అమృత వర్షిణి

వెలుగుపూల వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళి కేవలం హిందువులకే పరిమితమైన పండుగ కాదు. ఇప్పుడు ఇది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలో క్రిస్మస్ తరువాత ఎక్కువమంది జరుపుకనే వేడుకగా ప్రసిద్ధి పొందింది. ఇది ఆర్థికరంగానికి కొత్తవెలుగును ఇస్తోంది. ఈ ఒక్క పండుగకు అటు బంగారం, ఇటు బాణసంచా మార్కెట్లో కనీసం పదివేల కోట్ల మేరకు వ్యాపారం జరుగుతుంది.
.................
కృతయుగంలో హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహస్వామి, భూదేవిలకు అసుర సంధ్యా సమయంలో నరకుడు జన్మించాడు. లోకకంటకుడయ్యాడు. అయితే విష్ణువు చేతిలోకాక, తల్లి అయిన తన చేతిలో మాత్రమే అతడు మరణించేలా భూదేవి వరం పొందుతుంది.
.......................
దీపావళి సాధారణంగా అమావాస్య నాడు చేసుకుంటారు. కానీ ఇది ఐదురోజుల పండుగగా చేసుకుంటారు. ధనత్రయోదశి , నరక చతుర్దశి, లక్ష్మీపూజ, పడ్వా (బలిప్రతిపద), భాయ్ దుజ్, భయ్యా దూజిగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సంప్రదాయం అనుసరిస్తారు.
......................

దీపావళి వెలుగులు ఇప్పుడు విదేశాల్లోనూ ఎక్కువగానే కన్పిస్తున్నాయి. పాకిస్తాన్, నేపాల్, ఫిజి, మారిషస్‌లలో దీపావళికి ప్రభుత్వ సెలవుగా ప్రకటించాయి అక్కడి ప్రభుత్వాలు. అమెరికాలో 2003 నుంచి అధికారికంగా దీపావళి పండుగను గుర్తించారు. జార్జి బుష్, ఒబామాల హయాంలో వైట్‌హౌస్‌లో దీపావళి నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, బ్రిస్బేన్‌లలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీపావళి నిర్వహించడం ఆనవాయితీ. ఒక్కోచోట కనీసం లక్షమంది గుమిగూడటం విశేషం. ముఖ్యంగా ఫెడరేషన్ స్క్వేర్‌లో జరిపే దీపావళి వేడుకకు గతఏడాది 70 వేలమంది హాజరయ్యారు. ఇండోనేషియాలో గలుంగాన్‌గా, నేపాల్‌లో తిహార్, స్వాంతిగా, మయన్మార్‌లో బౌద్ధులు దీపావళిని పాటిస్తారు. సింగపూర్, శ్రీలంకల్లోనూ ఈ వెలుగులు కన్పిస్తాయి.
....................

దీపావళి..కుల మత ప్రాంతాలకు సంబంధం లేకుండా విశ్వవాప్తమవుతున్న వెలుగుపూల పండుగ. చిన్నాపెద్దా, ఆడామగా అంతా ఆనందడోలికల్లో మునిగితేలే వేడుక. ఆధ్యాత్మిక సౌరభానికి మచ్చుతునక. ఆనందాతిశయానికి చక్కటి వేదిక.
యుగయుగాల నుంచి సంప్రదాయంగా వస్తున్న ఈ దీపాల పండుగ మరింతగా విస్తరించి బాణసంచా వెలుగుల్లో దేదీప్యమానమవుతోంది. ఈ వేడుకకు కృతయుగంలో నాంది పడగా కలియుగంలో విశ్వవ్యాప్తమైంది. అందుకే హిందువుల జనజీవన స్రవంతిలో దివ్య దీపావళి చెప్పుకోదగిన వేడుక. విశేషం ఏమిటంటే ఇది హిందువులకు పండుగ అయితే హిందువేతరులకు వేడుక. ఆనందాన్ని చాటుకోవడానికి ఇంతకంటే చెప్పుకోదగ్గ, ఆచరించతగ్గ పండుగ మరోటి లేదు. కుటుంబ బాంధవ్యాలు, ఆర్థిక వ్యవహారాలు, మత విశ్వాసాలు, శాంతి సామరస్యాలతో ఈ వేడుక ముడిపడి ఉంది. అందుకే దీపావళి వస్తోందంటే అమావాస్య చీకట్లు తొలిగి, ప్రవర్థమానమైన పూర్ణచంద్రుడిలా అందరిమోము వెలిగిపోతుంది. యుగయుగాలుగా అనుసరిస్తున్న దీపావళి సంబరంలోని విశేషాలు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో కన్పిస్తూనే ఉంటాయి. దీపావళికి వారం పదిరోజుల నుంచే చిన్నాపెద్దల చిటపటలు, సిసింద్రీల అల్లర్లు విన్పిస్తూనే ఉంటాయి. ప్రతి కుటుంబంలో దీపావళి సంరంభం అమావాస్య కన్నా ముందే మొదలైపోతుంది.
సిసింద్రీల సందడి
దీపావళి అంటే దివ్వెల పండుగ. ఒకప్పుడు దీపావళి అమావాస్య చీకట్లు ముసురుకుంటున్న వేళ ప్రమిదల్లో దీపాలు వెలిగించి, దిబ్బుదిబ్బు దీపావళి సంప్రదాయం ముగించి, నోరు తీపి చేసుకుని లక్ష్మీ ఆరాధన చేసి పిండివంటలు ఆరగించి ఆనందించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. ప్రమిదలున్నా ఆధునిక సొబగులద్దుకున్న కొవ్వొత్తులు, విద్యుద్దీపాలు తోరణాలుగా మారిపోయి కొత్తకాంతులు వెదజల్లుతున్నాయి. అప్పుట్లో టపాసుల మోత తక్కువే కానీ ఇప్పుడు మోతలేని బాణసంచా లేనేలేదు. ఇప్పుడు ఆధునిక బాణసంచా వెలుగులు సమ్మోహన పరుస్తున్నమాట నిజమే. కానీ ఇవేవీ అందుబాటులో లేనప్పుడు ఇంట్లోనే చిన్నపాటి దీపావళి వస్తువులు తయారుచేసుకోవడంలో పుట్టుకొచ్చిన ఆనందం, ఆత్మసంతృప్తి ఇప్పుడు అరుదే. ఇప్పటి బాణసంచా అద్భుతంగా వెలుగులు విరజిమ్ముతూంటే అప్పట్లో బాణసంచా ఆరీవెలిగినా సరే అది తయారు చేసినవారి మోములో వెయ్యి మతాబుల వెలుగు కన్పించేది. అసలు దీపావళి జనజీవన స్రవంతిలో మిళితమైపోయింది. బాగా అల్లరి చేసే లేదా చురుకుగా ఉండే పిల్లల్ని మనం ‘సిసింద్రీ’లని పిలుస్తాం. దీపావళి వేళ ‘సిసింద్రీ’ అనే ఓ బాణసంచా విశేషం చేసే అల్లరి అంతాఇంతాకాదు. వేలెడంత లేని ఈ సిసింద్రీ గొట్టం దిశానిర్దేశం లేకుండా ఓ క్షణం పాటు తనకే తెలియని విధంగా రివ్వున తిరుగుతూ కంగారుపెట్టే ఓ విశేషం. ఆ అల్లరిలో ఆనందం, ఈ పిల్లాడిలో విశేషం సిసింద్రీ గొప్పదనానికి లింకేంటి అంటే అదే దీపావళి మహత్మ్యం అనుకోవాలి. చలిమిడిముద్దలా చురుకులేనివాళ్లు సైతం వెన్నముద్దల్లా వెలుగుముద్దల్ని అలవోకగా జారవిడిచే మతాబులు వెలిగించినప్పుడు ఆ బుద్ధావతారాల మోములు ఆనందంతో విచ్చుకుంటాయంటే నమ్మాల్సిందే. అదీ, ఇంటిలో సురేకారం, కాస్త రజను, కాస్త గంధకం, ఆ మాత్రం ఆముదం రంగరించి, కాగితం గొట్టంలో దట్టించి, దానికి మతాబని పేరుపెట్టి, అది పట్టుకునే వైపు చివర చేయికాలకుండా ఇసుకపోత మతలబుతో ముడివేసి, మునిమాపు వేళ వెలిగిస్తే ఆ ఇంట్లో పిల్లాపాపల కళ్లల్లో కన్పించే కాంతిముందు ఈ వెన్నముద్ద చిన్నబోవడం పెద్దవిశేషం కాదు. బొగ్గును, సురేకారాన్ని, గంధకాన్ని మెత్తగా చేసి, వస్త్రంలో ‘జల్లెడ’పట్టి చిచ్చుబుడ్లు, తారాజువ్వల్లో దట్టించి ఆ పైన వెలిగిస్తే బుడ్డీ చిమ్మే వెలుగుపూల నింగిని, జువ్వలు రయ్యిమని ఎగురుతూ తారలను తాకినంత సంబరం వాటిని వెలిగించినవారికి, చూసినవారికి కలగడం ఈ వేడుకలో ఓ అద్భుతఘట్టం. తాటాకుతో చేసిన టపాసులు, టపాసుల గుత్తుల దొంతరలు గంపగుత్తగా వెలిగిస్తే కలిగే ఆనందం ఎవరినీ ఓ చోట నిలువనివ్వదు. ‘ఒరే..కళ్లూఒళ్లూ జాగ్రత్తర్రా’ అంటూ పెద్దలు ఆప్యాయంగా చేసే హెచ్చరికలు ఎవరు వింటారు కనుక. ఆ ఆనందాల హోరులో చెవుల్లో రొద తప్ప వారి ఎదల్లో కలిగే భయం ఎవరి చెవిని సోకాలి గనుక. పోపువేసేటప్పుడు.. వేగినప్పుడు చేతిపై పడే ఆవాలు, జీలకర్ర చురుక్కుమన్నట్లు కాకరపువ్వొత్తుల వెలుగులు చిన్నారులకు ఇష్టమైన బాణసంచా. భూచక్రాలు వెలిగించి వాటి నిప్పురవ్వలు తాకకుండా ఎగిరి గంతేస్తూ తప్పించుకుంటూంటే వారి పెద్దల మనసుపెట్టే పరవళ్ల సవ్వడి... వారి కళ్లే చెబుతాయి. విష్ణుచక్రాలను చేతపట్టి వెలిగించి, అవి నిప్పులురువ్వుతూ గిరగిరా తిరుగుతూంటే విప్పారిన నేత్రాలతో ఆశ్చర్యంగా చూసే పిల్లలు సాక్షాత్తు శ్రీకృష్ణుడిలా సుదర్శన చక్రం తిప్పినట్లు ఫీలవడం దీపావళిలో కనీకన్పించని ఫిలాసఫీ. బాంబుకు లక్ష్మిదేవిని కలిపి లక్ష్మీబాంబుగా పిలిచి, ఢామ్మని పేల్చి డాబుసరిగా దర్పాన్ని వెలిగించే ఫోజులరాయుళ్ల హంగామా మరో విశేషం. శబ్దాలు, నిప్పురవ్వలంటే భయపడేవారు బుద్ధిగా ఓ మూల కూర్చుని, రంగురంగుల అగ్గిపుల్లలను వెలిగించి మురిసిపోయే బుద్ధిమంతుల ఆనందానికీ ఓ లెక్క