క్రైమ్ కథ

కొత్త ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మాకు నీ ఆఖరి పేజీల మేన్యుస్క్రిప్ట్ ఇవ్వు. లేదా నీ భార్యని చంపేస్తాం’
జిమ్ మేటర్సన్ తనని బెదిరించిన ఆ సన్నటి వ్యక్తి వంక చూస్తూ అతన్ని తను మొదటిసారి ఎప్పుడు చూశానా అని గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేశాడు. చాలాకాలం క్రితం. తన మొదటి నవల ప్రచురణకి మునుపు. తన పెళ్లికి మునుపే.
‘మాకు కావాల్సిందల్లా నీ పూర్తి నవల జిమ్’ అతను కోరాడు.
‘అది ఇంకా పూర్తి కాలేదు’ జిమ్ చెప్పాడు.
‘అందుకే ఇక్కడ ఉన్నాను’
జిమ్ తన ఎదురుగా కూర్చున్న తన ప్రచురణకర్త కార్ల్‌ని చూశాడు. ఎప్పటిలా అతను చక్కగా డ్రెస్ చేసుకున్నాడు. బూడిద రంగు సూట్. క్రీమ్ కలర్ సిల్క్ షర్ట్. గోధుమరంగు బూట్లు.
‘మనం మొదటిసారి ఎక్కడ కలిశాం కార్ల్?’ జిమ్ ప్రశ్నించాడు.
ఆ ప్రశ్నకి కార్ల్ కొద్దిగా వింతగా చూసి జవాబు చెప్పాడు.
‘‘్ఫర్ సీజన్స్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కి. అప్పట్లో నేను ఓ పబ్లిషర్ దగ్గర జూనియర్ ఎడిటర్‌గా పని చేస్తున్నాను’
‘నువ్వు ఆరంభించిన పబ్లిషింగ్ సంస్థకి మొదటగా పుస్తకాన్ని ఇచ్చింది నేనే’
‘అవును’ కార్ల్ టేబిల్ మీది పెన్సిల్ హోల్డర్‌ని పక్కకి నెట్టి తన లేప్ టాప్‌ని అక్కడ ఉంచి చెప్పాడు.
‘ఆహా! ఇంత టెక్నాలజీ నీ ముందుండగా నువ్వు ఇంకా పెన్‌తో రాస్తున్నావంటే నమ్మలేను’
‘నా పాఠకులు ఎన్నడూ దాన్ని పట్టించుకోలేదు’ జిమ్ పెన్ హోల్డర్‌ని తనవైపు తిప్పుకుంటూ చూశాడు.
అందులో పది బిక్ పెన్స్ ఉన్నాయి.
జిమ్‌కి మూడంతస్థుల కింద నించి ట్రాఫిక్ రొద వినపడకుండా ఆఫీస్ గది కిటికీల తలుపులు మూసి ఉన్నాయి. రాసేప్పుడు అతనికి నిశ్శబ్దం అవసరం. అతనికి ఆ సమయంలో కంపెనీ ఇచ్చేది స్టీరియోలో వినపడే క్లాసికల్ మ్యూజిక్.
కార్ల్ బ్రీఫ్‌కేస్ లోంచి తీసిన ఓ పెన్‌డ్రైవ్‌ని లేప్‌టేప్‌కి అమర్చి కీ బోర్డ్ మీద కొన్ని కమాండ్స్‌ని టైప్ చేసి మానిటర్‌ని జిమ్ వైపు తిప్పి చెప్పాడు.
‘ఏం కనపడుతోందో చూడు’
జిమ్‌కి స్క్రీన్ మీద ఓ వీడియో కనిపించింది. అందులో మన్‌హేటన్‌లోని ఓ వీధిలో చేతిలో హేండ్‌బేగ్‌తో నడిచి వెళ్లే ఓ యువతి కనిపించింది. అది నాలుగైదు అంతస్థుల పైనించి తీసిన వీడియో. ఆ యువతి తనకి పరిచయమైన వ్యక్తిగా తోచింది. కెమెరా జూమ్ అవడంతో జిమ్ చెప్పాడు.
