ఆపారు. పోలీసు సిబ్బందిలోని ఒకరికి ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది కాబట్టి అతను ఎడ్వర్డ్‌ని తేలిగ్గా గుర్తు పట్టాడు. అతని కారు వెదికితే నాలుగు సూట్‌కేస్‌ల నిండా డాలర్ నోట్ల కట్టలు దొరికాయి. మొత్తం ఎనిమిది లక్షల డాలర్లు. ఆ నగదు ఎక్కడిదని ప్రశ్నిస్తే అతను సరైన జవాబు చెప్పలేకపోయాడు.
మర్నాడు బ్యాంక్‌లో పరిశోధనలో పాల్‌కి అతను నాలుగు లాకర్లని క్రితం రోజు బ్యాంక్ మూసేసే సమయంలో ఆపరేట్ చేశాడని తెలిసింది. ఆ డబ్బు అందులోంచి వచ్చిందని పాల్ తేలిగ్గా ఊహించాడు.
రెండు వారాల పాటు పోలీస్ ఆడిటర్లు ఆ బ్యాంక్ అకౌంట్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించాక హేరిస్ మోరిస్ పదేళ్ల క్రితం ఆ బ్యాంక్‌లో అకౌంట్ తెరిచాడని కనుగొన్నారు. అతనికి జైలుశిక్ష పడ్డ ఆర్నెల్లకి అతని అకౌంట్‌ని మూసేసి అరవై వేల డాలర్లని డ్రా చేసారని కూడా గుర్తించారు. ఆ చెక్‌ని బ్యాంక్ సిబ్బందిలో ఎడ్వర్డ్ ఒకడే పాస్ చేశాడు.
మరో కొత్త విషయం కూడా వారు గమనించారు. రాష్ట్ర నియమాల ప్రకారం పదేళ్లుగా లావాదేవీలు జరగని అకౌంట్స్‌లోని డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లాలి. వాటి యజమానులు తిరిగి వచ్చి అడిగితే ఆ మొత్తాన్ని తిరిగి వారికి చెల్లిస్తారు. ఆ బ్యాంక్ నించి గత పనె్నండేళ్లుగా అలాంటి ఒక్క అకౌంట్ నించి కూడా నిధులు మళ్లించబడలేదు. కారణం తొమ్మిది సంవత్సరాల పదకొండో నెల ఆఖరి వారంలో ఆ సొమ్ము అంతా విత్‌డ్రా చేయబడుతూ వస్తోంది. ఆ చెక్కులన్నీ ఎడ్వర్డ్ పాస్ చేసినవే. అలా నగదు విత్‌డ్రా చేయబడ్డప్పుడల్లా ఎడ్వర్డ్ బ్యాంక్ లాకర్ ఆపరేట్ చేయబడిందని ఆడిటర్లు గుర్తించారు. తదుపరి విచారణలో మూడు రోజులు ప్రశ్నించాక ఎడ్వర్డ్ తన బండారం బయట పడుతుందని జైలు నించి విడుదలై వచ్చే హేరిస్‌ని చంపడానికి కిరాయి గూండాలని నియమించానని ఒప్పుకున్నాడు. హంతకుడైన ఆ యువకుడి పేరు, చిరునామా కూడా పాల్‌కి చెప్పాడు.
ఈ వ్యవహారం బయటకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లోని పదేళ్లుగా ఆపరేట్ చేయబడని అకౌంట్లని ఆడిట్ చేయమని ఆదేశించిందని పాల్ దినపత్రికల్లో చదివాడు.
* * *
‘ఇంతే చేసావే? నాకు ఆకలిగా ఉంది’ భార్య వండిన పదార్థాలని చూసి పాల్ అడిగాడు.
‘ఇంతకాలానికి మళ్లీ మీ ఆకలి తిరిగి వచ్చినందుకు సంతోషం. మీరు తినగలిగినంతా తినండి. నేను మళ్లీ వండుకుంటాను’ పాల్ చేతి మీద ప్రేమగా తడుతూ ఆమె చెప్పింది.
..............................
ఎడ్ లేసీ కథకి స్వేచ్ఛానువాదం
..............................

మల్లాది వెంకట కృష్ణమూర్తి