సంపాదకీయం

అమెరికా అభినయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌కు యుద్ధ సామగ్రిని విక్రయించడానికి అమెరికా మరోసారి నిర్ణయించడం ఆశ్చర్యకరం కాదు! తొడగిల్లి తొట్టెలను ఊపే ద్వంద్వనీతికి అమెరికా ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందన్నది ఇలా మరోసారి ధ్రువపడిన దౌత్యవైచిత్రి! మన ప్రభుత్వంతో అత్యంత మైత్రిని అభినయిస్తున్న అమెరికా వేల కోట్ల రూపాయల విలువైన వాణిజ్య ప్రయోజనాలను పొందడం సమీప గతం! ఈ స్నేహాభినయానికి ప్రధాన ప్రాతిపదిక పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదం! పఠాన్‌కోటపై పాకిస్తానీ జిహాదీలు దాడి చేసిన తరువాత అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌ను బాహాటంగా మందలించింది, ఉగ్రవాదులను వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సలహాలిచ్చింది! కరుడుకట్టిన బీభత్సకారుడు డేవిడ్ కాలెమన్ హెడ్లీ దృశ్య మాధ్యమ అనుసంధానం ద్వారా ముంబయి కోర్టులో సాక్ష్యం చెప్పడానికి అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. వివిధ నేరాలు చేసినందుకు అమెరికా న్యాయస్థానాలు హెడ్లీకి ముప్పయి ఐదేళ్ల నిర్బంధ శిక్షలను విధించి ఉన్నాయి. ఈ శిక్షలను అనుభవిస్తు ఉన్న హెడ్లీ అమెరికానుండి ముంబయి ప్రత్యేక న్యాయస్థానానికి పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహించిన నిర్వహిస్తున్న అనేక బీభత్స కృత్యాలను గురించి వెల్లడించాడు! హెడ్లీ చెప్పిన సాక్ష్యంలోని ప్రధానమైన అంశం లష్కర్ ఎ తయ్యబా వంటి జిహాదీ ముఠాలను పాకిస్తాన్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందన్నది! పాకిస్తాన్ ప్రభుత్వ గూఢచర్య విభాగం పేరుతో చెలామణి అవుతున్న ఐఎస్‌ఐ-ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్- జిహాదీ భీభత్స సంస్థ అన్న వాస్తవాన్ని హెడ్లీ మరోమారు ధ్రువీకరించాడు! హెడ్లీ ధ్రువపరచడానికి ముందు కూడా అమెరికా ప్రభుత్వానికి ఏళ్ల తరబడి ఈ విషయం తెలుసు! కానీ హెడ్లీ సాక్ష్యం చెబుతుండిన సమయంలోనే పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్ 16 తరగతి యుద్ధ విమానాలను అమ్మాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది! ఈ యుద్ధ విమానాలనుండి అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు! దాదాపు ఆరువేల కోట్ల రూపాయల విలువైన ఈ యుద్ధ విమానాలను విక్రయించడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా నిర్ణయించడం పట్ల మన ప్రభుత్వం నిరసన తెలిపింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ఫిబ్రవరి 13వ తేదీన మన ప్రభుత్వం కొత్త ఢిల్లీలోని అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించి ఈ దుశ్చర్యను మానుకోవాలని కోరింది. అమెరికా ప్రభుత్వం విన్నట్టే విన్నది. మన మాట తమకు లెక్కలేదన్నట్టు అమెరికా ప్రభుత్వ నిర్వాహకులు ప్రవర్తించడం నడుస్తున్న వైపరీత్యం! పాకిస్తాన్‌కు జరుపతలపెట్టిన ఈ ఆయుధ విక్రయానికి ఆమోదం తెలపవలసిందిగా అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌ను కోరడం మన ప్రభుత్వానికి వికృతమైన వెక్కిరింపు!
ఈ ఎఫ్ 16 యుద్ధ విమానాలను అమ్మడానికి నిర్ణయించడానికి మూడు రోజుల ముందు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని పాకిస్తాన్‌కు అందించాలని కూడ అమెరికా ప్రభుత్వం నిర్ణయించడం అమెరికా మైత్రి మత్తులో మునిగి ఉన్న మన ప్రభుత్వానికి మరో గుణపాఠం. ఈ సొమ్ములో దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు సైనిక సహాయం పాకిస్తాన్‌తో మైత్రీ బంధాన్ని పెంచుకొనడానికి వీలుగా ఈ సహాయం చేయడం అనివార్యమని అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ, కాంగ్రెస్-అమెరికా పార్లమెంట్‌కు తెలియజేయడం మన దేశ ప్రజల మనోభావాలను గాయపరిచిన విపరిణామం! ఉగ్రవాదులతో పోరాడడానికి వీలుగా పాకిస్తాన్‌కు ఈ సైనిక సహాయం అవసరమని కూడ కెర్రీ ప్రకటించాడు! యుద్ధ పరికరాలు జిహాదీ బీభత్సకారులకు వ్యతిరేకంగా పోరాడడానికి అవసరమా? ఒకవేళ అవసరమైనప్పటికీ అణ్వస్త్రాలను మోసుకుని వెళ్లి ప్రయోగించగల ఎఫ్ 16 విమానాలు మాత్రం టెర్రరిస్టులపై పోరాడడానికి అవసరం లేదు. అణ్వస్త్రాలను ప్రయోగించడానికి వీలైన విమానాల ప్రయోజనం మన దేశానికి వ్యతిరేకంగా యుద్ధం సంభవించినపుడు మాత్రమే! అంటే మనదేశానికి వ్యతిరేకంగా పోరాడే పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు సమకూర్చుతోంది. మనపట్ల అమెరికాకున్న మైత్రీ భావం ఇదీ! ఇంతే కాదు ఈ యుద్ధ విమానాలను పాకిస్తాన్ జిహాదీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిపే యుద్ధానికి అవసరమని అమెరికా ప్రభుత్వం బుకాయిస్తోంది..
ఈ విమానాల కొనుగోలునకు అవసరమైన నిధులలో పాకిస్తాన్ ప్రభుత్వం చెల్లించ వలసింది కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు! మిగిలిన దాదాపు నాలుగు వేల ఏడువందల కోట్ల రూపాయలను అమెరికా ప్రభుత్వమే సమకూర్చనుంది. విదేశీయ సైనిక సహాయ నిధుల పథకం కింద ఈ సొమ్మును ఖర్చు చేయడానికై ఒబామా ప్రభుత్వం కాంగ్రెస్ అనుమతిని కోరుతుందట! అంటే హెడ్లీ పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వరూపాన్ని బయటపెట్టిన తరువాతనే అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు దాదాపు పదివేల మూడు వందల కోట్ల రూపాయల ఆర్థిక సైనిక సహాయం అందచేస్తోంది! లష్కర్ ఎ తయ్యబాను ఐఎస్‌ఐ నడిపించింది. నడిపిస్తోంది. 2008 నవంబర్‌లో ముంబయిపై దాడి చేసి బీభత్సకాండను సృష్టించిన జిహాదీ ఉగ్రవాదులు లష్కర్ ఎ తయ్యబాకు చెందినవారు. లష్కర్ ఎ తయ్యబాకు మన దేశంలో సైతం మంది మార్బలం ఏర్పడడానికి కూడ ఐఎస్‌ఐ సహకరిస్తోంది. ఇస్రాత్ జహా వంటి మహిళా జిహాదీలు మన దేశంలోనే పుట్టుకుని రావడానికి సైతం ఐఎస్‌ఐ కుట్ర పన్నింది. ఇదంతా హెడ్లీ చెప్పిన సాక్ష్యాల సారాంశం! అమెరికా ఎందుకని నమ్మడంలేదు? నమ్మినట్టయితే పాకిస్తాన్‌ను బీభత్స వ్యవస్థగా ప్రకటిస్తూ ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ఆమోదించడానికి అమెరికా ప్రభుత్వమే చొరవ చూపాలి! జిహాదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా కొడుతున్న డప్పులకు ఇప్పుడు చేస్తున్న తప్పులకు మధ్య పొంతన కుదరడంలేదు!
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన నాటినుంచి దాదాపు పాతికేళ్లుగా మన ప్రభుత్వం అత్యంత సన్నిహితంగా మెలగుతోంది! ఈ సాన్నిహిత్యం కారణంగా శ్రీలంక, ఇరాన్ వంటి దేశాలతో మన సంబంధాలు క్షీణించాయి కూడ! కానీ అమెరికా ప్రభుత్వం దశాబ్దుల తరువాత ఇరాన్ ప్రభుత్వంతో మైత్రిని నెరపుతోంది! దౌత్య రంగంలో ఇది మనకు వ్యూహాత్మక పరాజయం! మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండిన సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి తీర్మానాలను మన ప్రభుత్వం బలపరచడానికి ఒక ప్రధాన కారణం కూడ అమెరికా మైత్రి! అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా ఒత్తడికి లొంగిపోయినందువల్లనే మన ప్రభుత్వం 2012లో వాల్‌మార్ట్ వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన చిల్లర వ్యాపారాన్ని కొల్లగొట్టడానికి మన ప్రభుత్వం అంగీకరించింది! అంతర్జాతీయ వేదికలపై మన ప్రభుత్వం అమెరికా విధానాలను బలపరుస్తోంది! అయినప్పటికీ మనదేశాన్ని బద్దలుకొట్టడం లక్ష్యంగా పనిచేస్తున్న జిహాదీ పాకిస్తాన్‌కు అమెరికా ఇలా సహాయాలు చేస్తూనే ఉంది. నిరసన తెలపడం మినహా మన ప్రభుత్వం ఏమి చేయగలదన్నది సమాధానం లభించవలసిన ప్రశ్న...