‘ఆమె ఎమిలీ!’
‘ఔను. నీ జ్ఞాపకశక్తికి జోహార్లు’
అకస్మాత్తుగా ఆమె చుట్టూ ఓ ఎర్ర సర్కిల్. దాని మధ్య ప్లస్ ఆకారంలో నల్లటి గీతలు కనిపించాయి. అది రైఫిల్ టార్గెట్‌గా గుర్తించాడు.
‘తర్వాతి ముప్పావు గంట దాకా నలుగురు ఆమెని హైపవర్ రైఫిల్స్‌తో కనిపెడుతూంటారు. నీ భార్య ఎమిలీ ఇంటికి తిరిగి రావడానికి ముప్పావుగంట పైనే పడుతుంది. కాబట్టి నువ్వు ముప్పావుగంటలో నీ కొత్త నవల ఆఖరి పేజీలు రాసి ముగించి ఇస్తే సరే. లేదా ఆమె తల్లో ఓ గుండు దిగుతుంది’ కార్ల్ హెచ్చరించాడు.
తక్షణం జిమ్ గుండె కొట్టుకునే వేగం పెరిగింది. మరో వాక్యం మాట్లాడి, అది ప్రాక్టికల్ జోక్ అంటాడని జిమ్ ఎదురుచూశాడు. కాని కార్ల్ మొహంలోని సీరియస్‌నెస్‌ని చూశాక అది జోక్ కాదని గుర్తించాడు.
‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రోజుల్లో ఏదైనా సాధించచ్చు. మా వెబ్‌సైట్‌లో రచయితలతో పాఠకుల ముఖాముఖి, రచయిత ఆరంభించిన కథని పాఠకులు కొనసాగించడం లాంటివన్నీ పాఠకులు రచయిత పేరుని మర్చిపోకుండా ఉండటానికి ఉపయోగిస్తాయి. కాని ఇక నువ్వు రాసినా, రాయకపోయినా మరో పాతికేళ్ల దాకా పాఠకులు నీ పేరుని మర్చిపోలేరు. నువ్వు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటే నవలని ఇంకాస్త త్వరగా రాయచ్చు. కాపీ అండ్ పేస్ట్ వల్ల చాలా సమయం ఆదా అవుతుంది’
జిమ్ కుర్చీలోంచి లేవబోయాడు. కాని కార్ల్ చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్‌ని చూసి ఆగిపోయాడు.
‘ఇక్కడ నించి నువ్వు నీ భార్యని కాపాడలేవు. ఏం జరుగుతోందో ఆమెకి తెలీదు. నువ్వు ఎవరికీ ఫిర్యాదు చేయలేవు. ఇంక నీకు మిగిలింది నలభై నాలుగు నిమిషాలే. నా నించి ‘ఒద్దు’ అనే ఆజ్ఞ అందకపోతే ఎమిలీ మరణిస్తుంది’ కార్ల్ చెప్పాడు.
జిమ్ మానిటర్లో లోయర్ మన్‌హేటన్‌లో నడిచే తన భార్య వంక చూస్తూండిపోయాడు.
‘ఇది లైవ్ వీడియో. దీన్ని ఇంటర్‌నెట్ ద్వారా చూస్తున్నావు. ఆమెని చంపడానికి నియమించిన వారిలో ఒకరు మాజీ సైనికుడు. ఇంకొకరి సేవని పూర్వం వినియోగించాను. అతను గురి చూసి పేల్చడంలో నిపుణుడు. మరో ఇద్దరిలో ఎవరూ ఈ వృత్తికి కొత్తవాళ్లు కారు. ఈ సంవత్సరం నీ పేరుతో అచ్చయిన పుస్తకాలు ఎన్ని అమ్మామో తెలుసా? లక్షలు. కొత్త పుస్తకం మీద వచ్చే ఆదాయాన్ని కోల్పోదలచుకోలేదు. ఇప్పటికే దాని విడుదల తేదీ మీద ప్రకటనలకి చాలా ఖర్చు చేశాను. రేపు ప్రెస్‌కి స్క్రిప్ట్‌ని అందించకపోతే నా షెడ్యూల్ ప్రకారం నవల విడుదల కాదు. అప్పుడు దీని కోసం ఎదురుచూసే పాఠకుల్లో కొందరికి నిరాశ కలిగి తర్వాత కొనకపోవచ్చు’
‘నేను ఏదైనా ఆలోచించి కాని రాయనని నీకు తెలుసు. ముఖ్యంగా క్లైమాక్స్‌ని’ జిమ్ అసహనంగా చెప్పాడు.
‘నువ్వు సంవత్సరానికి ఒక్క నవలనే రాయగలవు. నీ పేరు ఒక బ్రాండ్. దాని పట్ల పాఠకులు ఆకర్షించబడతారు’
‘కమర్షియల్ బ్రాండ్స్ ప్రకటనల ద్వారా పాపులర్ ఐతే, నా పేరు నేను రాసే కథని, దాన్ని నేను నడిపే విధానాన్నిబట్టి పాపులర్ అవుతుంది’
‘నిజమే. అట్ట మీద నీ పేరు లేకపోయినా అట్ట వెనక నీ ఫొటోని ప్రచురిస్తే చాలు. లక్షల కొద్దీ ఆదాయం వస్తుంది. ఐదు వందల డాలర్లకి కూడా మనుషుల్ని చంపే దేశం ఇది. కాబట్టి నేను అబద్ధం చెప్తున్నానని అనుకోవద్దు. అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకునే నీ దగ్గరికి వచ్చాను’
‘నాకు నీ పద్ధతి నచ్చలేదు’ జిమ్ కోపంగా చెప్పాడు.
‘నాకు మాత్రం ఆనందంగా ఉందా? నువ్వే నన్నీ పరిస్థితికి తీసుకువచ్చావు. నీ రచనల ద్వారా మా పబ్లిషింగ్ హౌస్ నిర్మాణం పూర్తయింది. నువ్వు దాని పునాదులని కదిలించే పని చేయకు. ఆఖరి తొమ్మిది పేజీలు రాసివ్వు’
‘నీకు పిచ్చెక్కింది కార్ల్’
‘జిమ్. మాటలతో సమయాన్ని వృధా చేయక పెన్సిల్ అందుకుని రాయడం మొదలుపెట్టు. ఇప్పటికే ఏడు నిమిషాలు వృధా అయ్యాయి’
‘అరగంటలో తొమ్మిది పేజీలు రాయలేను’
‘రెండు నెలల క్రితం నువ్వు రఫ్ డ్రాఫ్ట్‌ని, మొదటి అధ్యాయాన్ని చూపించావు. మూడ వందల నలభై రెండు పేజీలని రెండు నెలల్లో రాయగలిగావు. కాబట్టి నువ్వు కళ్లు మూసుకుని కూడా అరగంటలో ముగింపుని రాయగలవు’
‘సమస్య ఏమిటంటే ఈ కొత్త నవలని ఎలా ముగించాలో నాకు తట్టడంలేదు. దానే్న రైటర్స్ బ్లాక్ అంటారు. ఇంక ఆలోచనలు సాగని డెడ్ ఎండ్ స్థితి అది’
‘రైటర్స్‌కి బ్లాక్ రావచ్చు. కాని బ్రాండ్స్‌కి రాదు. అంతేకాక దీని ముగింపు గురించి మొదటి రోజే నువ్వు నాకు చెప్పావు’
‘అది సరైన ముగింపు కాదని అప్పుడే నాకు తెలుసు పాఠకులు ఊహించని ముగింపు ఈలోగా తడుతుందని అనుకున్నాను..’
