క్రైమ్ కథ

ఆమె -- -మల్లాది వెంకట కృష్ణమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీ ఉదయం సూర్యోదయ సమయంలో ఆమెకి సముద్ర స్నానం చేయడానికి అనుమతి లభిస్తుంది. నీళ్ళల్లో ముణిగి స్నానం చేస్తుంది. ఆమెకి ఈత ఠాదనుకుంటాను. ఆమె ఈదగా నేను ఎన్నడూ చూడలేదు.
మా కాటేజ్‌లోని వెనీషియన్ బ్లైండ్స్‌ని కొద్దిగా పైకిలేపి ఆమెని గమనిస్తాను. మా పక్క కాటేజ్ తలుపు మూసిన చప్పుడు ఆమె సముద్రం వైపు వెళ్తోందని గుర్తు. పొడి ఇసుక మీద నీటివైపు ఆమె నడుస్తుంది.
ఇరవైలలోని ఆమె మెల్లిగా నడుస్తుంది. పొడుగాటి కాళ్ళతో గౌరవంగా నడుస్తుంది. సూర్యుడు ఉదయించే సమయంలో ఫ్లోరిడాలో కూడా కొద్దిగా చలి ఉంటుంది. తడి స్నానపు దుస్తుల్లో ఆమె ఎన్నడూ తన కాటేజ్‌ని చేరుకోడానికి పరిగెత్తేది కాదు. తనని వేలమంది గమనిస్తున్నారని తెలుసు అనుకుంటా. వాళ్ళకి ఆనందం ఇవ్వాలన్నట్లుగా నెమ్మదిగా నడుస్తుంది.
ఆమె మంచి పొడగరి. చక్కటి ముఖకవళికలు. నల్లటి జుట్టు. తెల్లటి చర్మం. అందగత్తె. ఆమె చాలా సంవత్సరాల నించి అక్కడ నివసిస్తోందని బార్ టెండర్ మాకు చెప్పాడు. నిజానికి ఆమె తన ఇంట్లో ఓ ఖైదీ జీవితం గడుపుతోందని కూడా చెప్పాడు. ఆమెకి పెళ్ళైంది. మా పొరుగింటాయన భార్య.
ఓ ఉదయం నాకు అనిపించింది, అతను కూడా ఆమెను గమనిస్తూంటాడని. బైనాక్యులర్స్‌లోంచి బీచ్‌ని చూస్తూ ఆమె కదలికలని గమనిస్తాడు. ఏ మగాడు ఆమె దగ్గరికి వెళ్ళి పలకరించినా అతనికి తెలిసిపోతుంది. అతను ఎన్నడూ స్నానానికి సముద్రంలోకి వెళ్ళలేడు. డాక్టర్ వద్దన్నాడని తర్వాత తెలిసింది.
ఆమెలా కాక అతను నల్ల కళ్ళజోడు, బట్టతల మీద పనామా హేట్లతో సన్ డెఖ్ మీద పడుకుని సూర్య స్నానం చేస్తాడు. అతని పక్కనే లావుపాటి సన్‌స్రసీన్ లోషన్ సీసా సదా ఉంటుంది. అతని నోట్లో సదా సిగార్ కనిపిస్తుంది.
మా పొరుగువాడు కాబట్టి సాధారణంగా మాకు పరిచయం ఏర్పడాలి. కాని అతను కాపలా కుక్కలా ఉన్నాడని నాకు అనిపిస్తుంది. అతను తన నల్లటి కళ్ళద్దాల వెనక నించి మా కుర్రాళ్ళ వంక కోపంగా చూసేవాడు. అందుకని మాకు అతనితో పరిచయం కాలేదు. మాలోని ఒకరు అతనికి ఒకటి, రెండుసార్లు ‘గుడ్ మార్నింగ్’ చెప్తే, నోట్లోని సిగార్ని ఇసకమీదకి విసిరి కొట్టి, ఇంకోటి వెలిగించి తన కోపాన్ని ప్రదర్శించాడు. తన ప్రవర్తనకి తోడు నీటివైపు తన ఇంటి బయట ‘నో ట్రెస్‌పాసింగ్. నో లాయిటరింగ్. ప్రైవేట్ ప్రాపర్టీ’ అనే బోర్డ్‌ని ఉంచాడు. వీధివైపు గేట్‌కి ‘కీప్ అవుట్’ అనే బోర్డ్ వేలాడుతుంది.
ప్రతీ ఉదయం కొన్ని నిముషాల సేపు ఆమెని చూడటం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. ఆమె అందని ద్రాక్షపండు కాబట్టి ఇంకాస్త ఆసక్తిగా ఉండేది. పైగా ఆమె విధేయతగా కుడి ఎడమల వైపు చూడకుండా తన ఇంటి వైపే చూస్తూ నడిచి ఇంటికి వెళ్తుంది. అందుకు కారణం మేమంతా ఊహించగలిగాం.
తర్వాత మాకు వారి గురించిన కొన్ని విశేషాలు తెలిసాయి. ఆ బీచ్‌లోని రెండు వందల కాటేజ్‌లలోని అందరి గురించీ అందరికీ తెలుసు. వారి ఇంట్లో మైకో ఫోన్ పెట్టి విన్నట్లుగా ప్రతీవారి గురించి దాదాపు ప్రతీ వారికి తెలుసు. కొన్ని చిన్న తేడాలతో ఆ సమాచారం వ్యాపిస్తూంటుంది. మీరు పోస్ట్ఫాసులో ఉన్నారా? టెన్నిస్ కోర్ట్‌లో ఉన్నారా? లేక ఎర్స్‌స్టైన్స్ బార్ అండ్ గ్రిల్‌లో ఉన్నారా? అన్నదాన్ని బట్టి ఆ తేడాలు ఉంటాయి.
మా పొరుగమ్మాయి గురించి అంతా అంగీకరించింది, ఆమె కోపధారి భర్తకి చాలా డబ్బుంది. సౌత్ కరోలినా నించి వచ్చిన ఓ ముసలావిడ చెప్పింది, అతను అయోవాలో పంది మాంసం వ్యాపారంలో ఉన్నాడని, స్టాక్ మార్కెట్లో కూడా చాలా సంపాదించాడని, అందుకే ప్రతీ ఉదయం ది వాల్ స్ట్రీట్ జర్నల్’ అతని ఇంటి ముందు ఉంటుందని. అతని టెలీఫోన్ బిల్ కూడా ఎక్కువని టెలీఫోన్ ఆఫీస్‌లో పనిచేసే ఒకరి వదిన చెప్పింది.
అతనా ఇంటిని కొన్నాక తన ఇంటి చుట్టూ పనె్నండు అడుగుల ఎత్తున అదనపు గోడని నిర్మించాడు. పీపింగ్ టామ్‌ల చూపులను నిరోధించడానికి అని బాహాటంగా చెప్పాడు. తర్వాత తన కన్నా ముప్ఫై ఆరేళ్ళ చిన్నదైన ఆ అందాల భరిణని పెళ్ళి చేసుకుని తెచ్చి ఆ ఇంట్లో బంధించి ఉంచుతున్నాడు. ఇది జరిగి మూడు నాలుగేళ్ళైంది. వారి మధ్య పోట్లాటలు కాని, సంఘర్షణలు కాని ఎన్నడూ ఎవరూ చూడలేదు, వినలేదు.
ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. మిసెస్ కేమర్’ అని తప్ప ఆమె పేరు కూడా ఎవరికీ తెలీదు. అది లిలియన్’ అని ఒకరంటే కార్లా’ అని ఇంకొకరు అన్నారు. అంతా అంగీకరించిన విషయం మాత్రం ఆమె కంఠం మధురంగా ఉంటుందని.
