క్రైమ్ కథ

ముగ్గురు అతిథులు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రాత్రి అకస్మాత్తుగా నా కాటేజ్ బయట అడుగుల చప్పుడు వినిపించింది. నేను తలుపు తెరచి చూస్తే అందులోంచి దిగిన ముగ్గురు కనిపించారు. ఆ అపరిచితులు నా కాటేజ్‌కి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు.
‘మేము ఈ రాత్రికి మీ అతిథులం’ వారు లోపలికి వచ్చాక బాస్‌లా కనిపించే వ్యక్తి చెప్పాడు.
మాటల్లో వారిలోని ఒకరి పేరు హేంక్స్ అని నాకు తెలిసింది. మిగిలిన ఇద్దరి పేర్లు తెలీలేదు.
‘నువ్వు ఉండేది ఇక్కడేనా?’ సన్నటి మీసం గల వ్యక్తి అడిగాడు.
అవునన్నట్లుగా తల ఊపాను.
‘నీ దగ్గర రేడియో ఉందా?’
ట్రాన్సిస్టర్ రేడియో ఉన్న అలమార వైపు వెళ్తూంటే నన్ను హేంక్స్ చెయ్యి పట్టుకుని ఆపాడు. దాన్ని అతను బయటకి తీసిన కొద్దిసేపటికి బాస్ రేడియోని ఆన్ చేశాడు. అందులోని వార్త, వారి వర్ణనని విన్నాక వాళ్లు పాతిక మైళ్ల దూరంలోని బేంక్‌లో కేషియర్‌ని చంపి, డబ్బు దొంగిలించి పారిపోయిన దొంగలని నాకు అర్థమైంది. వారు ఎంత సొమ్ము దొంతనం చేశారో మాత్రం రేడియోలో చెప్పలేదు.
ఆ ముగ్గురూ తుపాకులతో నా కాటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దాక్కోడానికి చోటుగా నా కాటేజీ మీద వారికి ఆసక్తి తప్ప నా మీద ఎలాంటి ఆసక్తీ లేదు. పోలీసుల నించి పారిపోయే వారికి ఇది తారసపడటం నా దురదృష్టం.
నేను అంతకు ముందు ఆడుతున్న పేక ముక్కలతో ఆడే పేషన్స్ ఆటని కొనసాగించాను.
‘నువ్వు ఇక్కడే ఉంటున్నావా? ఐతే ఎలా జీవిస్తున్నావు?’ ఆ ముగ్గురిలోని బాస్ అడిగాడు.
‘చలికాలంలో వేట. అప్పుడప్పుడూ చేపలు పడుతూంటాను. కొద్దిగా పొలం పని. కోళ్లు కూడా ఉన్నాయి’ జవాబు చెప్పాను.
‘ఆమ్లెట్ వేయగలవా?’ బాస్ అడిగాడు.
తల ఊపాను. మిగిలిన ఇద్దరిలోని సన్నటి మీసం గల వ్యక్తి వ్యంగ్యంగా చెప్పాడు.
‘నీకు భయం లేదా? నువ్వు జరిగేది చాలా ఉదాసీనంగా చూస్తున్నావు’
‘ఇందులో భయపడాల్సింది ఏముంది?’ అడిగాను.
‘మంచిది. అలా తీసుకో. అప్పుడు నీకు మా నించి ఎలాంటి ప్రమాదం కలగదు’ హేంక్స్ చెప్పాడు.
కాసేపటికి హేంక్స్ ట్రానిస్టర్‌లో మళ్లీ స్థానిక వార్తలు వినే ప్రయత్నం చేయసాగాడు.
‘మీ వర్ణన పోలీసులకి చక్కగా అందింది. మీరు చివర్లో భయపడ్డట్లు ఉన్నారు. మీరు కేషియర్ని చంపకుండా ఉండి ఉంటే, మీ కోసం పోలీసుల అనే్వషణ తీవ్రంగా ఉండేది కాదు’ చెప్పాను.
‘ఆ చెత్త కారువల్ల మేం ఇక్కడ ఉన్నాం. లేదా ఈపాటికి చికాగోలో ఉండేవాళ్లం’ హేంక్స్ చెప్పాడు.
‘నన్నడిగితే అది పాడవడం మీ అదృష్టం. లేదా రోడ్ బ్లాక్స్‌లో ఎక్కడో ఓ చోట మీరు పట్టుబడేవారు. మీకు స్థానిక చిన్న రోడ్లు తెలీవు. కారుని ఎవరికీ కనపడని చోట వదిలారని అనుకుంటాను?’ అడిగాను.