జిమ్ లేప్‌టాప్ మానిటర్ని చూశాడు. ఎమిలీ ఓ మాల్ లోంచి బయటకి వస్తూ కనిపించింది. ఆమె పొడుగాటి గోధుమరంగు జుట్టు గాలికి ఎగురుతోంది.
‘పాత్రలు నా మాటని వినడం లేదు...’
‘కొత్త రచయితలు మాట్లాడినట్లు మాట్లాడక. నీ పాత్రలు జీవించి లేవు. మీ ఆవిడ జీవించి ఉంది - ప్రస్తుతానికి’
‘కాని ఈ పుస్తకం మీద నా పేరు ఉంటుంది. ఇంకొకరిది కాదు’ జిమ్ అభ్యంతరం చెప్పాడు.
‘ఇది థ్రిల్లర్. హీరో హీరోయిన్‌ని విలన్ నించి రక్షిస్తాడు. విలన్ చంపబడతాడు. ఇంతకంటే ఏం కావాలి?’
‘ఎలా ఛస్తాడు అన్నదే ముఖ్యం. లేదా అది థ్రిల్లర్ అవదు. పాఠకులు నా నించి ఏం ఆశిస్తారో అది ఇవ్వకపోతే నా బ్రాండ్ విలువ తగ్గుతుంది. వారు ఆశించేది ఎదురుచూడని ముగింపు’
‘నువ్వు ఫేంటసీ రైటర్‌వి కాదు. పాత్రలు జీవించే ప్రపంచంలో ఎలా జరిగినా సహజంగానే ఉంటుంది’
‘ఐతే ఈ శ్రమంతా దేనికి? దానికి ముగింపు నువ్వే రాయి. లేదా ఇంకెవరి చేతైనా రాయించుకో. అందుకు నీకు అనుమతి ఇస్తున్నాను.’ జిమ్ కోపంగా అరిచాడు.
‘నాకా ఆలోచన రాలేదంటే ఆశ్చర్యపో. ఏడాదికి ఓసారి వచ్చే నీ పుస్తకాన్ని చదివే పాఠకులు, విమర్శకులు అందులోని తేడాని ఇట్టే గుర్తిస్తారు. ఇంకెవరైనా రాస్తే అందులో వారికి నీ కంఠ ధ్వని వినిపించదు. చిన్న వాక్యాలు, మొత్తం చెప్పకుండా వాక్యాన్ని మధ్యలో ఆపడం, విషయాన్ని వివరించడానికి నువ్వు ఇచ్చే పోలికలు... ఇవేవీ ఇంకెవరికీ చేతకావు. నా కంపెనీలోని ఎడిటర్స్ కంటిన్యుటీని, స్పెల్లింగ్ తప్పులని, గతించిన ఫేజ్‌లని, వాస్తవాల్లో తేడాలని మాత్రమే సవరిస్తారు తప్ప నీలాగా కొత్తవి రాయలేరు. ఇంక నీకు ముప్పై ఐదు నిమిషాలే ఉన్నాయి’
జిమ్ నుదుట చిరు చెమటలు పట్టాయి. మానిటర్ మీదకి అతని దృష్టి మళ్లింది. చేతిలో షాపింగ్ బేగ్స్‌తో ఎమిలీ ఓ చెప్పుల దుకాణంలోకి వెళ్తోంది. చేతిలో బేగ్స్‌ని నేల మీద పెట్టి, గాలికి రేగిన జుట్టుని సర్దుకుని లోపలికి వెళ్లింది.
‘ముగింపుకి నాకో వారం కావాలి’ జిమ్ కోరాడు.
కార్ల్ తలని అడ్డంగా ఊపి చెప్పాడు.
‘డెడ్‌లైన్ ముగిసింది. రేపు ప్రెస్‌కి వెళ్తే కాని షెడ్యూల్ చేసినట్లు క్రిస్మస్‌కి ఆ పుస్తకాన్ని విడుదల చేయలేం. ఆఖరి తొమ్మిది పేజీలు రాసి నా మొహాన కొట్టు. ఈ పుస్తకం ఆలస్యం ఐతే తర్వాత వీటికి పుస్తకాల షాపుల్లో ముందు వరసల్లో షెల్ఫ్‌లు దొరకవు. వేరే వాళ్ల పుస్తకాలు అక్కడ కనపడటం మనిద్దరికీ మంచిది కాదు. లక్షల ఆదాయం కోసం ఓ వ్యక్తిని చంపడం అమెరికాకి కొత్త కాదు. నిన్ను చంపితే ఆఖరి తొమ్మిది పేజీలు ఎలా ఉన్నా పట్టించుకోరు. ఆ సెనే్సషనే అవి అమ్ముడయ్యేలా చేస్తుంది. కాని అది నా ఆఖరి ఛాయిస్’
జిమ్ అతని వంక నిస్సహాయంగా చూశాడు.
‘ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంలో టైమింగ్ చాలా ముఖ్యం’
‘నా భార్యని చంపే విషయంలో నువ్వు అబద్ధం ఆడుతున్నావు’
వెంటనే కార్ల్ లేప్‌టాప్ కీ బోర్డు మీద ఏదో టైప్ చేయగానే ఓ దినపత్రిక కనిపించింది. తన కుటుంబ సభ్యులని చంపి ఆత్మహత్య చేసుకున్న, పదహారో శతాబ్దపు రొమాంటిక్ నవలలు రాసే రచయితకి చెందిన వార్త అది.
‘రచయితగా ఇతని పని దాదాపు ఐపోయింది. నేను అతని పుస్తకాల మీద చాలా పెట్టుబడి పెట్టాను. ఈ వార్త వల్ల పాఠకుల్లో మళ్లీ ఆసక్తి రేకెత్తడంతో నెల తిరక్కుండానే మొత్తం స్టాక్ అమ్ముడైంది - పదహారు లక్షల డాలర్ల ఆదాయం వచ్చింది’
‘నన్ను చంపు. లేదా ఎమిలీని. ఆ తర్వాత ఇక నా పుస్తకాలు నీకు ఉండవు’
‘వ్యాపారంలో ఎవరూ శాశ్వతం కాదు. ఫ్రాన్స్‌లో నీలా రాసే ఓ రచయిత నవలల్ని అనువాదం అని చెప్పకుండా ప్రచురించదలిచాను. సరైన పబ్లిసిటీతో అతని పుస్తకాలు టన్నుల కొద్దీ అమ్ముడవుతాయని నాకు నమ్మకం ఉంది’ కార్ల్ కఠినంగా చెప్పాడు.
జిమ్ నవ్వలేక నవ్వినట్లుగా నవ్వి అడిగాడు.
‘నీకీ ఆలోచన ఎంత కాలంగా ఉంది?’
‘కొన్ని నెలల నించి. నువ్వు పోలీస్ ఫైరింగ్ రేంజ్‌కి వెళ్లావు గుర్తుందా?’
‘అవును. నా తర్వాతి పుస్తకానికి రీసెర్చ్‌కి వెళ్లాను’
‘ఆ రోజు నువ్వు ఎన్ని రైఫిల్స్‌ని పేల్చావో గుర్తుందా?’
‘ఐదారు’
‘వాటిల్లో ఒకటి నీ వేలిముద్రలతో సహా నా అధీనంలో ఉంది’
‘కాని పోలీసులు నమ్మరు’
‘అనేక మంది హంతకులని నవలల్లో సృష్టించిన ప్రఖ్యాత క్రైం రచయిత తన భార్యని హత్య చేశాడంటే ఎందుకు నమ్మరు?’