కొత్తల్లో ఆమె ఒంటరిగా బ్యూటీపార్లర్‌కి వెళ్ళి రావడానికి ఆమె భర్త అనుమతించాడని, ఒకటి, రెండుసార్లు అతనికి జ్వరం వచ్చినప్పుడు లైబ్రరీకి కూడా వెళ్ళొచ్చిందని, తన భర్త పెద్ద జర్మన్ కారుని డ్రైవ్ చేయలేకపోవడంతో టేక్సీలో వెళ్ళి వచ్చిందని, లేదా అతను తన కారుని ముట్టుకోనివ్వకపోవడం వల్లని విన్నాను. ఆమెతో మాట్లాడిన వారంతా ఆమె చక్కగా మాట్లాడగలదని ఒప్పుకున్నారు.
వారిద్దరి మధ్య ప్రేమ ఎలా అంకురించింది అన్న అంశం మీద కూడా నేను చాలా కథనాలు విన్నాను. ఓసారి హార్ట్ ఎటాక్ వచ్చి అతను హాస్పిటల్లో చేరినప్పుడు ఆమె అతనికి సేవ చేసిన నర్స్.
అతను ఉన్న ఖరీదైన ప్రైవేట్ గదిలో నిత్యం అతని ఆఫీస్ నుంచి ఆమెకి పూలగుత్తి వచ్చేది. అతని కన్నా రెండేళ్ళు చిన్నదైన లావుపాటి భార్య అప్పుడు అతనికి ఉండేది. అతను హాస్పిటల్ నించి డిశ్చార్జ్ అయ్యాక కూడా నర్స్ అతని ఇంటికి చెకప్‌కి వెళ్ళేది. కొద్దివారాలకి ఆ లావుపాటి భార్య అకస్మాత్తుగా మరణించింది. ముందు రాత్రి తిన్నదేదో ఆమెకి పడలేదు.
మరో కథనం ప్రకారం అతను ఓ హోటల్లో బస చేసినప్పుడు ఆమె డెస్క్ క్లర్క్‌గా అక్కడ పనిచేసేది. అతను ఆమెని డబ్బుతో మభ్యపెట్టి పెళ్ళి చేసుకున్నాడు.. ఎలాగో వాళ్ళిద్దరికీ పెళ్ళైంది.
త్వరలోనే ఆమెని ఒంటరిగా బయటకి పంపడం మానేశాడు. వారి రొటీన్‌లో ఎన్నడూ నాకు మార్పు కనపడలేదు. ప్రతీ రెండు, నాలుగు శుక్రవారాలు వాళ్ళిద్దరూ కార్లో అతని డాక్టర్‌ని కలవడానికి తప్పనిసరిగా వెళ్తారు. ముందుగా పోస్ట్ఫాస్ దగ్గర ఆగుతారు. అతను కార్లో కూర్చుని ఉంటే ఆమె లోపలికి వెళ్ళి ఏదో పార్సిల్‌ని సౌత్ డకోటాకి పంపుతుంది. ఆమెది పెద్ద కుటుంబం, బీద కుటుంబం కాబట్టి ఆమె అల్లిన స్వెట్టర్లు, సాక్స్, గ్లవ్స్ లాంటివి పంపుతుంది. ఆ సమయంలో మాత్రమే ఆమె అతని దృష్టి నుంచి బయటకి వచ్చేది. సీజన్‌లో ఆరెంజ్ బుట్టలని, ఏపిల్ సాస్‌ని కూడా చేసి తన వాళ్ళకి పంపుతుంది. వారి మొదటి సంవత్సరం ఆమె బుక్ క్లబ్‌లో చేరి అనేక పత్రికలని కొని చదివేది. ఎందుకో ఆమె చదవడం ఆపేసి అల్లడం అభ్యాసం చేసుకుంది. ఆమె పంపే బరువుని బట్టి, ఆమె రోజంతా అల్లుతుందని పోస్టల్ క్లర్క్ ద్వారా తెలిసింది. సౌత్ డకోటాలో ఆమెకి ఆరుగురు సోదరులు ఉన్నారు. ఆమె మాట్లాడేది ఆ ముసలి క్లర్క్‌తోనే.