‘మేం వెళ్లేదాకా అది ఎవరి కంటా పడని చోటే ఉంచాం. నాకు ఆకలిగా ఉంది’ సన్నటి మీసం వ్యక్తి చెప్పాడు.
నేను ఫ్రిజ్ దగ్గరికి నడిచాను.
‘రుచికరమైన అలెగ్జాండర్ ఆమ్లెట్’ బాస్ అరిచి తమతో తెచ్చిన సంచీని విప్పి అందులోని నోట్లని బల్ల మీద కుమ్మరించాడు. నేను వాళ్లకి ఆమ్లెట్స్ వేస్తూంటే, వాళ్లు దాన్ని పంచుకున్నారు. తలకి ఇరవై వేల డాలర్లు వచ్చాయని వాళ్ల మాటల్ని బట్టి నాకు తెలిసింది.
‘ఓ గంట పనికి తలకి ఓ క్లర్క్ ఆర్నెల్ల జీతం ముట్టింది’ బ్రెడ్ ఆమ్లెట్లని బల్ల మీద ఉంచి చెప్పాను.
బాస్ నా వంక ఎగాదిగా చూశాడు.
‘నేను చికాగోకి వెళ్లాక రోజూ స్టేక్స్, ఖరీదైన ఆల్కహాల్, అందమైన అమ్మాయిలు...’ హేంక్స్ ఉత్సాహంగా చెప్పాడు.
‘ఇది మూర్ఖపు ప్రశ్నలా తోచచ్చు కాని నా భవిష్యత్ ఏమిటి?’ ప్రశ్నించాను.
‘బాధపడక. దాన్ని ఇప్పటికే నిర్ణయించాను. పేక ఉందా?’ బాస్ నవ్వుతూ అడిగాడు.
నేను ఫ్రిజ్‌లోంచి పాలని, షెల్ఫ్‌లోని పేకలని తెచ్చి వాళ్ల ముందు బల్ల మీద ఉంచి, ఖాళీ ప్లేట్లని తీశాను. అందులోంచి ఆఠీన్ ఆసుని రహస్యంగా తీసి జేబులో ఉంచుకుని ఆమ్లెట్‌ని బ్రెడ్ మధ్య ఉంచుకుని తింటూ, వాళ్ల ఆటని చూడసాగాను. మీసం వ్యక్తి పేరు ఫ్రెడ్ అని తెలిసింది. హేంక్స్ వరసగా మూడు ఆటలు గెలిచాడు. ఫ్రెడ్ జేబులోని చాలా డబ్బు హేంక్స్ జేబులోకి వెళ్లింది.
‘మనిషి నిజాయితీ పేకాట దగ్గర బయటపడుతుంది’ బల్ల కిందకి చూస్తూ చెప్పాను.
నేను నా మోకాళ్లని పక్కకి జరిపాను. ఆసు కిందకి పడ్డ కొద్ది క్షణాలకి ఫ్రెడ్ తలదించి దాన్ని చూసి తీసుకుంటూంటే చెప్పాను.
‘పొరపాట్ల కింద పడినట్లుంది. అది మీకు వచ్చి ఉంటే గెలిచేవారు’
ఫ్రెడ్ హేంక్స్ వంక అనుమానంగా చూస్తూ చెప్పాడు.
‘క్రితం ఆటలో నేను ఓడిపోవడానికి కారణం ఇది నాకు పంచకపోవడమే’
నేను చిన్నగా ఆవలించి చెప్పాను.
‘ఉన్నది ఒకటే మంచం. బహుశ నన్ను దాని మీద పడుకోనివ్వరు. మీలో ఇద్దరు నేల మీద పడుకోవాలి. రాత్రికి అది ఎవరికి చెందాలో పేకముక్కల్నే నిర్ణయించనీయచ్చని నా సూచన’
బాస్ కూడా ఆవలించి లేచి వెళ్లి మంచం మీద కూర్చుని బూట్లు విప్పి నాతో చెప్పాడు.
‘నువ్వు స్టోర్‌రూంలో పడుకో. హేంక్స్. ఇతను లోపలకి వెళ్లాక బయట గొళ్లెం పెట్టు. లేదా నిద్రలోని మనల్ని ఏ గొడ్డలితోనో చంపచ్చు. లేదా పారిపోవచ్చు.’