‘నువ్వు ఎమిలీని చంపితే ఆ సంగతి పోలీసులకి చెప్తాను’
‘కోర్ట్ కేస్‌కి నిజం కాదు ఆధారాలు అవసరం. నీకు ఇప్పుడు ఎలిబీ కూడా లేదు. కాబట్టి ఈ పుస్తకం పాఠకులు ముందుగా ఊహించే ముగింపుతో రాసెయ్. ఇంక నీకు ఇరవై ఎనిమిది నిమిషాలే ఉన్నాయి. జేమ్స్‌బాండ్ అన్ని పేలుళ్ల మధ్య నించి సూట్ నలక్కుండా బయటపడటం లేదా?’
‘కాని నా పాత్ర వేరు. నా పాత్రకి నీతీ, నిజాయితీలు ఉన్నాయి’
‘సమయం వృధా చేస్తే నష్టపోయేది నువ్వే. నువ్వు నీ భార్య ఎమిలీని ఎక్కువ ప్రేమిస్తున్నావా? లేక నీ పాత్రలనా? అది తేలే సమయం ఇది’ కార్ల్ హెచ్చరించాడు.
‘సరే. కానీ నువ్వు ఇచ్చిన గడువులో తొమ్మిది పేజీలు పూర్తి చేస్తానని నేను అనుకోను’
‘సారీ! అదనంగా ఇంకో ఐదు నిమిషాలు కూడా ఇవ్వను. ఎంత త్వరగా ముగించగలిగితే అంత త్వరగా ముగించు’
జిమ్ ఫోల్డర్‌లోంచి తను రాసే కాగితాలని అందుకున్నాడు. తర్వాత పెన్ హోల్డర్‌లోంచి ఓ ఎర్రటి పెన్‌ని అందుకుని కేప్ తెరిచి ఆ పేజీలో తను ముగింపు ఛాప్టర్ ముందు రాసింది కొంత చదివి, ఓ పేరా చుట్టూ గీత గీసి దాన్ని కార్ల్‌కి అందించి చెప్పాడు.
‘దీన్ని చదువు’
కార్ల్ లేప్‌టేప్‌ని పక్కకి జరుపుతూ చెప్పాడు.
‘దీన్ని ఇదివరకే చదివాను. బావుంది. దీని తర్వాత ఏమవుతుంది అన్నది నా ప్రశ్న’
‘ఇది’
జిమ్ చేతిలోని పెన్ తక్షణం కార్ల్ కుడి కంట్లోకి దిగింది. తర్వాత కుర్చీలోంచి లేచి దాన్ని ఇంకాస్త లోపలికి - అతని మెదడులోకి దింపాడు. కార్ల్ అరుస్తూ కుర్చీలోంచి వెనక్కి వెల్లకిలా పడిపోయాడు. అతని కాళ్లు ఓసారి, ఇంకోసారి, మరోసారి కొట్టుకుని ఆగిపోయాయి. జిమ్ లేచి బల్ల చుట్టూ తిరిగి నేల మీద పడి ఉన్న ఆ ప్రచురణకర్తని చూశాడు. ఆశ్చర్యంగా చాలా తక్కువ రక్తం కారింది. ఈసారి హత్య గురించి రాసినప్పుడు ఇది గుర్తుంచుకోవాలి అనుకున్నాడు. తన గుండె కొట్టుకునే వేగం తగ్గేదాకా దీర్ఘంగా గాలి పీల్చి వదలసాగాడు. తర్వాత తలుపు దగ్గరికి వెళ్లి తెరిచాడు. అది ఎటాచ్డ్ టౌన్ హాల్ తలుపు. కింది అంతస్థులోంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. తక్షణం జిమ్ మెట్ల మీంచి కిందికి పరుగెత్తాడు. ఎమిలీ టీవీ చూస్తూ కనిపించింది.
భర్తని చూసి చిన్నగా నవ్వింది. జిమ్‌కి తన గుండె పేలిపోతుందా అనిపించింది. ఆమె ఏదైనా మాట్లాడబోయే ముందే ఆమె చేతిని పట్టుకుని గాఢంగా చుంబించాడు.
‘నిన్ను చూట్టం నాక్కూడా సంతోషంగా ఉంది’ ఎమిలీ భర్త ఎమోషన్‌ని గమనించి చెప్పింది.
‘నువ్వు లోపలికి రావడం నేను వినలేదు’
‘మీ ఆఫీస్ తలుపు మూసి ఉంటే నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయనుగా. మీరు రాస్తున్నారని అనుకున్నాను’
‘నువ్వు లోపలకి వచ్చాక దుస్తులు మార్చుకున్నావా?’ భార్య దుస్తులని గమనించి అడిగాడు.
‘లేదు. ఏం?’
‘నువ్వు షాపింగ్‌కి మన్‌హేటన్‌కి వెళ్లావా?’
‘లేదు. బ్రాంక్స్‌లోని నా ఫ్రెండ్ ఇంటికి వెళ్లాను. ఏం?’
కంప్యూటర్స్‌తో ఈ రోజుల్లో ఏదైనా చేయచ్చు అని అతనికి అనిపించింది. కార్ల్ అబద్ధాలు ఆడతాడని తెలిసినా ఇంత పెద్ద అబద్ధం ఆడతాడని ఊహించలేదు.
‘ఎమిలీ. నేను ఇంకో గంటా - గంటన్నరలో కొత్త నవలని ముగిస్తాను’
‘అలాగే. నేను నిద్రపోతాను’ ఎమిలీ జవాబు చెప్పింది.
జిమ్ కార్ల్ శవాన్ని ముందు కార్ గేరేజ్‌లోకి తీసుకెళ్లాడు. ఫైరింగ్ రేంజ్‌లో నవల కోసం ఓ పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాఫియా వాళ్లు చంపించే శవాలని న్యూయార్క్‌కి తూర్పు దిశలోని సముద్రంలో పడేస్తారని చెప్పడం గుర్తొచ్చింది. అక్కడ అలలు శవాలని బయటకి పడేయకుండా లోపలకి లాక్కెళ్తాయి.
కారుని పోనిస్తూ ఆలోచించాడు.
కార్ల్ సెల్‌ఫోన్‌ని ఒకటి, రెండు రోజులు వాడి, రెస్ట్‌రెంట్స్‌కి, ఎయిర్‌లైన్స్ ఆఫీసులకి ఫోన్ చేసి కార్ల్ జీవించి ఉన్నట్లుగా చేయాలి. తర్వాత దాన్ని పగలగొట్టి ముక్కలని చెత్త డబ్బాలో వేయాలి.
మర్నాడు ఉదయం ఎమిలీ అతన్ని అడిగింది.
‘చెయ్యి కోసుకుందా?’
‘లేదు. ఎర్ర ఇంకు అంటింది’
‘నిన్న నేను బయటకి వెళ్లాక మీ పబ్లిషర్ కార్ల్ వస్తున్నానని చెప్పిన మెసేజ్ ఆన్సరింగ్ మెషీన్‌లో రికార్డయింది. విన్నావా?’
‘లేదు. అతన్తో ఫోన్‌లో మాట్లాడాను’
‘ఏం పని?’
‘మామూలే. డెడ్ లైన్స్’
‘నవలకి కొత్త ముగింపు దొరికిందా?’ ఆమె ఆసక్తిగా అడిగింది.
జిమ్ తన కుడి చేతికి అంటిన ఎర్ర సిరా వంక చూసి చెప్పాడు.
‘దొరికింది. ఈ నవల ముగిసే పద్ధతి నాకు తృప్తికరంగా ఉంది.’

(టిమ్ మలినీ కథకి స్వేచ్ఛానువాదం)

మల్లాది వెంకట కృష్ణమూర్తి