ఎర్నెస్టైన్ బార్లో ఆమె గురించి మాట్లాడటం అందరికీ అభిమానాంశమైంది. ఆ కోపధారి భర్త గురించి, ఊళ్ళోని అందగత్తె అయిన ఆమె గురించి మాట్లాడటానికి, వినడానికి కస్టమర్ల మధ్య పరిచయం అవసరం లేదు. ఫ్లోరిడా రాష్ట్రంలోనే ఆమె అందగత్తె అని కొందరు చెప్పడం కూడా నేను విన్నాను. అయితే ఆమె ఇంట్లోంచి బయటకి వచ్చినప్పుడు మేకప్‌లో ఉంటుంది కాబట్టి అది లేకుండా ఆమె ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు. సదా నల్ల కళ్ళజోడు వెనక ఉండే ఆమె కళ్ళ రంగు కూడా ఎవరికీ తెలీదు. నలుపా? తేనెరంగా? నీలమా? నేను బార్లో అందరి మాటలని బీర్ తాగుతూ వినేవాడిని తప్ప ఉదయం ఆమె సముద్ర స్నానం గురించి మాత్రం చెప్పలేదు. ఆ సమయంలో బార్‌లోని ఒక్క కస్టమర్ కూడా నిద్ర లేవడని నాకు తెలుసు. అట్లాంటిక్ మహాసముద్రం వైపు కిటికీలోంచి చూస్తూ, తాగుతూ వారి మాటలు వింటాను.
***
ఆ రోజు నేను అక్కడ కూర్చున్నప్పుడు ఆమె బీచ్‌లో ఇంటివైపు కాక, బార్‌వైపు నడిచి రావడం మొదటగా చూసింది నేనే. ఆ మధ్యాహ్నం పొడుగాటి ఆమె కాళ్ళని, నడకని బట్టి దూరం నించే ఆమెని పోల్చుకున్నాను. నిమిషం దాకా నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఎందుకంటే బీచ్ నించి ఆమె ఇంటికి తప్ప ఒంటరిగా ఇంకెటూ వెళ్ళదు. ఇటు రావడం మాకు హెడ్‌లైన్స్ వార్త. నల్లటి నిక్కర్, పసుపు పచ్చ బీచ్ జాకెట్ వేసుకున్న ఆమె కళ్ళకి ఎప్పుడూ ఉండే నల్ల కళ్ళజోడు లేదు.
మెత్తటి పొడి ఇసక మీద ఆమె నడక హంస నడకే. ఆమె నిజంగా మా బార్ వైపే వస్తోందని గ్రహించినా, నేను ఎవరికీ ఆ సంగతి చెప్పలేదు. బార్లోని అంతా తన వంకే చూడటం ఆమెకి ఇబ్బందిగా ఉంటుందని అనుకున్నాను. ఆమె ఎన్నడూ ఆ బార్‌కి కాని, దాని చుట్టుపక్కలకి కాని రాలేదన్నది సత్యం. ఆమె బార్‌కి వస్తుందా? లేక పక్కనే మెట్లెక్కి పైకి రోడ్ మీదకు వెళ్తుందా అన్నది నాకు తెలీలేదు. లేదా పక్కనే ఉన్న మినీ డ్రగ్ స్టోర్‌కి భర్తకి మందులు కొనడానికి వెళ్తుందని అనుకున్నాను.
కాని ఆమె బార్లోకి వచ్చి సరాసరి ఓ బార్ స్టూల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. బార్‌కి తరచూ వచ్చే వాళ్ళు తమ పేకాటని మానేసి ఆమె వంకే తేరిపార చూడసాగారు. అన్ని రకాల ఆశ్చర్యాలని సాధారణంగా చూసే ఫ్రెడ్ కూడా ఆమె వంక కొద్దిగా నివ్వెరపోతూ చూశాడు. స్నానపు దుస్తుల్లోని వారు బార్లోకి అనుమతించబడరని గతంలో కొందరికి చెప్పి పంపేసినట్లుగా ఫ్రెడ్ ఆమెకి చెప్పి పంపలేదు. బహుశ ఆ నియమాన్ని తాత్కాలికంగా మర్చిపోయినట్లున్నాడు.
నేను కూర్చున్న చోటికి వినపడనంత నెమ్మదిగా ఆమె ఓ కాక్‌టైల్‌ని ఆర్డర్ చేసింది. అది ప్రత్యేకమైంది కాదు. సాధారణ కాక్‌టైలే. ఫ్రెడ్ దాన్ని కలుపుతూ కస్టమర్లతో మాట్లాడే సాధారణ మాటలు కూడా ఆమెతో మాట్లాడలేదు. ఆమె దాన్ని కొద్దిగా తాగి బావుందన్నట్లుగా వెంటనే ఇంకొంచెం తాగింది. తర్వాత గడ్డితో చేసిన తన హేండ్‌బేగ్‌లోంచి కింగ్ సైజ్ లేడీస్ సిగరెట్‌ని తీసి నోట్లో పెట్టుకుని బరువైన తన బంగారు సిగరెట్ లైటర్ని వెతికి తీసేలోగా ఇద్దరూ వేగంగా ఆమె దగ్గరికి తమ సిగరెట్ లైటర్లతో వెళ్ళారు. అయితే ఇద్దరూ కొద్దిగా ఆలస్యం చేయడంతో ఆమె తన దాంతోనే సిగరెట్ వెలిగించుకుని వారి వంక కఋతజ్ఞతగా చూస్తూ నవ్వింది. ఆ డ్రింక్‌ని పూర్తిచేసి అదే తగ్గు స్వరంతో చెప్పింది.
‘బావుంది.’22
కొన్ని నోట్లని బార్ కౌంటర్ మీద ఉంచింది.
‘ఇంకోటి?’ ఫ్రెడ్ అడిగాడు.
‘నో. థాంక్స్. ఒక్కటి మించి తాగను. నేను మీ బార్ గురించిన ప్రకటనలని రేడియోలో చాలాసార్లు విన్నాను. వద్దామని అనుకున్నాను. కాని ఇప్పటికి కుదిరింది’ చెప్పి ఆమె లేచి బయటకి వెళ్ళిపోయింది.
మేమంతా కిటికీల్లోంచి ఆమె తన ఇంటివైపు నడవడం చూశాం. కాని అప్పుడు మాకు తెలీని విషయం ఆమె భర్త మరణించాడని, అతని శవం సన్ డెక్ మీద ఉందని. మధ్యాహ్నం భోజనం చేశాక అతను సన్ డెక్ మీద కునుకు తీస్తూ హార్ట్ ఎటాక్‌తో పోయాడని విన్నాను.
***
కానీ డాక్టర్ తర్వాత మాతో చెప్పినట్లుగా అతను అంత ఎండలో ఎప్పుడూ ధరించే పనామా హేట్ పెట్టుకోకుండా, సన్ లోషన్ రాసుకోకుండా ఎందుకు పడుకున్నట్లు? అశ్రద్ధ అని డాక్టర్ చెప్పాడు. దాంతో వడదెబ్బ కొట్టి పోయాడు. కొందరు రకరకాల అనుమానాలని వ్యక్తం చేస్తే డాక్టర్ అశ్రద్ధ తప్ప మరేదీ కారణం కాదని చెప్పాడు.
అతని మరణం మీద ఎవరికీ ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయేమో కాని ఎవరూ మాతో ఎన్నడూ వాటిని పంచుకోలేదు.
ఆమె ప్రభావం అంతటిది.
(డేవిడ్ పెటీ జ్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి