అదిలాబాద్

ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మార్చి 14: ఎన్నికల విధుల పట్ల సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పారదర్శకంగా పోలింగ్ ఘట్టం పూర్తిచేయాలని ఆదిలాబాద్ లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ దివ్య అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ప్రెసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కలెక్టర్, జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి దివ్య మాట్లాడుతూ వచ్చే 11న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది ముందుగా ఈవీఎంలు, వీవీప్యాట్‌ల వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఓటింగ్‌కు ముందే ఏలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందు జాగ్రత్తచర్యగా ప్రతి పోలింగ్ కేంద్రంలో మాక్‌పోలింగ్ నిర్వహణ చేపట్టాలని అన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్విచ్చ్ఫా బటన్ నొక్కిన తర్వాత కొద్ది సమయం అనంతరం పూర్తిగా మూసివేయాలన్నారు. మాక్‌పోలింగ్ ప్రయోగాత్మకంగా నిర్వహించిన అనంతరమే ఈవీఎంలను తెరువాలని కలెక్టర్ సూచించారు. లోక్‌సభ పరిధిలో ఎన్నికల సిబ్బందికి, అధికారులకు నిర్వహించే శిక్షణ కీలకమైందని, ప్రతి అంశాన్ని అవగాహన చేసుకొని ముందుకు సాగాలని అన్నారు. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులు ఫారం 12 సమర్పించాలని ఆమె సూచించారు. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి డ్యూటీ సర్ట్ఫికెట్ ఇవ్వడం జరుగుతుందని, ఆ సిబ్బందికి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విధులు నిర్వర్తించినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఓటు హక్కును అదే పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి, సబ్ కలెక్టర్ డాక్టర్ గోపి, డీఈవో రవిందర్ రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఎస్‌ఆర్ వర్ణ, రాజేశ్వర్, తహశీల్దార్లు పాల్గొన్నారు.

కొత్త సంస్కరణలతో వన్యప్రాణుల సంరక్షణ
* కవ్వాల్ అభయారణ్యంపై ప్రత్యేక దృష్టి
* మండల స్థాయిలో రక్షణ కమిటీలు.. డ్రోన్లతో నిఘా

ఆదిలాబాద్, మార్చి 14: అభయారణ్యంలో యధేచ్చగా వన్యప్రాణుల వేట సాగుతున్న నేపథ్యంలో పులుల సంరక్షణతోపాటు అంతరిస్తున్న వన్యప్రాణి జాతులను కాపాడుకునేందుకు అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కవ్వాల్ అభయారణ్యంలో ఇటీవల వరసగా మూడు పులులను హతమార్చిన సంఘటన అధికార యంత్రాంగానే్న కదిలించివేసింది. పులుల సంరక్షణపై ఏలాంటి కార్యచరణ చేపట్టారో నివేదించాలని హైకోర్టు న్యాయస్థానం మద్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఉమ్మడి జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమై అడవుల సంరక్షణతో పాటు స్మగ్లర్లను నియంత్రించేందుకు కఠిన చట్టాలను ప్రయోగించేలా సంస్కరణలకు పూనుకున్నారు. ఇందులో భాగంగానే వరసగా కలప నేరాలకు పాల్పడుతున్న 65 మంది స్మగ్లర్లపై అదునుచూసి పీడియాక్ట్ నాన్ బెయిలేబుల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. తద్వారా అడవుల్లో జీవనం సాగిస్తున్న పులులు, చిరుతలతో పాటు అటవీ జంతువులకు రక్షణ కల్పించవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం మండలాల వారీగా అటవీ, పోలీసు, విద్యుత్, అబ్కారి శాఖ అధికారులతో ప్రత్యేకంగా రక్షణ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీలు తరచూ షెడ్యూల్ ప్రకారం అటవీ ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో అనుమతులు లేకుండా జరుగుతున్న అక్రమాలు, స్మగ్లింగ్ తదితర అంశాలపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. మండల కమిటీల ఫిర్యాదులు, సంరక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించనున్నారు. నాలుగు శాఖల అధికారులతో ఉమ్మడిగా సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి అటవీ ప్రాంతంలో మైనింగ్, కలప, వన్యప్రాణుల వధ తదితర అంశాలపై దృష్టిసారించేలా చర్యలు తీసుకోనున్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేయకుండా, వేటకు సంబంధించి తాళ్ళు, ఉచ్చులు బిగించకుండా తదితర అంశాలపై ఇక కఠినంగా వ్యవహరించాలని అటవీ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అటవీ ప్రాంతంలో కొందరు సార బట్టీలు తయారు చేసి అక్రమంగా గుడుంబా వ్యాపారం సాగిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో వీటిపై కూడ కొరఢా ఝలిపించనున్నారు. అవసరమైన చోట దట్టమైన అటవీ ప్రాంతంలో, కొండలపై డ్రోన్ కెమెరాల సాయంతో నిఘాను ముమ్మరం చేయాలని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. డ్రోన్ కెమెరాల నిఘాతో స్మగ్లర్లను నియంత్రించడంతో పాటు వన్యప్రాణుల వధ జరగకుండా రక్షణ కల్పించేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అడవి జంతువుల ఆవశ్యకత, అడవుల సంరక్షణ అంశాలపై ఇక ప్రత్యేకంగా సంరక్షణ కమిటీ అధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేయడానికి యోచిస్తున్నారు. అటవీ ఉత్పత్తులకు నష్టం కల్గకుండా చర్యలు చేపట్టేలా గ్రామీణ ప్రజలను చైతన్యం తీసుకరానున్నారు. తద్వారా అంతరించిపోతున్న అడవులతో పాటు వన్యప్రాణులను సంరక్షించేలా చర్యలు ముమ్మరం చేయనున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 20 చిరుత పులులు, రెండు పులులు, 249 రేచుకుక్కలు, 73 నక్కలు, 158 అడవి పిల్లులు, 10 హానిబర్డ్స్, 303 ఎలుగుబంట్లు, 6 తోడేళ్ళు, 710 దుప్పులు, 54 కృష్ణ జింకలు, 56 అడవి గేదెలు, 42 జంగిల్ ఫాల్స్, 626 మనువోతులు, 27 అడవి దున్నలు ఉన్నట్లు గుర్తించారు. వీటి సంరక్షణ కోసం వేసవిలో తాగునీటి తొట్టెలు నిర్మించి వన్యప్రాణులు వలస వెళ్లకుండా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో అటవీ శాఖ అధికారుల అప్రమత్తంగా వ్యవహరిస్తూనే సంరక్షణపై ఆధునిక సంస్కరణలకు శ్రీకారం చుడుతుండడం గమనార్హం.

గ్రామాల్లో మార్పురావాలి-పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలి
* ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు పనిచేయాలి
* ప్రతీ గ్రామంలో డంపింగ్‌యార్డు నిర్మించాలి
* ప్రతీనెల 5వ తేదిన డ్రైనేజీ క్లీన్ చేయాలి
* ఆస్థిపన్ను వందశాతం వసూలు చేయాలి
* ట్రై సైకిల్‌లు కొనుగోలు చేయాలి
* జిల్లా కలెక్టర్ ప్రశాంతి
నిర్మల్, మార్చి 14: రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రతీ గ్రామంలో మార్పు రావాలని, గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈవోపీ ఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు మంచి పరిశుభ్రత, పచ్చదనంతో ఉంటే ఆరోగ్యకరమైన సమస్యలు ఉత్పన్నం కావన్నారు. గ్రామాల్లో సైంటిఫిక్ డంపింగ్‌యార్డులు కట్టించి అందులో తడిచెత్త, పొడిచెత్త వేరువేరుగా వేయాలన్నారు. చెత్త సేకరణ కోసం ట్రైసైకిళ్లు కొనుగోలు చేయాలని, ఇంటింటికి వెళఙ్ల చెత్త సేకరించాలన్నారు. తడిచెత్తను ఎరువుగా ఉపయోగించవచ్చని, పొడిచెత్తను రీ సైక్లింగ్ చేసి ఉపయోగించవచ్చన్నారు. ప్రతీనెల 5వ తేదిన గ్రామంలోని మురికినీటి కాలువలన్నింటిని శుభ్రం చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటుచేయాలని ప్రతీ గ్రామం ముఖద్వారం నుండి గ్రామం లోపలి వరకు రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటాలన్నారు. ప్రతీ గ్రామంలో 4-5 గ్రీన్ జోన్స్‌ను ఏర్పటుచేయాలన్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఇంకా 16 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తే జిల్లాను ఓడి ఎఫ్‌గా ఫ్రకటించనున్నామని తెలిపారు. గ్రామంలో ట్రీ గార్డ్స్ ఎన్ని అవసరం తెలపాలని, హరితహరంలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. గ్రామంలో నర్సరీలకు స్థలం లేకపోతే పక్క గ్రామంలోనున్న నర్సరీల నుండి మొక్కలను తీసుకువచ్చి నాటాలన్నారు. ఈ పంచాయతీ సర్వీసులు ఆన్‌లైన్ ద్వారా పౌర సేవలు పారదర్శకంగా అందించాలన్నారు. వందశాతం ఆస్థిపన్ను వసూలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అటవీ అధికారి ఎన్‌వి ఎస్ ఎన్ ప్రసాద్; జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, ఈవోపీ ఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శులు, సీ ఓలు తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీలో ఒక మాట.. గల్లీలో మరోమాట
* కేసీఆర్ రెండు నాలుకల ధోరణిపై ఇంద్రసేనారెడ్డి ధ్వజం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ, మార్చి 14: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మోకరిల్లుతూనే మరోవైపు రాష్ట్రంలో బీజేపీపై బురదజల్లుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, టీఆర్‌ఎస్ పార్టీకి సరైన విధి విధానం అంటూ ఏది లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి నల్లూరి ఇంద్రసేనారెడ్డి అన్నారు. శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా బండారు దత్తాత్రేయను ఏడాది తిరగకముందే మంత్రివర్గం నుండి తొలగించారని, తమ ఆత్మాభిమానం దెబ్బతిందని కేటీఆర్ విమర్శించడాన్ని ఇంద్రసేనా తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ఎందుకు చోటు కల్పించలేదని, మహిళల ఆత్మగౌరవం దెబ్బతినలేదా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. గత ఐదు సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ చేపట్టిన ఘనత మోదికే దక్కుతుందన్నారు. ఐఏస్‌ఐ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారరు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు బిజెపి పార్టీని మతతత్వ పార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎంఐఎంతో జతకట్టిన టీఆర్‌ఎస్ మతన్మోద రాజకీయాలు ప్రజలకు తెలుసన్నారు. జీఎస్టీ ద్వారా ధరలు పెరుగుతాయని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం దిగివచ్చిన ధరలను చూసి నోళ్లువెల్లబెట్టుకున్నాయన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మోది ప్రభుత్వం ముద్రలోన్లు, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, నౌక మార్గాలను అభివృద్ధి చేసిందన్నారు. ఐదు సంవత్సరాలుగా పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను ఖర్చుచేయలేని స్థితిలో ఉందని అన్నారు. ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సుగుణాకర్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, నాయకులు ఆధినాథ్, ప్రవీణ్ కుమార్, జోగు రవి, దినేష్ మటోలియా, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి
* ఎంపీ నగేష్

బోథ్ రూరల్, మార్చి 14: మండలంలోని కరత్వాడ గ్రామ శివారులో గల కరత్వాడ ప్రాజెక్టుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌బండ్ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపి నగేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శరవేగంగా పర్యాట రంగాన్ని అభివృద్దిపర్చడం జరుగుతుందన్నారు. కరత్వాడ ప్రాజెక్టుపై నిర్మించే ఈ ట్యాంక్‌బండ్ పర్యాటకులకు ఆకర్షణీయంగా నిలుస్తుందని, ప్రతి పనిలో నాణ్యత పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జివి రమణ, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు నారాయణ్ రెడ్డి, బోజరాం, మల్లెపూల సుభాష్, రాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకని గెలిపించండి
* ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్‌రెడ్డి
బెల్లంపల్లి, మార్చి 14: టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల పట్ట్భద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని జీవన్‌రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కుట్రపన్నుతున్నారని విమర్శించారు. గత 5సంవత్సరాల నుండి కేవలం 20వేల మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని లక్షల ఉద్యోగాలు ఖాళీ అయిన ప్రభుత్వం భర్తి చేయకపోవడం దారుణమన్నారు. సింగరేణి సంస్థలో కాంట్రక్టు ఉద్యోగులు లేకుండా వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తామని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కె సురేఖ, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు, పట్టణ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ బండి ప్రభాకర్ యాదవ్, నాయకులు ముచ్చర్ల మల్లయ్య, అంకం రవి, జమ్మికుంట విజయ్‌కుమార్, ఎండి జావీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

కారు ఎక్కనున్న మత్తమారి సూరిబాబు
ఆయన వర్గీయుల్లో అంతర్మథనం
బెల్లంపల్లి, మార్చి 14: కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన మున్సిపల్ మాజీ చైర్మన్, పీసీసీ మాజీ కార్యదర్శి మత్తమారి సూరిబాబు కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటీకి చేరనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ బీఎస్పీ అభ్యర్థి గడ్డం వినోద్‌కు ప్రత్యక్షంగా మద్దతు తెలిపి ఆయన కోసం ప్రచారం చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సూరిబాబుతో పాటు ఆయన అనుచరులైన 14మందిని ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ 2018 నవంబర్ 27వ తేదీన క్రమ శిక్షణ సంఘం చైర్మన్ ఎన్.కోదండరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గత ఐదు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీకి సూరిబాబు దూరంగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపి గడ్డం నర్సింహారెడ్డి తనయుడు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డితో కలసి టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు సూరిబాబు సిద్దంగా ఉన్నారు. దీంతో సూరిబాబు వర్గీయులు అంతర్మథనం పడుతున్నారు. గతంలో సస్పెండ్‌కు గురైన 15 మంది నాయకులతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కంకటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లెంకల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అఫ్జల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గెల్లి జయరాం, ఆడెపు మహేష్, బర్రె మదునయ్య, బండి రాము, ఎండి అన్వర్‌ఖాన్, అంకం రవి, ఎలుక ఆకాశ్‌లు టి ఆర్ ఎస్‌లో చేరితే భవిష్యత్తులో ఎలా ఉంటుంది, కాంగ్రెస్‌లో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందని తర్జనభర్జన పడుతున్నారు. సూరిబాబు రానున్న వారం రోజుల్లో టి ఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి ద్వారా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి ఆర్, హరీష్ రావుల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన సూరిబాబు ఈ పార్టీని వీడేందుకు సిద్దం కావడంతో బెల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి బీటలు వారనున్నాయి. ఏది ఏమైనా సూరిబాబు టీ ఆర్ ఎస్‌లో చేరనుండటంతో ఆయనతోపాటు ఆయన అనుచర గణం రెండవ శ్రేణి నాయకులు సైతం టి ఆర్ ఎస్‌లో చేరేందుకు సంసిద్దమవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశాలున్నాయి.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ భారతీ హోళ్ళికేరి
బెల్లంపల్లి, మార్చి 14: ఎన్నికల విధుల్లో విఆర్వోలు,బూత్‌లేవల్ అధికారులు,సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి హెచ్చరించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపాలీటీ కార్యాలయంలో ఎన్నికల బడి అనే కార్యక్రమంపై బిఎల్‌వోలకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైనదని ప్రతి ఒక్క వ్యక్తికి ఒకే ఓటు ఉంటుందని ఆ ఓటును తప్పని సరిగా వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని బిఎల్‌ఓలకు సూచించారు. పోలింగ్ స్టేషన్‌లో పరిధిలో ఉన్న బిఎల్‌ఓలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓటు హక్కు నమోదు అయిందా లేదా పుట్టిన బిడ్డ నుండి కుటుంబ సభ్యుల వివరాలు అన్ని రిజిస్టర్‌లో నమోదు చేసుకోవాలన్నారు.కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో కొంతమంది పేర్లు ఎక్కువ నమోదు అవుతున్నాయని ఆ పేర్లను తొలంగించాలన్నారు. ఎలక్ట్రోల్ బాగుంటేనే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని తెలిపారు. ఎన్నికల బడి అనే కార్యక్రమాన్ని పోలింగ్ స్టేషన్‌ల వారిగా నిర్వహించి ఎన్నికల నియమావళి ఓటు హక్కు వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటు హక్కు లేనివారు ఈనెల 15 లోగా వారి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్,అసిస్టెంట్ కలెక్టర్ మోగిళి స్నేహలత తదితరులు పాల్గోన్నారు.