లోకాభిరామం

కుఛ్ మీఠా హోజాయె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి ఇది తిండి అని తెలియకుండానే ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు తినడం మొదలుపెట్టాడు. తలుచుకుంటే భయం కలుగుతుంది కానీ ఆ ప్రయత్నంలో తినకూడని తిండి పదార్థాలను తిని మొదట్లో ఎంతమంది పోయారో తెలియదు. మొత్తానికి మొదట్లో కూడా తినదగిన, తినదగని పదార్థాల గురించి పరిశీలన, పరిశోధన జరిగింది. సాధారణంగా దుంపలు చప్పగా ఉంటాయి. కాయలు చప్పగా, కొన్ని పుల్లగా ఉంటాయి. పండ్లు మాత్రం చాలామటుకు పులుపుతో మొదలయి తీపికి మళ్లుతాయి. మొదటి నుంచి అలవాటయిన ఈ తీపి తినడం ఒక ప్రత్యేకమయిన విషయంగా ఎందుకు మారిందని నా అనుమానం. చప్పని కాయలకన్నా తీయని పండ్లు తినడం మనిషి మొదటి నుంచే నేర్చుకుని ఉంటాడు. లోకాభిరామం మొదట్లోనే నేను తీపి తినడం చాలా ఇష్టపడతానని, పుస్తకాలు, చదవడం ఇష్టపడతానని బాహాటంగా చెప్పాను. మనిషి మొదటి నుంచి తింటున్న తీపిని ప్రత్యేక సందర్భాలకు మాత్రమే మార్చి అదొక గొప్ప విషయం అన్నట్టు ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు? నేను తీపి తినడం ఇష్టపడతానంటే అందునా పండ్లు తినడం మరింత ఇష్టపడతానంటే ఆదిమానవుల లక్షణం గలవాన్ని అని కదా అర్థం?
తీపి అనే రుచి వెనుక బోలెడంత రసాయన శాస్త్రం నిలబడి ఉంది. అది ఈనాటికి కూడా పరిశోధకులకు అర్థం కాకుండా గజిబిజి పెడుతున్నది. మనకు బెల్లం, చక్కెర అనే తీపి పదార్థాలు తెలుసు. చక్కెర అంటే మనకు కేవలం ఖండసారి ఒక్కటే తెలుసు. పటికబెల్లం అనే నాగోతు అనే మిశ్రీ అనే మరొక చక్కెర కూడా తెలుసు. అక్కడక్కడ కొంతమందికి గ్లూకోజ్ తెలిసి ఉంటుంది. కానీ ఇవన్నీ చక్కెరలేనని, చివరికి పండ్లలో ఉండే ఫ్రూక్టోజ్, ఇతరత్రా దొరికే మాల్టోజ్ లాంటివి కూడా చక్కెరలేనని మనకు చెప్పినా అర్థంకాదు. అంతెందుకు మనకు తెలిసిన షుగర్ అనే సూక్రోజ్‌లో గ్లూకోజ్ అణువులు వరుసబెట్టి ఉంటాయంటే మీరు నమ్ముతారా? చక్కని చక్కెర గురించి తిక్కతిక్కగా రసాయన శాస్త్రం చెపుతూ ఉంటే ఈసారి చెంచాతో చక్కెర ఎత్తినప్పుడు తీపికాక నా తిక్క మీకు గుర్తుకొస్తుందేమో అని నా ప్రయత్నం. మనం ఈ ప్రపంచంలో చాలా విషయాలను గురించి అర్థం చేసుకోకుండానే వాడుకుంటాము, అనుభవిస్తాము, అసలు సంగతి తెలియకుండానే పోతాము కూడా.
తేనెలో రకరకాల చక్కెరలు వచ్చి చేరతాయి. తేనె తినడం మందుతో తప్ప (పాపము క్షమించుగాక. నేనంటున్నది ఆ మందు కాదు) మరొక రకంగా తినడం మనకు అలవాటు లేదు. ప్రపంచంలో చాలామంది రొట్టెను తేనెలో ముంచుకుని తింటారు. టీలో, షర్బత్‌లో తేనె వేసుకుని తాగుతారు. మనకు తెలిసిందల్లా తెల్లని చక్కెర ఒకటే. మనకు చక్కెర అన్నది గొప్ప విషయం కింద లెక్క. తీపి అన్నది అంతకన్నా గొప్ప విషయం కింద లెక్క. ఎంత దూరం అంటే పొద్దున్న లేచి బ్రష్ మీద పేస్ట్ వేసుకుని నోట్లో పెట్టుకుంటే అది తియ్యగా ఉంటుంది. పుల్లని లేదా ఉప్పు రుచిగల టూత్‌పేస్ట్ ఎందుకు లేదని నాకు చిన్నప్పటి నుంచి ఒక పెద్ద అనుమానం. ఒకప్పుడు ‘క్యూ’ అనే పేరుగల ఒక అమెరికాయి టూత్‌పేస్ట్ ఒకనాడెప్పుడో వాడినట్టు జ్ఞాపకం. అది పులుపుగా ఉందని జ్ఞాపకం. కనీసం తీపిగా లేదని జ్ఞాపకం. నేను ప్రస్తుతం కూడా ప్రయత్నించి తీపి తక్కువ, ఒకంత చేదు ఉండే ఒకానొక టూత్‌పేస్ట్ వెతికి తెచ్చి వాడుకుంటాను. నా కారణంగా ఇంట్లో వాళ్లు కూడా ఆ చేదును అనుభవిస్తున్నారు. నా ఈ తిక్క టూత్‌పేస్ట్ అన్ని చోట్లా దొరకదు. ఈ నెల సరకుల కోసం వెళ్లినప్పుడు అది కనిపించింది. ఏకంగా నాలుగు ట్యూబ్‌లు తెచ్చేసుకున్నాము. అంటే మరో రెండు నెలలు దొరకకున్నా నా తిక్క కొనసాగుతుందని అర్థం.
మనకు తెలిసిన చెరుకు చక్కెర ఈ ప్రపంచంలో అన్నిటికన్నా తీయని పదార్థమని మనం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఈ ప్రపంచంలో లుగ్‌డూనేమ్ అనే రసాయన విశేషం ఒకటి ఉందట. నేను చూడనంత మాత్రాన ఆట అనడం తప్పు. ఉండే ఉంటుంది. ఆ పదార్థం మామూలు చక్కెరకు రెండున్నర లక్షల రెట్లు ఎక్కువ తీపిగా ఉంటుందట. ఓ కిలో తెచ్చుకుంటే ఎన్ని రకాలుగా వాడుకున్నా సంవత్సరంపైన వస్తుందేమో. ఇంతకూ ఆ తీపిని మనం భరించగలమా? కనీసం చీమలు భరిస్తాయా? తిక్క రకం ప్రశ్నలను పక్కనపెట్టి రసాయనం అసలు సంగతిని ప్రశ్నించి చూద్దాము.
చక్కెరలు అంటే అందులో ఉండేది కొంత కార్బన్, కొంత హైడ్రోజన్, కొంత ఆక్సిజన్ మాత్రమే. ఆశ్చర్యం కదూ! వీటితో మరి తీపి ఎక్కడి నుంచి వచ్చింది. వీటిలో కార్బన్, హైడ్రోజన్ ఇంచుమించు సమానంగా ఉండి ఆక్సిజన్ అందుకు రెండంతల ఉంటుంది. వాటి నిర్మాణం అసలయిన రహస్యం. ఆ నిర్మాణంలో కూడా ఒక చివర ఏదో అత్యంత రహస్యం. అది రహస్యమేమీ కాదుగానీ, కిటుకు అనవచ్చు. ఈ కింటుకు మూల ఒక తాళంచెవిలాగ ఉంటుంది. ఆకారం కాదుగానీ ఉదాహరణకు మాత్రమే. నాలుక మీద అందుకు సంబంధించిన తాళం ఉంటుంది అనవచ్చు. ఈ తాళం చెవి ఆ తాళానికి బిగిస్తే చాలు నాలుకకు తీపి తెలుస్తుంది. మెదడుకు ఆ వార్త మాత్రం తెలుస్తుంది. వాసన ముక్కులో కొంతకాలం నిలబడుతుంది. రుచి నాలుక మీద అంతకాలం నిలబడదు. అయినా తీపి తెలుస్తుంది. ఇక్కడ అసలు చిక్కు మరొకటి ఉంది. ఈ తాళం అణువుల ఏర్పాటు చక్కెరలోను ఉంది, ఇందాక మనం చెప్పుకున్న నేమ్ అనే అక్షరాలతో ముగిసిన రసాయనంలో కూడా ఉంది. ఈ రెండు రకాల రసాయనాల నిర్మాణం మరే రకంగాను ఒక రకంగా లేదు. అయినా సరే రెంటి వలన కలిగే ఫలితం ఒక్కటే. నాలుకకు తీపి తెలుస్తుంది.
మళ్లీ తిక్క ప్రశ్న. ఈ మధ్యన మంచి మామిడి పండ్లు తెచ్చుకుని తిన్నాము. ఇల్లు కుదువపెట్టవలసి వచ్చినా సరే మామిడికాయలు, మామిడి పండ్లు తెచ్చుకోవలసిందే, తినవలసిందే! ఆ అవసరం లేకుండా ఈ మధ్యన ఒక శ్రేయోభిలాషి బంధువు మామిడి పండ్లు పంపించారు. అవి ఆయన మంచితనంలాగే మరీ తీపిగా ఉన్నాయి. అంతకంటే రుచిగా ఉన్నాయి. అవి తిన్న తరువాత నాకు ఒక అనుమానం వచ్చింది. తింటున్న ఆ కొద్దిసేపు తప్పిస్తే రుచి ఏ రకంగాను నిలబడదు. అయినా సరే తీపి తినాలన్న యావ, అందులో క్వాలిటీ ఉండాలన్న తపన మనిషికి ఎందుకు కలిగింది? ఈ ప్రశే్న బయటకు అన్నాను కూడా. తింటున్న పండు రుచి కూడా ఒంటికి పట్టకుండా తిక్క ఆలోచనలు ఎందుకు వస్తాయని చివాట్లు ఎదురయ్యాయి. తీపితోబాటు అవి కూడా తియ్యగానే ఉన్నాయి.
తీపిని గురించి తెలుసుకోవాలని వెతుకుతూ ఉంటే కొన్ని చిత్రమయిన సంగతులు తెలిసాయి. ఒకప్పుడు ఐదు నక్షత్రాల హోటేల్‌లో కాఫీ కౌంటర్ పక్కన వక్క పొట్లాలలాంటివి కొన్ని పెట్టి ఉండడం చూచాను. ఏమిటో అనుకుని స్వభావం కొద్దీ రెండు జేబులో వేసుకుని తెచ్చుకున్నాను కూడా. ఆ పొట్లాల మీద బ్రాండ్ నేమ్ ఏదో రాసి ఉందిగానీ, ఆంతర్యం చూస్తే అందులో ఆస్పార్టేమ్ అనే రసాయనం ఉందని తెలిసింది. అది చక్కెరకన్నా తీపిగా ఉంటుంది. చక్కెర తినకూడని వాళ్లు దాన్ని వాడతారట. నేను ఒక పొట్లం విప్పి నోట్లో పోసుకుని చూచాను. తీపి అంటే మహా ఇష్టపడే నాకు కూడా అది వెగటుగా ఉంది. చివరికి నాలుక మీద కొంత చేదు మిగిలింది. టీ, కాఫీలలో చక్కెర బదులు ఇలాంటివి వాడితే అంత బాగుండదని నాకు అర్థమయింది. అందుకే హోటల్‌లో ఆ పొట్లాలు అక్కడ ఎవరికీ పట్టకుండా పడి ఉన్నాయి.
చక్కెర బదులు వాడే పదార్థాలన్నీ కృత్రిమంగా తయారుచేసిన రసాయనాలు మాత్రమే అనుకుంటే తప్పని ఈ మధ్యన తెలిసింది. సకారినా లాటిస్సిమా అని ఒక మొక్క ఉంది. కోస్తున్నాను. నేను చూడలేదు. కోసేది కోతలే గానీ ఈ గడ్డి వంటి మొక్కలను కాదు. ఈ గడ్డిలాంటి మొక్కలు ఆరడుగుల దాకా పెరుగుతాయట. వాటి ఆకులు ఆరు అంగుళాల వెడల్పు దాకా ఉంటాయట. ఆకు చూడడానికి విచిత్రంగా ఉంటుందట. అయితే దాన్ని తీసుకుని ఒక ముక్క నోట్లో వేసుకుని నమిలితే మాత్రం అందరూ కావాలనుకునే ‘మీఠా హోజాయె’ అన్న కోరిక తీరుతుందన్నమాట. ఈ మొక్క ఎక్కడో కొన్ని చోట్ల సముద్రం పక్కన పెరుగుతుందట. అలాగే గ్లైసిరైజా అని స్టీవియా అని లికోరిస్ అని మరికొన్ని మొక్కలున్నాయి. ఇవన్నీ తినడానికి చక్కెరకన్నా తీపిగా ఉంటాయి. అయితే ఎక్కడ దొరుకుతాయో తెలియదు. ఎవరికి తెలియదు? ప్రస్తుతం నాకు తెలియదు. ఈసారి తీపి తినాలనిపించినప్పుడు వంటింట్లోకి కాక ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాలి. అప్పుడు వాటి ఆచూకీ ఏమయినా తెలుస్తుందేమో చూడాలి.

కె.బి. గోపాలం