ఓ చిన్నమాట!

పెట్టుబడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చదువుతున్నప్పటి నుంచి సాహిత్యం మీద మక్కువ ఎక్కువ. చాలా సమయాన్ని సాహిత్యానికే వెచ్చించేవాణ్ని. ఎప్పుడూ కవిత్వం, కథలూ చదవడం చూసి మా అమ్మ అంది. ‘వాటివల్ల ఏం వస్తుందిరా? నీ చదువు పుస్తకాలు చదువుకుంటే మంచిది కదా’
మా అమ్మ ఎక్కువగా చదువుకోలేదు. చదువు పుస్తకాలు చదువుకొంటే మంచి మార్కులు వస్తాయని, మంచి ఉద్యోగం వస్తుందని ఆమె ఆశ, నమ్మకం కూడా. రెండు మూడుసార్లు ఈ మాట అనడం, నేను పట్టించుకోక పోవడం చూసిన మా బాపు ఇట్లా అన్నాడు-
‘చదువుకోనివ్వవే. వాడి చదువుతోపాటూ కథలూ కవిత్వం చదువుకుంటే తప్పేమి లేదు. అది వాడి పెట్టుబడి’
అలా ఎందుకన్నాడో అప్పుడు నాకర్థం కాలేదు. కవిత్వం, కథలు నా జీవితంలో పెట్టుబడి ఎలా అవుతుందో అసలే అర్థం కాలేదు. కానీ కొంతకాలం తరువాత ఆయన మాటల్లోని అంతరార్థం బోధపడింది.
కథలూ, కవిత్వం చదవడం, రాయడం వల్ల నాకు ఓ గుర్తింపు ఏర్పడింది. నా మీద నాకు అంతులేని విశ్వాసం ఏర్పడింది. ఎవరికీ లొంగని వ్యక్తిత్వం అలవడింది. ఎప్పుడూ పొద్దుపోవడం లేదూ అన్న విషయం నా జీవితంలో లేకుండా పోయింది.
మా అబ్బాయితో కలిసి ఉండటానికి ఓ రెండు నెలలు అమెరికాకు వచ్చాను. శని, ఆదివారాలు పూర్తిగా మనతో వుంటారు. మిగతా రోజులు హడావిడిగా ఉంటారు. కానీ నాకు ఎలాంటి విసుగు రాలేదు. జీవితంలో ఎప్పుడూ దొరకని సమయం దొరికింది. చదువుకోవడానికి, రాసుకోవడానికి ఎంతో సమయం చిక్కింది. నా మిగతా మిత్రులకన్నా ఎక్కువ ఆనందించింది బహుశా నేనేమో. నా పెట్టుబడి నాకు ఆ ఆనందాన్నిచ్చింది. మా బాపు మాటలు గుర్తుకొచ్చాయి.
మన జీవితాన్ని శాసించే ఆర్థికవేత్త మనమే. మన సమయాన్ని, మన డబ్బుని, మన ఇతర వనరులని ఎట్లా ఉపయోగించుకోవాలో చూసుకోవాల్సింది మనమే. మనకు ఆర్థికంగా లాభాలు వచ్చే వాటి మీద కాదు. మిగతా వాటి మీద కూడా మనం పెట్టుబడి పెట్టాలి. వాటి లాభాలు ఎప్పుడో ఒకప్పుడు లభిస్తాయి.
మా దగ్గరి బంధువు ఒకాయన ఉండేవాడు. ఆయన చిన్ననాటి నుంచి క్యాలెండర్లను సేకరించడం అలవాటు. అతనికి డెబ్బై సంవత్సరాలు వచ్చేసరికి అవి కొన్ని వేలకు దాటాయి. అందమైన క్యాలెండరర్లు. ఓసారి వాటిని కరీంనగర్‌లో ప్రదర్శనకి పెట్టాడు. అందరూ అతన్ని ఎంతగానో అభినందించారు. ఆ రోజు అతని ఆనందానికి అంతులేదు. అతని కొడుకు అవి అన్నీ స్కాన్ చేసి ఇంటర్నెట్‌లో పెట్టాడు. దాంతో అతనికి ఎంతో కాలక్షేపం.
మీకు ఫొటోగ్రఫీ మీద మక్కువ ఉందా? ఓ మంచి కెమెరా కొనుక్కోండి.
సంగీతం మీద ఇష్టం ఉందా? అందుకు సంబంధించిన వాయిద్యాన్ని కొనుక్కోండి.
మన మీద మనం పెట్టుబడి పెట్టుకుంటే మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. మన పెట్టుబడిని చూసి చాలామందికి నవ్వు తెప్పించవచ్చు. కానీ మన జీవితాలని మెరుగుపరుస్తాయి. అంతులేని ఆనందాన్నిస్తాయి.
మనకు ఇష్టమైన ప్రవృత్తిని ఎంచుకొని కొంత పెట్టుబడి పెడితే అది ఎప్పుడో ఒకసారి విలువకట్టలేని సంతోషాన్నిస్తుంది.

-జింబో 94404 83001