ఆ కేబిన్‌లో నా స్టోర్‌రూం ఒక్కటే రెండో గది. లాంతరు వెలిగించి, దుప్పటి తీసుకుని నేను ఆ గదిలోకి వెళ్లగానే దాని తలుపు మూసి, బయట నించి గొళ్లెం పెట్టిన చప్పుడు వినిపించింది. రెండు గంటల తర్వాత వారి గురక వినపడింది. చిన్న గునపాన్ని తీసుకుని తలుపు ముందు పరచిన కార్పెట్‌ని తీసి, మట్టిలో చిన్న గుంటని తవ్వాను. ఎనిమిది అంగుళాల లోతు తవ్వాక చలికాలంలో నల్ల తోడేళ్లని పట్టుకునే ట్రాప్‌ని తీసి, ఆ గోతిలో ఉంచి పైన మళ్లీ కార్పెట్‌ని యథాస్థానంలో ఉంచాను. తవ్విన మట్టి కనపడకుండా ఖాళీ రంగు పెట్టెలో ఉంచి అక్కడంతా శుభ్రంగా ఊడ్చాను. తర్వాత బంగాళా దుంపల బుట్టలోని చిన్న ప్లాస్టిక్ సంచీని తీసి అందులోని నా డబ్బుని లెక్కపెట్టి, పది ఇరవై నోట్ల డాలర్లని, అంటే రెండు వందల డాలర్లు తీసి జేబులో ఉంచుకున్నాను. ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయాను.
* * *
మర్నాడు ఉదయం ఎనిమిదికి హేంక్స్ తలుపు తెరిచాడు. అప్పటికే నేను లేచాను. వార్తలు విందామంటే రేడియో ముందు గదిలో ఉంది.
‘కాఫీ చెయ్యి’ హేంక్స్ ఆజ్ఞాపించాడు.
‘జాగ్రత్త! మా మీద తిరగబడే ప్రయత్నం చేస్తే ప్రాణాలు కోల్పోతావు’ బాస్ చురుకైన నా కదలికల్ని నిశితంగా చూసి అనుకుంటా, కొద్దిసేపటికి చెప్పాడు.
‘నాకా ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను సాధ్యమైనంత ఎక్కువ కాలం జీవించాలని అనుకుంటున్నాను’ చెప్పాను.
కాఫీ చేశాక అమాయకంగా అడిగాను.
‘ఐరిష్ కాఫీ కావాలా? ఓ జగ్‌లో కొద్దిగా మద్యం ఉంది’
‘ఐతే దాన్ని తీసుకురా’ బాస్ ఆజ్ఞాపించాడు.
స్టోర్‌రూంలోకి వెళ్లి దాన్ని తెచ్చాను తెరిచి వాసన చూశాక చెప్పాడు.
‘ఘాటైంది’
‘అవును. నేను స్వంతంగా తయారుచేసుకుంది’ చెప్పాను.
‘నువ్వు కొద్దిగా తాగు’ ఓ గ్లాస్‌లోకి కొంత కుమ్మరించి బాస్ పకపక నవ్వి దాన్ని నాకు ఇస్తూ చెప్పాడు.
నేను తాగిన పావుగంట దాకా నాకేం కాకపోవటంతో చెప్పాడు.
‘వీడు దీంట్లో ఏదో కలిపి ఇస్తున్నాడు అనుకున్నాను కాని నిజంగా అతిథి సత్కారం చేస్తున్నాడని అనుకోలేదు. మనం ఇక్కడ ఇంకో రెండు రోజులు ఉండక తప్పదు. కాబట్టి దీన్ని వృథా చేయద్దు’
మళ్లీ వాళ్లు పేకాటకు కూర్చున్నారు. మొదట స్నేహపూర్వకంగా మొదలైన ఆట విస్కీ మత్తువల్ల క్రమేపి పెద్ద పందేలతో జూదగాళ్ల మధ్య ఆటలా సాగింది. ఫ్రెడ్ కార్డులన్నీ లెక్కపెట్టాక ఆట మొదలైంది.
నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ వాళ్లు చూడకుండా నా జేబులోని పది, ఇరవై డాలర్ల నోట్లని హేంక్స్ కుర్చీ వెనక తగిలించిన కోటు జేబులో ఉంచాను. హేంక్స్ నిన్నటిలా ఎక్కువసార్లు గెలుస్తూండటంతో ఫ్రెడ్ కార్డ్‌లని నేలకేసి కొట్టి చెప్పాడు.
‘ఈ మోసపు ఆటని ఇక ఆడను’
‘అంటే?’ హేంక్స్ అడిగాడు.
‘మోసకారి కానివాడు ఇన్నిసార్లు గెలవడు. బాస్! మనం హేంక్స్‌ని మన జట్టులో కలుపుకుని తప్పు పని చేశాం’
ఫ్రెడ్ జేబులోంచి రివాల్వర్ తీసి హేంక్స్‌కి గురి పెట్టాడు.
‘దాన్ని పక్కన పెట్టు’ బాస్ అరిచాడు.
నేను హేంక్స్ కోటుని అందుకుని అతనికి ఇస్తూ చెప్పాను.
‘బహుశా నువ్వు వెళ్లాల్సి రావచ్చు’
ఆ కోటు జేబులోంచి ఇరవై డాలర్ల నోట్లు కింద పడ్డాయి. ఫ్రెడ్ వెంటనే అరిచాడు.
‘మోసకారి! అరవై వేల డాలర్లకన్నా ఎక్కువ దొంగిలించాం. మేము అరవై వేలు. మిగిలింది మాకు తెలీకుండా నువ్వు’
‘లేదు. ఆ డబ్బు నాది కాదు. నా కోటు జేబుల్లోకి అది ఎలా వచ్చిందో నాకు తెలీదు’ హేంక్స్ అరిచాడు.
ఫ్రెడ్ చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలింది. హేంక్స్ కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. బాస్ ఫ్రెడ్‌ని కోప్పడలేదు. చచ్చిన హేంక్స్ వంక నిరసనగా చూశాడు. హేంక్స్ కోటు జేబుని అతను వెతికాడు కాని డబ్బు దొరక్కపోవడంతో నిరుత్సాహం చెందాడు.
ఫ్రెడ్ కొద్ది క్షణాలు నా వంక చూశాడు. తర్వాత బాస్‌తో చెప్పాడు.
‘హేంక్స్ చెప్పింది నిజమే. ఐతే ఇది వీడి పని’
‘ఐతే నువ్వు మూర్ఖుడిలా ప్రవర్తించావు’
బాస్ కోపం ఫ్రెడ్ మీదకి మళ్లింది. రివాల్వర్ కోసం అతను తన కోటు జేబులో చేతిని ఉంచాడు. తక్షణం ఫ్రెడ్ చేతిలోని రివాల్వర్ ఇంకోసారి పేలింది. కాని అది నా భుజం పైనించి దూసుకుపోయింది. వెంటనే నేను కోటుని ఫ్రెడ్ మొహం మీదకి విసిరాను. బాస్ తన జేబులోంచి రివాల్వర్ తీసేలోగా నేను స్టోర్‌రూంలోకి గెంతాను. కాని తలుపు మూయలేదు. ఓ మూలకి వెళ్లి నించున్నాను. మరోసారి రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది.
బాస్ కిటికీ లేని ఆ స్టోర్ రూం ముందు నిలబడి అరిచాడు.
‘ఎక్కడున్నావు?’
నేను ఓ బంగాళా దుంపని అతని వైపు విసిరి ఇంకో మూలకి వెళ్లాను. అతని చేతిలోని రివాల్వర్ రెండుసార్లు పేలాక మరో అడుగు ముందుకి వేశాడు. అతని ఎడమ పాదం సరిగ్గా నేను అమర్చిన తోడేలు ట్రేప్‌లో పడి అందులో చిక్కుకుంది. అతను బాధగా అరిచాడు. కాలుని విడిపించుకోడానికి కిందకి వస్తూంటే, పారని తీసుకుని అతని తల మీద బాదాను. నేల మీది అతని రివాల్వర్‌ని అందుకుని జాగ్రత్తగా ముందు గదిలోకి నడిచాను. బాస్ పేల్చిన బుల్లెట్లతో ఫ్రెడ్ కూడా మరణించాడు.
ఆ ముగ్గుర్నీ లాక్కెళ్లి గోతిలో పాతిపెట్టడం కష్టమైన పని. కాని అందుకు అరవై వేల డాలర్లు రుసుముగా లభిస్తున్నప్పుడు అది అంత కష్టమైందిగా నాకు తోచలేదు.
................
జాక్ రిట్చీ కథకి స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి