సంపాదకీయం

ఆశల పల్లకిలో పార్టీలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఎన్నికల జాతరకు ఎప్పుడూ కొదవుండదు. జాతీయ ఎన్నికలు పూర్తయితే అసెంబ్లీ ఎన్నికలు అవీ ముగిస్తే..స్థానిక ఎన్నికలు..మళ్లీ చక్రం తిరుగుతుంది. ఎన్నికల్లో జయాపజయాలు సహజమేననుకునే వారికి నిరంతరం సువర్ణావకాశం అందివస్తూనే ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా జతకట్టేందుకు స్థానిక పార్టీలు అలాగే స్థానిక పార్టీలను దెబ్బతీసి తమ ప్రాబల్యాన్ని నిలబెట్టుకునేందుకు అధికారంలో ఉన్న పార్టీలు నిరంతరం మల్లగుల్లాలు పడుతూనే ఉంటాయి. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి అసెంబ్లీలకు త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు అనేక కోణాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ప్రస్తుత పరిస్థితులు ఆయా రాష్ట్రాల రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కొంతలో కొంతైనా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. బలమైన ప్రాంతీయ పార్టీలు కలిగిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు ఏ మేరకు పుంజుకునే అవకాశం ఉందన్నది అస్పష్టం. ఈ దిశగా బిజెపి అనేక కోణాల్లో పావులు కదపడం ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక రీతిలో తీర్పునిచ్చి బిజెపికి తిరుగులేని అధికారాన్ని అప్పగించినప్పటికీ..ఎలాంటి శాసనాలను తీసుకు వచ్చే పరిస్థితి ఆ పార్టీకి లేకుండా పోయింది. అందుకు కారణం లోక్‌సభలో ఎదురులేనప్పటికీ రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ సహా విపక్షాలదే మెజార్టీ కావడం వల్ల ఇప్పటి వరకూ కీలక బిల్లులేవీ పార్లమెంట్ ఆమోదాన్ని పొంద లేక పోయాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి మిగతా రాష్ట్రా ల అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజ యం తమదేనని భావించిన బిజెపి నాయకత్వానికి ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతినే కలిగించాయి. జాతీయ ఎన్నికల్లో ఫలించిన ప్రధాని మోదీ జనాకర్షక శక్తి అనంతర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానూ ప్రస్ఫుటం కాలేదు. ఈ నేపథ్యంలో రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగానే బిజెపి భావిస్తోంది. ఇది ఎంత వరకూ సాధ్యం..
అమిత్ షా సారథ్యంలో బిజెపి విసిరే సయోధ్య పాచికలు ఎంత మేరకు ప్రాంతీయ పార్టీలను అక్కున చేర్చుకునేందుకు దోహదం ఇస్తాయన్నది ఇప్పటికిప్పుడే చెప్పలేని పరిస్థితి. మొత్తం మీద బిజెపి, ఇతర ప్రాంతీయ పార్టీలే రానున్న ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచే అవకాశాలు మాత్రం స్పష్టం. బిహార్ విజయం నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లోని బలమైన ప్రాంతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్‌లకు వ్యతిరేకంగా బలమైన కూటములుగా ఏర్పడేందుకూ ఎంతైనా ఆస్కారం ఉంది. గరిష్ట స్థాయిలో రాజకీయ ప్రయోజనాలను సొంతం చేసుకునేందుక జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ రానున్న ఈ ఎన్నికలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఇక్కడ జరిగే ఎన్నికలు ఏ ఒక్క పార్టీకి పూర్తి స్థాయిలో ఆనందాన్ని లేదా విషాదాన్ని మిగల్చకుండా మిశ్రమ ఫలితాలనే అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2015లో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ప్రతికూల ఫలితాలనే చవిచూసిన బిజెపి అలాంటి పరిస్థితి 2016లో ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని భావిస్తోంది. మిగిలిన మూడేళ్లలో అనుకున్న స్థాయిలో తన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయాలంటే బిజెపి సారథ్యంలోని ఎన్డీయే కూటమికి రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పనితీరును, అలాగే ఫలితాలనూ కనబరచడం ఎంతైనా అవసరం. రాష్ట్రాల వారీగా గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రానున్న ఫలితాలు ఎలా ఉంటాయని విశే్లషిస్తే.. అస్సాంకు సంబంధించినంత వరకూ బిజెపికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. 2014లో రాష్ట్రం నుంచి పధ్నాలుగు లోక్‌సభ స్థానాలను బిజెపి కైవసం చేసుకుంది. అంటే 36.5శాతం ఓట్లను సొంతం చేసుకుందన్న మాట. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో కేవలం మూడు లోక్‌సభ స్థానాలు మాత్రమే లభించాయి. ఈలెక్కన చూస్తే రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కంటే కూడా బిజెపికే విజయావకాశాలు ఎక్కువ. అలాగే రాష్ట్రంలో గణనీయంగా అంటే 34.2శాతం వరకూ ఉన్న ముస్లిం ప్రజలు కూడా బిజెపికి వెన్నుదన్నుగా నిలిచే సంకేతాలూ కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఈసారి కూడా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌దే అధికారంగా కనిపిస్తున్నప్పటికీ ఇటీవల చోటు చేసుకున్న పలు రాజకీయ పరిణామాలు కొంత అనిశ్చితి సంకేతాలు అందించాయి.
ముఖ్యంగా వామపక్షాలతో కాంగ్రెస్ చేతులు కలపడం తృణమూల్ కాంగ్రెస్‌లో కలవరపాటుకు కారణమైంది. బిజెపి విషయానికొస్తే..గతంలో కంటే కూడా ఈసారి మెరుగైన ఫలితాలనే కనబరిచే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే అవకాశాలు శూన్యమే అయినప్పటికీ కేడర్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ అసెంబ్లీ ఎన్నికలను బలమైన వేదికగా కమలనాథులు పరిగణిస్తున్నారు. ముఖ్యంగా 2014 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య రీతిలో బిజెపికి రెండు స్థానాలు దక్కడంతో పాటు 16.8శాతం మేర ఓట్లూ సొంతం కావడం ఇందుకు ఊతం గా మారుతోంది. కేరళ స్థానిక ఎన్నికల్లో కూడా ప్రోత్సాహక ఫలితాలను కనబరిచిన నేపథ్యంలో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి అనూహ్య ఫలితాలను నమోదు చేసుకునే అవకాశాలను కొట్టివేయలేం. తమిళనాడు, పాండిచ్ఛేరిల్లో సొంతంగా పోటీ చేసే అవకాశం గానీ, అందుకు తగ్గ బలంగానీ బిజెపికి లేవన్నది స్పష్టం. దీని దృష్ట్యా అటు అన్నాడిఎంకెతో గానీ, ఇటు డిఎంకెతో గానీ పొత్తు పెట్టుకుని రాజకీయంగా తన ఉనికిని పదిల పరచుకోవడం తప్ప బిజెపి చేయగలిగేమి ఏమీ ఉండదు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలను తమ శక్తికి, యుక్తికి నిదర్శనంగానే భావిస్తున్నాయి. అవసరమైన చోట జాతీయ పార్టీలకు అవకాశం ఇస్తున్నాయే తప్ప తమతమ రాష్ట్రాల్లో వాటి ప్రాబల్యం పెరగకుండా ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూనే ఉన్నాయి. అవసరమైతే వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీలన్నీ కలిసి ఉమ్మడి పోటీకైనా సిద్ధమవుతున్నాయి. ఇదే పరిస్థితి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఇలాంటి కూటములు ఏర్పడినా అవి ఎంత వరకూ నిలుస్తాయి? జాతీయ పార్టీల వ్యూహాలను తట్టుకుని ఏ మేరకు రాణిస్తాయన్నది చెప్పలేని పరిస్థితే. బిహార్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఫ్రంట్‌లుగా ఏర్పడటానికి ఎంతగా ఉబలాట పడతాయో..తీరా సీట్ల విషయాని కొచ్చే సరికి అంతగానూ వెనుకడుగు వేస్తాయన్నది స్పష్టం. మొత్తం మీద ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏ పార్టీ అంచనాలకూ అందని ఫలితాలను అందిస్తాయా లేక మరో చారిత్రక మలుపుతిప్పే తీర్పునే ప్రజలు ఇస్తారా అన్నది వేచిచూడాల్సిందే!