లోకాభిరామం

అనంత అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాల మీద ఉన్న ప్రేమ నాకెందుకో అంకెల మీద లేదు. ఇందుకు కారణం ఎక్కడన్నా ఉందేమోనని ఎంత వెతికినా, వెదికినా దొరకలేదు. వ్యాసం రాస్తుంటే, అందులో, అందుట్లో ఎక్కడా అంకెలు రాకుండా జాగ్రత్త పడతాను. వచ్చినా వాటిని మరీ వివరంగాగాక సుమారు విలువకు మారుస్తాను. ఒక వస్తువు ధర వంద అంటేనేమి, తొంభయి ఎనిమిది అంటేనేమి అన్నది నా పద్ధతి. కానీ, అందరూ ఈ పద్ధతిని అంగీకరించరు, అంగీకరించకూడదు.
దసరా పండుగ నాడు జమ్మిపూజ జరిగే చోట, కాగితాల మీద పెద్దపెద్ద అంకెల్లో అర్థంలేని అప్పుల గురించి రాసి, జమ్మి కొమ్మ మీద పెట్టేవారు. అటువంటి రాతలకు జమ్మికింది రాతలు అని ఒక పేరు గూడ ఉన్నది. ఈ మధ్యన దినపత్రికలలో సర్కారు వారి నిధుల కేటాయింపు వార్తలు చూస్తే నాకు జమ్మికింద లెక్కలు గుర్తుకు వస్తుంటయి. పాకీదొడ్లు కట్టేందుకు గూడ వందల కోట్లలో రూపాయలు కేటాయిస్తున్నరు. రాష్ట్రాల బడ్జెట్‌లు లక్షల కోట్లలో ఉంటున్నయి. ఈ లెక్కల ప్రకారం రూపాయలు కాదుగదా, చింతగింజలు పేర్చినా రాష్ట్రాల కరువు తీరుతుంది. (చింతగింజలలో తినదగిన ప్రొటీన్లు కావలసినన్ని ఉంటయి. ఒకప్పుడు గొంగళ్లకు, లేదా కంబళ్లకు గంజి పెట్టేందుకు చింతగంజి వాడుకునేవారు.) నిజానికి అన్ని చింతగింజలు సేకరించడం అలవిగాని పని. మరి ఈ రూపాయలు ఎక్కడున్నాయో తెలియదు.
ఒకప్పుడు లక్షాధికారి అని ఒక సినిమా వచ్చింది. సినిమాలో ధనవంతులను చూసే ప్రయత్నంగా ఒక తిజోరీ అనే ట్రెజరీ అనే డబ్బు పెట్టె, ఇనుపపెట్టె చూపించేవారు. అందులో కొన్ని నోట్ల కట్టలు కనిపించేవి. కాగితాలను ఆ ఆకారానికి కత్తిరించి, కింద, మీద మాత్రం నోట్లు పెడతరని ఎవరో చెప్పేవరకు, నాకు ఆ నోట్లు కనిపించినప్పుడంత కాళ్లు వణికేవి. ఉద్యోగంలో చేరినప్పుడు వెయ్యిన్ని యాభయి నాలుగు రూపాయలు నెలకు ఇస్తరంటే, కొండ ఎక్కినట్టే అనిపించింది. ‘హరీ, పాతిక లక్షలున్నాయిగా’ అన్న సినిమా డయలాగు విని ‘అన్ని పైసలా?’ అనుకున్న. ఇప్పుడు నేను ఉంటున్న స్వంత ఇల్లు, అంతకు రెండంతలు ధర పలుకుతుంది అంటే, నాకు నవ్వు ఆగదు. ఎందుకు పైసలు ఇంత అగ్వ, అంటే విలువలేనివి అయినయి, అని అనుమానము వస్తుంది. అంకెలు ఇంత విలువ లేనివి అయినయి, అని అనుమానము. రూపాయి విలువను పెంచవచ్చు. అప్పుడు జీతాలు, ధరలు పెంచనవసరము లేదు. అనవసరంగ, లక్షలు కోట్లు అనవసరము లేదు!
చిన్నప్పుడు అంకెల గురించి పోటీలు వచ్చేవి. లక్ష, పది లక్షలు, కోటి, శతకోటి, అర్బుదము, న్యర్బుదము (ఇవన్నీ అంకెలు మరి!) అంటుంటే ఎవరో ఒకరు అనంతము అనేవారు. అనంతం అంటే ఎట్ల ఉంటుంది. శ్రీశ్రీగారి ప్రేరణతో నేను నా కవిత కథ, ముప్ఫయి మూడును ముగిస్తూ ‘అనంతానంత అనంత అంతం’ అనే మాట వాడిని. అంటే ఏమి, అని ఎవరు అడగలేదు గనుక ఇవాళ ఇట్ల ఉన్న! 33=34=35= అని రాసి, ఎంత వయసు వచ్చినా నీ బతుకు ఇంతే అని చెప్పినట్టు భావించుకున్న.
ఒకానొక పుస్తకంలో చదివిన ఒక సంగతి ఇక్కడ, అందరితో పంచుకుంటే బాగ ఉంటుంది, బాగుంటుంది. బావుంటుంది. వగైరా, వగైరా (ఈ వగైరా అన్నది తెలుగు మాట కాదు తెలుసునా, తెలుసా?) ఇద్దరు పెద్ద మనుషులు సంఖ్యా జ్ఞానము గురించి చర్చించుకుంటున్నారు. (అన్నట్లు చర్చ్‌లో చర్చలు జరపవచ్చా?) తెలిసిన పెద్ద అంకె చెప్పాలని పోటీ. ఒకాయన చాల, శాన ఆలోచించి ‘మూడు’ అన్నడు. ఇంకొకాయన అంతకన్న ఎక్కువ ఆలోచించి, అంకె మాత్రము చెప్పలేదు. ‘నీవే గెలిచినవు’ అన్నాడు. ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అని అడిగితే, సంగతిలో స్వారస్యము చెడుతుంది. కనుక అడగకూడదు.
ఇంతకు సంగతి ఏమంటే, అంకెలకు విలువలు ఉన్నయి. పేర్లు ఉన్నయా అన్నది ప్రశ్న. మా కృష్ణగారి ఏడాదినర్ణము వయసులేని కుమారుడు, చంద్రబాబు బొమ్మను, చంద్రుని గుర్తిస్తడని ఆ యువ పితరునికి కొండెక్కినంత సంతోషము. కొండ ఎక్కితే ఎందుకు సంతోషం అన్నది వేరు ప్రశ్న. మరొక కుర్ర తండ్రి (అనగా కుర్రవాని తండ్రిగాదు, కుర్రతనము వీడని తండ్రి) ‘నా కొడుకు అయిదు వరకు (ఐదు అని రాయడము నాకు నచ్చదు. అది పైత్యము కాదు, అది పయిత్యము, అనగా అరవములో తిక్క!) లెక్కపెడుతడు. కానీ, ఒకటి, మూడు, నాలుగు, అయిదు అంటడు’ అని ఆనందముగ చెప్పినడు. ఆ బుడతనికి తాను రెండు అనే అంకెను వదిలినని తెలుసునా? అసలు రెండు అంటే ఎంతనో తెలుసునా? ఈ తండ్రి అమాయకత్వము కాకుంటే?
ఒకటి, రెండు (కొండొకచో రొండు) నేర్చుకోవాలంటే, ఉన్నవి తొమ్మిదే గనుక సులభముగ నేర్వవచ్చును. చేతివేలు ఒకటి మిగులుతుంది. ఆ మిగిలిన వేలి మీద సంఖ్య ఏమి? సున్న రాదు కదా? వేలు ఉన్నది గదా! దానికి పది అని పేరు పెట్టాలెనంటే, మొదటి వేలును దానితో కలిపి, ఒక పూజ్యము, అనగా హళ్లి, అనగా సున్నను తోడు తేవాలె గద. చూపుడు వేలును, బొటన వేలును కొనలు కలిపి చూస్తే, సున్న తయారవుతుంది. ఈ చేతులు మనిషి పుట్టిన నాటి నుంచి ఉన్నయి. కాని, సున్న, అన్న భావము లేదు. రెండు వాక్యాలను మనము గమనించాలె. ‘ఒకటి ఉన్నది అంటే ఒకటి! ‘ఒకటి లేదు’ అంటే ఎంత? సున్న కాదు. అది మైనస్ ఒకటి. ఈ రెంటి మధ్యన మరొక విలువ ఉండవలె గదా అని తోచిన తరువాత సున్న, పూర్ణము పుట్టినది. సున్న నుండి, సున్నను తీసివేసినా, సున్నకు సున్న కలిపినా, మిగిలేది సున్న మాత్రమే’ అని సూత్రము కూడ పుట్టినది.
నేను అంకెల మీద అంతగా ప్రేమ లేదని మొదలుపెట్టిన కానీ, ఈ రాసినదంత చూస్తే నాకు, అంకెల తత్వము మీదగల ప్రేమ ముందు నాకే అర్థమవుతున్నది.
సున్నకు పేరున్నది. విలువ ఉన్నదా? అన్నది ప్రశ్న. ‘తరువాత సున్న వేస్తే అది ఒకటిని విలువ కలిగిస్తుంది. ఆ ఒకటి అప్పుడు ఒకటి కాదు. ఒక పది. ఎన్ని సున్నలు వేస్తే మొదటి అంకె విలువ అంత పెరుగుతుంది. మరీ సున్నలు ఎక్కువయితే రాసేందుకు పద్ధతి కూడ ఉన్నది. చెపుతున్న సంగతిలో నుంచి పక్కకు పోకుండ, రాత పూర్తి చేయడము నాకు రాదు గద! కనుక ఇక్కడ ఒక మిత్రుడు మన ముందుకు వస్తడు. ఆయన మరీ పొట్టి కాదు. మరీ లావు కూడ కాదు. కాని పొట్టి, లావు రెండు ఆస్తులుగా గలవాడు. ఆయన ఒక పొడుగు మిత్రునితో వస్తున్నడు. నేను ఎదురు వచ్చిన. ‘గోపాలం, ఒక క్షణం ఆగు’ అని నన్ను ఆపి, ‘వీని పక్కన నేను నిలబడితే, ఒకటి పక్కన సున్న వేసినట్టు లేదూ?’ అని అడిగి గలగలా నవ్వుతూ ముందుకు సాగినడు, మా పొట్టి, గట్టి మిత్రుడు. ఇంక రెండవ కోతికొమ్మచ్చి, (రమణగారికి క్షమాపణలు). మేము ఇంటికి సున్నము వేసుకుంటము. మరి కొంతమంది సున్నాలు వేసుకుంటరు. అంటే సున్నలా? పూజ్యములా గోడకు పూసేది? నాకు అన్నీ అనుమానములే.
అన్నట్లు సున్నని కనుగొన్నది ఒక భారతీయుడని, అతనెవరో తెలియదని గదా భావము. కానీ, సున్న అన్న అంకె ఆవిష్కరణ, అమెరికాను కొలంబస్ కనుగొనడంతో, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్‌ను కనుగొనడంతో పోల్చి చెపుతూనే ఒక రచయిత, క్రీ.పూ.700 నాడే బాబిలోనియనులకు ఆ తరువాత ఎప్పుడో ‘మయ’ సంస్కృతి వారికి, సున్న గురించి, అంకెలలో స్థానముల విలువ గురించి తెలుసునంటడు. క్రీ.శ.అయిదు శతాబ్దిలో భారతీయుల ఆవిష్కరణ వచ్చింది, అంటడు. తెలుసా?’

కె.బి. గోపాలం