ఉంటుంది. విలువైనమి, ఇష్టమైనవి వెలిగించాక, ఇంకా మనస్సు ఒప్పుకోక ఆఖరికి అగ్గిపెట్టెలన్నీ ఖాళీ అయ్యాక, మిగిలిపోయిన అట్టముక్కల్నీ వెలిగించికానీ దీపావళి పూర్తికానట్టు భావించే భడవలు లేని ఇల్లుండదు. రాకెట్లు నింగిలోకి దూసుకుపోవడానికి ముందు వెలిగించే జ్వాలలా, తారాజువ్వల్లో అసలు అగ్ని అంటుకోవాడనికి వాడే ‘రంజకం’, జువ్వను వదిలే విధానం ఓ శాస్త్రంలా, అవి తెలిపే వారు శాస్తవ్రేత్తలా వెలిగిపోవడం ఆ పండుగలో మరో ఆవిష్కారం. బాణసంచా కొనుగోలుకు బడ్జెట్ కసరత్తులు మధ్యతరగతి ఇళ్లలో మహావిశేషం. అతివలు వంటలజాబితా తీస్తే పిల్లలు బాణసంచా విశేషాలకు విలువివ్వడం మామూలే. ఎంత కొనాలో, ఎన్ని కొనాలే దీపావళికి ఒక్కరోజు ముందువరకూ అంతూపొంతూ తెలియని రహస్యమే. ఇక కొన్నాక అవి ఎండలోపెట్టడం, వాటికి కాపలాకాయడం ఓ సరదా సన్నివేశం. సాయంత్రానికి కొద్దిసేపటి ముందు అవి ఇంట్లోవారికి పంచడం ఓ ప్రహసనం. ఏవి ముందుకాల్చాలో, ఏవి నాగుల చవితికోసం దాచుకోవాలో తేల్చుకోవడం అంతవీజీకాని వ్యవహారం. అందరికన్నా ముందు బాణసంచా కాల్చడం మొదలెట్టాలన్న ఉత్సాహం, అందరికన్నా చివరి వరకు కొనసాగించాలన్న కోర్కెకు లంకె కుదరకపోవడం సంపన్నులకూ ఎదురయ్యే సమస్యే. ఇక సాయంత్రం అయ్యాక ఇంటిముందు వెలిగించే ప్రమిదల్లో వత్తుల దీపాలు, శీతగాలులకు తత్తరపడి అల్లల్లాడుతూంటే అవి ఆరిపోకుండా, ఒకవేళ ఆరిపోతే మళ్లీ వెలిగించేందుకు అతివలు పడే ప్రయాస మిగతావాళ్లకు పరమానందం కలిగిస్తుంది. అటు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ, వారిచేత బాణసంచా కాల్పిస్తూ, ఇటు ఇంట్లోవారిని అదుపుచేస్తూ పండుగను దిగ్విజయంగా పూర్తిచేయించే ఆ ఇంటి యజమానికి మోములో కన్పించే సంతృప్తి అసలు దీపావళి అందించే వెలుగుతో సమానం. ఎట్టకేలకు దీపావళి పూర్తయినా, ఆ మర్నాడు రోడ్డుపై మిగిలిపోయిన, పూర్తిగా వెలగని బాణసంచా కోసం వెదుకులాట ఓ ముచ్చటైన ఘట్టమే. బాణసంచా కాల్చి డబ్బు వృధా చేయడం, కాలుష్యాన్ని వెదజల్లడం ఎందుకొచ్చిన తంటా, ఆ డబ్బుకాస్తా దాచుకోవచ్చుకదా అన్నదాంట్లో అంతోఇంతో నిజం ఉన్నా, అది ఇచ్చే ఆనందం ముందు ఈ సలహా చిన్నబోవడం ఖాయం. కేవలం ఆనందమే దీపావళి వెలుగుకాదు. విశ్వాసాల జిలుగులూ ఉన్నాయి. లక్ష్మీదేవిని ఆరాధించడం, కొత్తచిట్టాలకు శ్రీకారం చుట్టడం, కార్తీకానికి ఆహ్వానం పలకడం, శీతాకాలపు అస్వస్థతలకు చెక్‌చెప్పడం దీపావళి రహస్యాలే.

-ఎస్.కె.రామానుజం